logo

జగనన్నా.. ఉద్యోగులంటే అంత అలుసా ?

ఉద్యోగ, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం ధర్నా, రాస్తారోకో చేసినా, విజయవాడలో రాష్ట్ర స్థాయి ఆందోళన చేపడితే పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అరెస్ట్‌లు చేయడం, ముందస్తు నోటీసులు జారీ చేయడంతో వారు భయాందోళనలకు గురవుతున్నారు.

Published : 17 Apr 2024 03:11 IST

ఉద్యమాలు చేస్తే కేసులే
భయాందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు
న్యూస్‌టుడే, చిత్తూరు విద్య, కలెక్టరేట్‌, పూతలపట్టు

ద్యోగ, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం ధర్నా, రాస్తారోకో చేసినా, విజయవాడలో రాష్ట్ర స్థాయి ఆందోళన చేపడితే పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అరెస్ట్‌లు చేయడం, ముందస్తు నోటీసులు జారీ చేయడంతో వారు భయాందోళనలకు గురవుతున్నారు..  సకాలంలో వేతనాలు అందక, అప్పులు తీర్చలేక, ఈఎంఐలు కట్టలేక ఐదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు.. 2022 ఏప్రిల్‌లో విజయవాడలో పెద్దఎత్తున ధర్నా చేపట్టగా 65 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోజు నుంచి జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ కోర్టు వాయిదాలకు వెళ్లొస్తున్నారు.. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన ఆందోళన చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు ఉందని ఉద్యోగ, ఉపాధ్యాయులు వాపోతున్నారు.


మంత్రి హామీలకే దిక్కులేదు..

-గణేష్‌ గుల్లారి, మండల ప్రధాన కార్యదర్శి, పూతలపట్టు, ఎస్టీయూ

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మంత్రులు ఇచ్చిన హామీలు అమలుకాక పోవడం శోచనీయం. హక్కుల సాధన కోసం ఉద్యమిస్తే పోలీసులతో అణచివేయించారు. ఉద్యోగులు.. ప్రభుత్వంపై అభద్రతా భావంలో ఉన్నారు. పిల్లల చదువుకు, వివాహాల కోసం దాచుకున్న సొమ్ము దారి మళ్లించడం బాధాకరం. ఉద్యోగుల్లో భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే విధానాలు మానుకోవాలి.


నోటీస్‌ ఇస్తే మరుసటిరోజే అరెస్టు..

-రెడ్డెప్ప నాయుడు, జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యదర్శి

సమస్యల పరిష్కారానికి ఆందోళన చేపట్టడానికి ముందుగా నోటీసు ఇస్తాం. ఆ మరుసటి రోజే పోలీసులు వచ్చి అక్రమంగా గృహనిర్బంధం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నోటీస్‌ ఇస్తే సంబంధిత సంఘ నాయకులను పిలిచి చర్చించేవారు. ఇప్పుడా విధానమే లేదు. నియంతృత్వ ధోరణితో అణచివేసే పద్ధతి అవలంబిస్తున్నారు. ఎక్కడా ప్రజాస్వామ్యం లేదు.


అడుగడుగునా బెదిరింపులు..

-రాధాకృష్ణ, జిల్లా మీడియా కన్వీనర్‌, ఆపస్‌

సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్ధతి అనుసరించినా ప్రయోజనం లేదు. సీపీఎస్‌ రద్దు చేయాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వకపోగా వారికి ఇష్టం వచ్చిన విధానాలు ఉద్యోగులపై రుద్దుతోంది. అణచివేత ధోరణితో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని