logo

Adilabad: జైన సన్యాసినిగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

వైద్య విద్యార్థిని నువ్వేం చేస్తావని ప్రశ్నిస్తే? రోగుల ప్రాణాలను కాపాడుతానని నమ్మకంగా చెప్పొచ్చు.

Updated : 14 Jan 2024 07:18 IST

ఆత్మను పరిపూర్ణం చేసుకునేందుకేనని వెల్లడి

ట్వింకల్‌ కామ్‌దార్‌

ఈటీవీ - ఆదిలాబాద్‌ : వైద్య విద్యార్థిని నువ్వేం చేస్తావని ప్రశ్నిస్తే? రోగుల ప్రాణాలను కాపాడుతానని నమ్మకంగా చెప్పొచ్చు. అదే ప్రశ్న ఓ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడిని అడిగితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తానని వెల్లడించవచ్చు. ఆదిలాబాద్‌కు చెందిన 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ట్వింకల్‌ కామ్‌దార్‌ మాత్రం జైన సన్యాసినిగా మారుతానని ప్రకటించేవారు. అనుకున్నట్లుగానే అటువైపు అడుగులు వేశారు. సన్యాసం స్వీకరించేందుకు ప్రాపంచిక కోరికలు - అనుబంధాలను త్యజించేలా సంప్రదాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్‌ పట్టణం కుమార్‌పేట్‌కు చెందిన శ్వేతా కామ్‌దార్‌, దివంగత గిరీష్‌బాయ్‌ కామ్‌దార్‌కు ఇద్దరు సంతానం. కొడుకు విపుల్‌కుమార్‌ స్థానికంగా వ్యాపారం చేస్తుంటారు. రెండో సంతానమైన కూతురు ట్వింకల్‌ కామ్‌దార్‌ హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. అక్కడే ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఆదిలాబాద్‌లో 2007లో జైన మత గురువు రాంలాల్‌జీ మహరాజ్‌ బోధనలకు ఆకర్షితురాలైన ఆమె కుటుంబీకుల అనుమతితో సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో శనివారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమైన చందన మండప పూజ క్రతువు ఆదివారం ముగియనుంది. ఈ నెల 22న మధ్యప్రదేశ్‌లోని జావ్‌దాలో దీక్షా మహాత్సవం - మహాభినిష్క్రమణ అనంతరం జైన సన్యాసినిగా మారనున్నారు. ‘‘ఆత్మను తెలుసుకుంటే - ఆత్మహత్యలకు దారితీయదు. విశ్వాన్ని కుటుంబంగా భావిస్తే భవబంధాల చక్రంలో చిక్కుకోమనే విషయాన్ని యువత తెలుసుకుంటే మానసికమైన ఏ ఇబ్బంది రాదని’’ అంటున్నారు. సన్యాసిగా మారుతున్నందున ఆనందంగా ఉందని ట్వింకల్‌ కామ్‌దార్‌  ‘‘ఈనాడు-ఈటీవీ’’తో వివరించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని