logo

నిధుల ప్రవాహం.. తీరాలి దాహం

చెన్నూరు పట్టణంలోని శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటికోసం నిధులు అందుబాటులో ఉండటంతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు.

Published : 18 Apr 2024 04:00 IST

బల్దియాలకు రూ. 92.90 లక్షలు మంజూరు

చెన్నూరు పట్టణంలోని ఒడ్డెపల్లి కాలనీలో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా

చెన్నూరు పట్టణంలోని శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటికోసం నిధులు అందుబాటులో ఉండటంతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు.

చెన్నూరు, న్యూస్‌టుడే: ఈసారి ఎండాకాలం ప్రారంభంలోనే జలాశయాలు అడుగంటాయి. నాలుగేళ్లుగా నీటి కొరత లేకుండా నిల్వలు ఉండగా.. ఈసారి దానికి భిన్నంగా ఉండటం, భూగర్భ జలాలు పడిపోతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి తీవ్రత తీవ్రంగా ఉండటంతో పట్టణాల్లో తాగునీటి అవసరాలు మరింత పెరిగాయి. ఇళ్లలో ఉన్న బోరుబావులు ఎండిపోతుండటంతో తాగడానికి, ఇతర అవసరాలకు కుళాయి నీటిపైనే ఆధారపడుతున్నారు. శుద్ధి జలం సక్రమంగా అందకపోవడంతో సరఫరా సమయాల్లో మార్పులు వచ్చాయి. సరఫరాల్లో సమస్యలు రాకుండా ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళిక-2024 కింద నిధులు మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడు పురపాలక సంఘాలకు రూ.92.90 లక్షల నిధులు కేటాయించింది.

ప్రత్యామ్నాయ చర్యలకు..

పట్టణాల్లో రానున్న మూడు నెలల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. బావులు, చెరువులు, జలాశయాల్లో ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రణాళికలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పట్టణాల్లో రోజూ నీటి సరఫరా చేయాల్సి ఉండగా వివిధ జలాశయాల్లో నీటిమట్టం తగ్గిపోతుండటం, వాటర్‌ పంపింగ్‌ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో కొద్దిరోజులుగా రోజువిడిచి రోజు నల్లా నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. జలాశయాల నుంచి నీటిని పంపింగ్‌ చేసుకునేందుకు బూస్టర్‌ పంపుల సామర్థ్యం పెంచుకునేందుకు చర్యలు తీసుకున్నారు. 160 కేవీఏ విద్యుత్తు నియంత్రికలను 220 కేవీఏకి మార్చుకోవడం, అవసరమున్న చోట అదనంగా మోటార్లను ఏర్పాటు చేసేందుకు పలు మున్సిపాలిటీల్లో ప్రణాళికలు రూపొందించారు.

వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యలు గుర్తించేందుకు అధికారులు ఇలా ఇంటింటికీ తిరుగుతూ పరిశీలిస్తున్నారు.

తాగునీటి అవసరాలకు వినియోగం

తాగునీటి అవసరాలు తీర్చేందుకు పురపాలికలు పంపించిన ప్రణాళికల ఆధారంగా నిధులు మంజూరు చేశారు. శివారు ప్రాంతాల్లో పైపులైన్లు లేని కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, శుద్ధి కేంద్రాలు, పంపింగ్‌ చేసే చోట పంపులు, మోటార్లు, చేతిపంపులు, పవర్‌బోర్లను మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుంది. పైపులైన్ల లీకేజీలు తొలగించడం, వాల్వులు బాగు చేసుకోవడానికి ఈ నిధులు వినియోగించే వీలుంది.


మరమ్మతులు చేపడుతున్నాం
గంగాధర్‌, పురపాలిక కమిషనర్‌, చెన్నూరు

పట్టణంలో తాగునీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. లీకేజీలను గుర్తించి తక్షణం వాటి మరమ్మతులు చేపడుతున్నాం. శివారు కాలనీల్లో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడితే అందుబాటులో ఉన్న ట్యాంకర్లతో ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్నాం. పురపాలికకు వేసవి కార్యాచరణ ప్రణాళిక కింద నిధులు మంజూరైనందున ఇక సమస్య ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని