logo

ఉప కారాగారంలో రిమాండ్‌ ఖైదీ మృతి

మద్యం కేసులో అరెస్టైన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67)ను స్థానిక పోలీసులు ఈనెల 16న మద్యం కేసు అరెస్టు చేశారు.

Published : 18 Apr 2024 02:25 IST

పెద్దపంజాణి ఎస్‌ఐ కొట్టడంతోనే చనిపోయాడని ఆందోళన

మొగిలప్ప (పాతచిత్రం)

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మద్యం కేసులో అరెస్టైన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67)ను స్థానిక పోలీసులు ఈనెల 16న మద్యం కేసు అరెస్టు చేశారు. రిమాండ్‌ విధించడంతో మదనపల్లె సబ్‌జైలుకు పంపారు. బుధవారం తెల్లవారుజామున శ్వాస ఇబ్బందితో జైలులోనే కుప్పకూలాడు. జైలు సూపరింటెండెంట్‌ రామకృష్ణ యాదవ్‌, సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రి శవాగారానికి తరలించారు. పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తన భర్తను పెద్దపంజాణి ఎస్‌ఐ శ్రీనివాసులు కొట్టాడని, ఆ దెబ్బలతోనే మరణించాడని భార్య రెడ్డెమ్మ ఆరోపించారు. సోమవారం స్టేషన్‌కు తీసుకెళ్లారని.. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి 10 గంటలకు అప్పగించి మంగళవారం ఉదయం 10 గంటలకు తీసుకురావాలని హకుం జారీ చేశారని ఆరోపించారు. అప్పటికే దెబ్బలతో ఉన్నారని.. ఉదయం కొంచెం ఆలస్యంగా వెళ్లడంతో మళ్లీ కొట్టారని.. ప్రశ్నిస్తే గంజాయి కేసు పెడతానని ఎస్‌ఐ బెదిరించినట్లు ఆరోపించారు.  ఉదయం 6 గంటలకు మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి వస్తే 11 గంటల వరకు మృతదేహాన్ని చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్యశాల ఎదుట ఆందోళన చేపట్టారు. మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌, తహసీల్దార్‌ రమాదేవి మొగిలప్ప మృతిపై పూర్తి స్థాయి విచారణ చేయిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని