logo

మూగజీవాల ఉసురు తీస్తున్నారు..

జిల్లాలో మూడు మండలాల గుండా నిశిరాత్రిలో సాగే ఈ అక్రమ దందాలో దారి పొడవునా దళారులు డబ్బులు ఇచ్చుకుంటూ తమ పనికి అడ్డురాకుండా జాగ్రత్త పడుతున్నారు.

Published : 06 Feb 2023 05:17 IST

యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా
ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

గోయగాంలో తరలించడానికి సిద్ధంగా పశువులు

జిల్లాలో మూడు మండలాల గుండా నిశిరాత్రిలో సాగే ఈ అక్రమ దందాలో దారి పొడవునా దళారులు డబ్బులు ఇచ్చుకుంటూ తమ పనికి అడ్డురాకుండా జాగ్రత్త పడుతున్నారు. అర్ధరాత్రి 12 తర్వాత ప్రారంభమయ్యే ఈ అక్రమ తరలింపు తెల్లవారుజాము వరకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో ముగుస్తుంది.


జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా మూగజీవాలను వాహనాల్లో కుక్కి వాటి ప్రాణాలు తీస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా పశువులను తరలించాలంటే సంతలో కొనుగోలు చేసిన ధ్రువపత్రం ఉండాలి. పశు వైద్యుల ధ్రువీకరణతో పాటు ఒక్కో వాహనంలో ఆరు మాత్రమే తీసుకెళ్లాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు.

లంపీస్కిన్‌ వ్యాధి ప్రబలుతున్న తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి పశువుల రవాణా పూర్తిగా నిషేధించారు. కానీ ఇక్కడ నుంచి నిత్యం పదుల సంఖ్యలో వాహనాల్లో పశువులను కుక్కి తరలిస్తున్నారు. ఆర్టీఏ అధికారులు, ఇటు పోలీసులు ఒక్క వాహనాన్ని పట్టుకున్న దాఖలాలు లేవు. రహదారి పక్కనే పోలీస్‌స్టేషన్‌లు ఉన్నా, వాంకిడిలో చెక్‌పోస్టు ఉన్నా ఈ అక్రమ తరలింపునకు అడ్డుకట్ట పడటం లేదు.

పాత రసీదులతో తరలింపు..

వాంకిడి మండలంలో గణేశ్‌పూర్‌, గోయగాంలో ప్రతి మంగళవారం పశువుల సంత నిర్వహించేవారు. ఇప్పుడు సంత జరగకున్నా నిత్యం ఇక్కడకు వేరే రాష్ట్రాల నుంచి పశువులను తెచ్చి పాత తేదీలతో సంతలకు సంబంధించి రసీదులు చింపి జీవాలను తీసుకెళ్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు ఈ రెండు గ్రామాల్లో పశువుల తరలించే మాఫియాగా ఏర్పడ్డారు. ఏకంగా గ్రామం అవతల మరో కొత్త గ్రామాన్నే సృష్టించారు. ఈ రెండు గ్రామాల్లో 30 వరకు మూగజీవాలను తరలించే ప్రత్యేక వాహనాలు ఉన్నాయంటే తరలింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కౌటాల, చింతలమానేపల్లి, సిర్పూర్‌(టి) మండలాల నుంచి కాగజ్‌నగర్‌ క్రాస్‌రోడ్డు మీదుగా పశువుల అక్రమ రవాణా సాగుతోంది.

నిత్యం 15 నుంచి 20 వాహనాలు..

మహారాష్ట్రలోని చంద్రపూర్‌, గడ్చిరోలి జిల్లాలోని పల్లె ప్రాంతాల నుంచి ఆవులు తెస్తున్న వ్యక్తులు గోయగాంలో ఉంచుతారు. ఒక్కో వాహనంలో 30 నుంచి 40 వరకు వీటిని ఉంచి తీసుకెళుతారు. ‘మార్గమధ్యలో ఉన్న వ్యక్తులకు, కొందరు అధికారులకు, ప్రతినెలా రూ.60 నుంచి రూ.లక్ష వరకు మామూళ్లు ఇస్తుంటాం, ఒక్కో వాహనానికి అన్ని ఖర్చులు పోను రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు మిగులుతాయని’’ ఈ వృత్తి మానేసిన అదే గ్రామానికి చెందిన వ్యక్తి చెబుతున్నారు. అంటే సగటున ఒక్కరోజుకు పది వాహనాల్లో పశువులు తీసుకెళ్లినా రూ.10 లక్షలు, నెలకు సుమారు రూ.3 కోట్ల దందా నడుస్తోంది.

చెక్‌పోస్టులు తీసేశారు?

ఈ తరలింపు తంతును అడ్డుకోవడానికి వాంకిడి మండలంలో బుదల్‌ఘాట్ వాగు వద్ద, సిర్పూర్‌(టి) మండల కేంద్రం, వెంకట్రావ్‌పేట్ వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఏమైందో, ఎవరు ఒత్తిడి చేశారో తెలియదు గాని ఆరు నెలల క్రితమే వాటిని తొలగించారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ అక్రమ వ్యవహారాలను అడ్డుకుని, మూగజీవాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


* ఇతర రాష్ట్రాల నుంచి ఆవులను కారుచౌకగా తీసుకొస్తారు. వాటిని గ్రామ శివారు ప్రాంతంలో కట్టేస్తారు. మేత, తాగునీరు ఏదీ ఉండదు. అదను చూసుకుని అర్ధరాత్రి వ్యాన్‌లో 30-40 మూగజీవాలను ఒకేసారి ఎక్కిస్తారు. ఆవు తల పైకి ఉండి, గాలి తీసుకునేలా వాహనంలో స్థలం ఉంటుంది. వాహన వేగానికి కుదుపులకు చనిపోయిన వాటిని రహదారి పక్కనే పడేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని