logo

ఎన్నికల సమర శంఖారావం..

పార్లమెంట్‌ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది.  ఈ పోరులో పాల్గొనే వివిధపార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల నామపత్రాల దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది.

Updated : 18 Apr 2024 05:34 IST

నేటినుంచి నామపత్రాల స్వీకరణ  
ఓటర్లు 16,44,715.. పోలింగ్‌ కేంద్రాలు 2,199
ఈటీవీ - ఆదిలాబాద్‌

పార్లమెంట్‌ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది.  ఈ పోరులో పాల్గొనే వివిధపార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల నామపత్రాల దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది. ఏడు శాసనసభ స్థానాలతో విస్తరించిన ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో గత ఫిబ్రవరి 8న విడుదల ఓటరు జాబితా ప్రకారం మొత్తం 16,44,715 మంది ఓటర్లున్నట్లు అధికార యంత్రాంగం తేల్చింది. ఇందులో 2,57,248 మంది ఓటర్లతో నిర్మల్‌ నియోజకవర్గం మొదటిస్థానంలో ఉంటే  2,10,915 ఓటర్లతో బోథ్‌ నియోజకవర్గం చివరిస్థానంలో ఉంది. ఫిబ్రవరి 8 నుంచి ఈ నెల 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకున్న ఓటర్ల అనుబంధ జాబితా ఈ నెల 25న వెల్లడికానుంది. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఆవరణలో గురువారం నుంచి ప్రారంభం కానున్న నామపత్రాల స్వీకరణ ఈ నెల 25తో ముగియనుంది. ఏప్రిల్‌ 26న నామపత్రాల పరిశీలన, 29న నామపత్రాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత మే 13న పోలింగ్‌ జరగనుంది. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,111 పోలింగ్‌ కేంద్రాలను యంత్రాంగం ఎంపిక చేసింది. కానీ కొన్ని చోట్ల 1,500 మంది కంటే పైబడి ఓటర్లున్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని అదనంగా మరో 88 సహాయ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సైతం ఎన్నికల కమిషన్‌ అనుమతించింది. వీటితోకలిపి మొత్తం పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 2,199 అన్నమాట. ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఆలోచనలతో అధికారిక సమీక్షలకు ప్రాధాన్యం ఇస్తున్న అధికార యంత్రాంగం కొత్త ఓటర్ల నమోదు, పోలింగ్‌ శాతం పెంపుదల తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో కాస్త వెనుకబడే ఉంది.

నామినేషన్ల స్వీకరణ కోసం కలెక్టరేట్‌ పరిసరాల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పాలనాధికారి రాజర్షిషా, ఎస్పీ గౌష్‌ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా తదితరులు


మావోయిస్టులపై పోస్టర్లు..

‘మావోయిస్టుల సమాచారం మాకు. బహుమతి మీకు’ అంటూ సిరికొండ మండలం చెమ్మన్‌గూడలో పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. అసలు మావోయిస్టుల ప్రాబల్యమే లేదని ప్రకటిస్తూనే మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెంచారు. మొత్తం 2,199 కేంద్రాలకుగాను 132 ప్రాంతాల్లోని 252 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. పార్లమెంటు స్థానం పరిధిలోని ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ నిర్వహణకు అవకాశం ఉంటే ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే అనుమతి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని