logo

వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!

డోన్‌లోని ఒక ప్రైవేట్‌ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

Published : 18 Apr 2024 04:23 IST

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులపై ఫిర్యాదులు
గుట్టుగా విచారణ 

డోన్‌లోని ఒక ప్రైవేట్‌ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఏ వైద్యం చేయకుండానే బిల్లులు పెట్టినట్లు వెలుగులోకొచ్చింది. ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న రోగులతో విచారణ చేయగా తమకు ఎలాంటి వైద్యం అందించలేదని రూ.500 ఇచ్చి వేలిముద్రలు వేయించుకున్నారని చెప్పటంతో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు సిపార్సు చేశారు.

అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఓ ప్రైవేట్‌ వైద్యశాల, పామిడిలోని ఒక ప్రైవేట్‌ వైద్యశాలలో రోగులకు వైద్యం చేయకనే చేసినట్లు ఆరోగ్యశ్రీ కింద బిల్లులు పెట్టారని అప్పట్లో ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీనిపై విచారణ ఇంకా చేస్తున్నారు.

అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే : ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నిర్వాహకుల వెనుక వైకాపా నాయకుల అండ ఉందని స్పష్టమవుతోంది. రోగులకు ఎలాంటి వైద్యం అందించకనే వారి పేర్లమీద ఆరోగ్యశ్రీ బిల్లులు చేసుకుంటున్నారు. తమకు వైకాపా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల అండ ఉందని తమ ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోరన్న ధీమాతో కొంతమంది నిర్వాహకులు పెద్ద ఎత్తున నిధులు దిగమింగేశారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఆసుపత్రులకు వస్తే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి.. వారికి తెలియకుండానే వారి పేర్లమీద ఆరోగ్యశ్రీ బిల్లులు పెట్టుకోవడం వివాదాస్పదమైంది.

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని కొన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఈ తరహా వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు అధికారుల వ్యవహరంపైనా ఆరోపణలు వస్తున్నాయి. ఒకే తరహా రోగానికి ఎక్కువగా రోగులకు వైద్యం అందించినట్లు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద బిల్లులు పెట్టారు. కొంతమంది రోగుల సెల్‌ నంబర్లకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకున్నట్లు సంక్షిప్త సమాచారం రావటంతో వారు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. స్పందించిన కలెక్టర్‌ విచారణ ఆదేశించారు. ఇదే ఆసుపత్రిలో వందకు పైగా సీవోపీడీ (బిల్లులు పెట్టటంతో అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు రోగికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నట్లు మొదట ఫొటో అప్‌లోడ్‌ చేసి తరువాత డిశ్చార్జి సమయంలో వేలిముద్రలు తీసుకుంటున్నట్లు బిల్లులు పక్కాగా పెట్టి దోచేస్తున్నారు.

రోగికి ఎలాంటి ఇన్‌పెక్షన్‌ లేకపోయినా వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నట్లు బిల్లులు పెట్టి దోచుకుంటున్నారు. సీవోపీడీ(క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) కింద వెంటిలేటర్‌పై చికిత్సకు రూ.60 వేల వరకు ప్యాకేజీ ఉండగా, సాధారణ ఇన్‌పెక్షన్‌ అయితే రూ.6 వేల వరకు ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ఉంది. కొన్ని నెట్‌వర్క్‌ వైద్యశాలల్లో ఈ తరహాలో బిల్లులు ఎక్కువ పెట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. చేయని వైద్యానికి రూ.కోట్లలో బిల్లులు పెట్టి కొంతమంది లబ్ధి పొందినట్లు ఫిర్యాదులున్నాయి. 

ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో 59 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా రోగులతో వసూళ్లకు పాల్పడుతున్నారు. కొన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నిర్వాహకులు కాళ్లు, చేతులు విరిగిన వారికి రాడ్లు వేయాలంటే ప్రభుత్వం సరఫరా చేసేవి నాణ్యతగా ఉండవని.. ఇంకో రకం వేస్తామంటూ అదనంగా వసూలు చేస్తున్నారు. చేసేదేం లేక రోగులు ఎక్కువ మొత్తం డబ్బులు కట్టి ఆపరేషన్‌లు చేయించుకుంటున్నారు. 

కంటి శస్త్ర చికిత్సలకు నాణ్యతగల లెన్స్‌ వేస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. గుండెకు సంబంధించి స్టంట్లు నాణ్యమైనవి వేయించుకుంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని వివరిస్తూ అదనపు మొత్తం చెల్లించాలని చెబుతున్నారు.

ద్విచక్రవాహనం నుంచి పడి గాయపడిన భార్యాభర్తలు సాయినగర్‌లో ఉన్న ప్రైవేటు వైద్యశాలకు వెళ్లగా.. అక్కడ ఇద్దరికీ శస్త్రచికిత్సలు చేశారు. ఇంటికెళ్లిన బాధితులకు చికిత్స వికటించగా.. తిరిగి ఆసుపత్రికి వచ్చారు. ఆందోళన చేసి ఆరోగ్యశ్రీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి గుట్టుచప్పుడుగా ఇంకో ఆసుపత్రిలో చికిత్సకు ఒప్పించారు. కానీ ఇక్కడి వైద్యుల నిర్వాకంపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం గమనార్హం.

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు అధికారులు రాజకీయ బలంతో పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. ఆ అధికారులు ప్రతి నెలా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి డబ్బులు వసూళ్లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఓ అధికారి, మరో ఉద్యోగి ద్వారా వసూళ్ల పర్వం సాగిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ఆసుపత్రి నిర్వాహకులతో వాట్సప్‌ కాల్స్‌లో మాత్రమే సదరు అధికారులు మాట్లాడుతారని, డబ్బులు కూడా నేరుగా వారు తీసుకోకుండా ఫలానా చోటుకు రమ్మని చెప్పి తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.

అధికారుల వసూళ్ల వేట

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అధికారులు వసూళ్ల వేటలో మునిగి తేలుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినా నామమాత్రపు చర్యలు తీసుకుంటుండంతో యాజమాన్యాల్లో మార్పు రావటం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని