logo

బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!

‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు.

Updated : 24 Apr 2024 09:50 IST

వైకాపాను భారీగా వీడుతున్న ముఖ్య నాయకులు
తెదేపా, జనసేన, భాజపాలోకి వరదలా వలసలు

‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. అయినా.. ఫలితం లేదు.. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. మాకు ఒరిగిందేమీ లేదు.. మరోసారి గెలిస్తే మాత్రం మమ్మల్ని ఏం ఉద్ధరిస్తారని.. వైకాపా నాయకులు.. తెదేపా, జనసేన, భాజపాల్లోకి వెల్లువలా వెళ్లిపోతున్నారు.’’

ఈనాడు, అమరావతి: ‘‘వైకాపా తరఫున గత ఎన్నికల్లో అత్యంత కీలకంగా పనిచేసిన నాయకులు కూడా.. ఇక తమవల్ల కాదని.. దండం పెట్టి వెళ్లిపోతుండడంతో.. అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ప్రజల్లోనే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందనుకుంటే.. ఇలా సొంత పార్టీలోనూ ఇప్పుడు అదే కనిపిస్తుండడంతో వారికి ఏం చేయాలో అర్థంకాకుంది.’’

మ్మడి కృష్ణా జిల్లా వైకాపా నేతలు ఒక్కొక్కరిగా బయటకొచ్చేస్తున్నారు. గతంలో ఏ అధికార పార్టీలో లేనంత దయనీయం వైకాపాలో నెలకొంది. గుడివాడ వంటి నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ దారుణం. నిత్యం.. నాయకులు వెళ్లిపోతూనే ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరైనా నాయకుడు పార్టీని వీడి వెళ్తున్నారనే సమాచారం రాగానే.. అర్ధరాత్రి వాళ్ల ఇంటికి అభ్యర్థులే వెళ్లి బుజ్జగిస్తున్నారు. ఆర్థికంగా తాయిలాలు ఇచ్చి అయినా ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. ఎంపీ బాలశౌరికి మంచి పట్టుంది. ప్రత్యేకంగా వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఆయన వెళ్లడం గట్టి దెబ్బే. బీసీ నేత పార్థసారథి పార్టీని వీడగా.. కంకిపాడు, ఉయ్యూరు మండలాల వారు అనుసరించారు.

ద్వితీయ శ్రేణి ఖాళీ..

పెనమలూరులో పార్థసారథితో పాటు ఎంపీపీ, మండల వైకాపా అధ్యక్ష, ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, పీఏసీఎస్‌ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు.. పెద్దసంఖ్యలో తెదేపాలో చేరారు. గన్నవరంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా వలసలు పెరిగాయి. బాలశౌరి రాకతో కృష్ణా జిల్లా జనసేనలోకి కూడా భారీగా చేరికలు పెరిగాయి. అవనిగడ్డ వైకాపాలో కీలక నేతలు ఒక్కొక్కరిగా జనసేన గూటికి చేరుతున్నారు. వైకాపా ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి గుడివాడ శివరావు ఆపార్టీని వీడి జనసేనలో చేరారు. అవనిగడ్డ మండలం పాతఎడ్లంకలో సర్పంచి, ఉపసర్పంచి, మాజీ సర్పంచి సహా గ్రామస్థులంతా మండలి బుద్ధప్రసాద్‌ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వేకనూరు, బ్రహ్మానందపురం తదితర గ్రామాలకు చెందిన వందల వైకాపా కుటుంబాలు జనసేనలో చేరాయి. పెడన నియోజకవర్గం నుంచి భారీగా జనసేనలోకి వలసలు మొదలయ్యాయి. తాజాగా ఎంపీ బాలశౌరి సమక్షంలో పెడనకు చెందిన వంద మందికి పైగా వైకాపా కుటుంబాలు జనసేన కండువా వేసుకున్నాయి. గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుతో విసిగి చాలామంది వైకాపాను వీడుతున్నారు. గన్నవరం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పొట్లూరి బసవరావు, విజయ డెయిరీ డైరెక్టర్‌ పాలడుగు నానితో సహా కీలక నాయకులు తెదేపా గూటికి చేరారు. సర్పంచులు ఒక్కొక్కరుగా వైకాపాను వీడుతున్నారు. ఇప్పటికే పదిమందికి పైగా గన్నవరం పరిధిలో ఎమ్మెల్యేలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. గుడివాడలోనూ నిత్యం తెదేపాలోకి చేరికలు ప్రవాహంలా మారాయి. మైనార్టీ కీలక నాయకుడు షేక్‌ మౌలాలి, వైకాపా వార్డు కన్వీనర్లు, ఎంపీటీసీలు సహా నిత్యం నేతలు బారులుతీరి మరీ బయటకొచ్చేస్తున్నారు.


వాలంటీర్లూ వదిలేస్తున్నారు..

రాజీనామాలు చేసి వైకాపా తరఫున ప్రచారం చేయాలని ఆ పార్టీ నాయకులు వాలంటీర్లపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వాళ్లు రాజీనామాలు చేసి తెదేపా గూటికి చేరి వైకాపా నేతలకు ఝలక్‌ ఇస్తున్నారు. తాజాగా జక్కంపూడి కాలనీకి చెందిన వాలంటీర్లు జి.నాగరాజు, జి.దుర్గాపస్రాద్‌, స్వరూప్‌బాబు.. రాజీనామా చేసి తెదేపాలో చేరారు. వీరి వెంట జక్కంపూడి కాలనీ యువకులు చాలామంది తెదేపా గూటికి చేరారు. గన్నవరం పరిధిలోనూ అంబాపురం సర్పంచి సీతయ్యతో కలిసి నలుగురు వాలంటీర్లు తెదేపాలో చేరారు. విజయవాడ నగరంలో వైకాపా నేతల ఒత్తిడి తాళలేక పెద్దసంఖ్యలో వాలంటీర్లు తెదేపా గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు