logo

Gannavaram: షాక్‌ల మీద షాక్‌లు.. వల్లభనేని వంశీకి ‘సొంత’ వర్గం ఝలక్‌

గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సొంత పార్టీలో సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి పనిచేసేది లేదని తెగేసి చెప్పేశారు

Updated : 25 Mar 2024 10:36 IST

కీలక నేతలంతా తెదేపాలోకి.. 

యార్లగడ్డ సమక్షంలో పార్టీలో చేరిన    పాలడుగు నాని

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే : గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సొంత పార్టీలో సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి పనిచేసేది లేదని తెగేసి చెప్పేశారు. ఆయన వర్గీయుల్లో చాలా మంది ఇప్పటికే తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నాయకత్వాన్ని బలపరుస్తూ తెదేపాలో చేరిపోయారు. గన్నవరం వైస్‌ ఎంపీపీ, బాపులపాడు మండలానికి చెందిన నలుగురు సర్పంచులు కొద్ది కాలం కిందట పసుపు కండువాలు కప్పుకొన్నారు. గత కొన్నిరోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి.

నాలుగు మండలాల్లోనూ పెద్ద సంఖ్యలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు వైకాపాను వీడి సైకిల్‌ ఎక్కుతున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన వారు, ఆయన సామాజిక వర్గంలో కీలక నాయకులుగా గుర్తింపు పొందిన వారంతా ఒక్కొక్కరుగా యార్లగడ్డ వైపు వచ్చేస్తున్నారు. గన్నవరం మండలంలో కీలక నాయకుడిగా ఉన్న ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ పొట్లూరి బసవరావు తన స్వగ్రామం కేసరపల్లిలో భారీ బల ప్రదర్శన చేసి.. తెదేపాలోకి పునరాగమనం చేశారు. గన్నవరం ఉప సర్పంచి, విజయ డెయిరీ డైరెక్టర్‌ పాలడుగు నాని, బీబీగూడెంకు చెందిన కీలక నాయకులు బోయపాటి బసవపూర్ణయ్య(నల్లబాబు), బోయపాటి బుల్లియ్య ఇటీవలే తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

బాపులపాడు మండలంలో గతంలో తెదేపా మండలాధ్యక్షుడిగా వ్యవహరించి, వంశీ పార్టీ ఫిరాయించడంతో పదవికి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాలకు దూరమైన వీరమాచనేని సత్యప్రసాద్‌ ఇటీవల చురుగ్గా వ్యవహరిస్తున్నారు. యార్లగడ్డకు మద్దతుగా ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. ఇదే మండలానికి చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు సుంకర సుభాష్‌చంద్రబోస్‌ సైతం యార్లగడ్డకు జైకొట్టారు. పాతతరం కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్న ఈయన.. మొన్నటివరకు వంశీకి మద్దతుగా వ్యవహరించేవారు. కొద్దిరోజుల కిందట అధికార పార్టీ నాయకుల అరాచకాలకు నిరసనగా ఎనికేపాడులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బోసు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నాయకులుగా గుర్తింపు పొంది, నిన్నటి వరకు వంశీకి అత్యంత దగ్గరివారుగా వ్యవహరించిన వారే దూరమవ్వడం, వారితో పాటు, బీసీ, ఎస్సీలు కూడా పెద్ద సంఖ్యలో తెదేపాలో చేరడంతో గన్నవరంలో వైకాపా శిబిరం డీలా పడిపోయిందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని