logo

తనిఖీల వేళ.. బయటపడుతున్న గంజాయి

మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిస్తున్నా జిల్లాలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు.

Published : 16 Apr 2024 02:57 IST

16 కేసులు నమోదు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ నేర విభాగం

ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ సమీపంలో గంజాయి  తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిస్తున్నా జిల్లాలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఎన్నికల నియమావళి అమలైనప్పటి నుంచి పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. గత నెల 19 నుంచి ఎన్నికల నియమావళి అమలు కాగా ఇప్పటి వరకు అంటే దాదాపు నెల రోజుల్లోనే ఈ రెండు శాఖల అధికారులు 41 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేయటం దీనికి బలం చేకూరుస్తోంది. పోలీసు, ఎక్సైజ్‌ అధికారుల ముమ్మర తనిఖీల వల్ల ప్రస్తుతం కొంత వరకు గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడినట్లయింది. కేవలం ఎన్నికల సందర్భంగానే కాకుండా నిరంతరంగా అధికారులు తనిఖీలు కొనసాగిస్తే జిల్లాలో గంజాయిని పకడ్బందీగా అరికట్టవచ్చని పలువురు సూచిస్తున్నారు.  

జిల్లాలోని పలు మారుమూల మండలాల్లో కొందరు రైతులు గుట్టుగా గంజాయి సాగు చేస్తుంటారు. వారు పండించిన గంజాయిని ఎండబెట్టి స్థానికంగానే కాకుండా మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తుంటారు. కొందరు ఆంధ్రా ప్రాంతం నుంచి సైతం గంజాయిని కొనుగోలు చేసి జిల్లా మీదుగా మహారాష్ట్రకు తరలించటం పరిపాటిగా మారింది. స్థానికంగా గంజాయిని చిల్లరగా విక్రయించే వారు కొనుగోలు చేసి 5, 10 గ్రాముల చొప్పున పొట్లాలు కట్టి అమ్ముతున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం

గంజాయికి బానిసలుగా మారుతున్న యువత శాంతిభద్రతలకు విఘాతం కలిగించటం పరిపాటిగా మారింది. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్శిద్‌నగర్‌, సుందరయ్యనగర్‌, సుభాష్‌నగర్‌, చిలుకూరి లక్ష్మీనగర్‌ తదితర కాలనీల్లో కొందరు గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చి పొట్లాల రూపంలో విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలో కొందరు యువకులు వారి నుంచి కొనుగోలు చేసి మత్తులో తూలుతున్నారు. పట్టణంలోని కొన్ని కాలనీల్లో గంజాయి తాగుతూ రాత్రుల్లో గుంపులుగా యువకులు కనిపిస్తుంటారు. ఇటీవల ఆదిలాబాద్‌ పట్టణంలో చోటు చేసుకున్న కత్తిపోట్ల ఘటన సైతం గంజాయి విక్రయాలకు సంబంధించిన డబ్బుల విషయమై జరిగిందని సమాచారం. డబ్బుల కోసం ఘర్షణ పడి కత్తులతో దాడి చేయగా ముగ్గురు గాయాలపాలయ్యారు. ఇలా గంజాయికి అలవాటు పడి జీవితాలను యువకులు నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టాలంటే నిరంతర తనిఖీలు కొనసాగిస్తూ, పోలీసులు పెట్రోలింగ్‌ ముమ్మరం చేసి రాత్రుల్లో యువకులు అకారణంగా బయట తిరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు.

41 కిలోలు స్వాధీనం..

ఎన్నికల నియమావళి అమలు అనంతరం పోలీసు, ఎక్సైజ్‌ శాఖాధికారులు రూ.12 లక్షల విలువైన 41 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 29 మంది నిందితులపై 16 కేసులు నమోదు చేశారు. ఆ శాఖలు పట్టుకున్న గంజాయి, విలువ, కేసులు, నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని