logo

తునికాకు సేకరణకు వేళాయె..

ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అటవీశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో ఆకు నాణ్యత బాగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు

Published : 24 Apr 2024 07:22 IST

అడవి విస్తీర్ణం 1,82,604 చ.హె.

అడవి రేంజ్‌లు 09

 తునికి ఆకు యూనిట్లు 08
ఉపాధి పొందే కూలీలు 3,056
తునికి ఆకు కల్లాలు 162

అడవిలో ఏపుగా పెరిగిన తునికి ఆకు చెట్టు

ఎదులాపురం, న్యూస్‌టుడే: ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అటవీశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో ఆకు నాణ్యత బాగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సారి ఆకు సేకరణ యూనిట్లు గణనీయంగా తగ్గాయి. గతంలో 21 యూనిట్లు ఉండగా ప్రస్తుతం ఎనిమిది యూనిట్లకే పరిమితమయ్యాయి. ఆకు నాణ్యంగా రావాలంటే నెల రోజులు ముందుగా ప్రూనింగ్‌(కొమ్మ కొట్టటం) చేయాల్సి ఉంటుంది. తునికి చెట్లకున్న చిన్న చిన్న కొమ్మలు నరికి వేస్తే ఎక్కువ మోతాదులో నాణ్యమైన ఆకు వస్తుంది. కానీ రెండు, మూడేళ్లుగా కొమ్మ కొట్టే ప్రక్రియను అటవీశాఖ విస్మరించింది. దీంతో నాణ్యమైన ఆకు రాక ఆశించిన లక్ష్యం నెరవేరకపోవడంతో యూనిట్ల కొనుగోలుకు గుత్తేదారులు అనాసక్తి ప్రదర్శిస్తుండటంతో అటవీశాఖ యూనిట్ల సంఖ్యను తగ్గిస్తోంది.  
జిల్లాలో రైతు కూలీలకు వేసవిలో వ్యవసాయ పనులు లేకపోవటంతో తునికి ఆకు సేకరణే ప్రధాన ఆదాయ వనరు. తెల్లవారుజామునే అడవికి వెళ్లి తునికి ఆకు సేకరించి మూటల్లో ఇళ్లకు తరలిస్తారు. ఇంట్లోనే నీడ పట్టున కుటుంబ సభ్యులంతా యాభై ఆకులను ఒక కట్టగా కట్టి వాటిని కల్లాలపై విక్రయిస్తారు. ఇలా జిల్లాలో దాదాపు మూడు వేలకుపైగా మంది ఉపాధి పొందుతారు. అటవీశాఖ యాభై ఆకుల కట్టను రూ.మూడు చొప్పున వారి వద్ద కొనుగోలు చేసి ఎండబెట్టి 1,000 కట్టలను ఒక స్టాండర్డ్‌ బ్యాగుగా నింపి గుత్తేదారులకు అప్పగిస్తుంది. ఈ నెల 25 నుంచి ఆకు సేకరణ కల్లాల ద్వారా సేకరించటానికి ఏర్పాట్లు చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఓ గులాబ్‌సింగ్‌ తెలిపారు. కూలీలు ఆకు సేకరణలో ఒక్కొక్క కుటుంబం రోజుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదిస్తారు. ఇలా వేసవిలో తునికి ఆకు సేకరణ దాదాపు 25 నుంచి ముప్పై రోజులవరకు కొనసాగి కూలీలకు ఉపాధి లభిస్తుంది. స్థానికంగా బీడీలు చుట్టే కార్మికులు సైతం ఆకు సేకరించి నిల్వ చేసుకుంటుంటారు.

వర్షాలతో నాణ్యమైన ఆకు..

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో అడపాదడపా, భారీగా అకాల వర్షాలు నాణ్యమైన తునికి ఆకు రావటానికి దోహదం చేశాయి. సాధారణంగా అటవీశాఖ మే మొదటి వారం నుంచి ఆకు సేకరణ ప్రారంభిస్తుంది. కానీ ప్రస్తుతం వర్షాలతో నాణ్యమైన ఆకు ఉత్పత్తి అవగా ఈ నెలలోనే సేకరణ ప్రారంభించటానికి ఏర్పాట్లు చేసింది. లక్ష్యం కంటే ఎక్కువ సేకరణ జరిగే అవకాశాలున్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని