logo

ముఖ్యమంత్రి సభకు బస్సులు... ప్రయాణికుల పడిగాపులు

సమయానుకూలంగా బస్సులు రాక.. కొన్ని మార్గాల్లో పూర్తిస్థాయిలో సర్వీసులు అందుబాటులో లేక.. సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Updated : 17 Apr 2024 04:32 IST

గోకవరం బస్టాండ్‌ వద్ద నిరీక్షిస్తున్న ప్రజలు

వి.ఎల్‌.పురం, ఏవీఏ రోడ్డు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: సమయానుకూలంగా బస్సులు రాక.. కొన్ని మార్గాల్లో పూర్తిస్థాయిలో సర్వీసులు అందుబాటులో లేక.. సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తామెక్కాల్సిన బస్సు ఎప్పుడొస్తుందో తెలియక మంగళవారం బస్టాండ్లలో పడిగాపులు పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం జరిగిన వైకాపా ‘మేమంతా సిద్ధం’ సభకు జనాలను తరలించేందుకు జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 88 బస్సులను కేటాయించారు. రాజమహేంద్రవరం డిపో నుంచి 35, గోకవరం నుంచి 20, కొవ్వూరు నుంచి 23, నిడదవోలు నుంచి 10 వరకు పంపించారు. జిల్లాలోని నాలుగు డిపోల్లో కలిపి ఆర్టీసీ సొంత బస్సులు 205 ఉండగా వీటిలోనే 88 బస్సులను సీఎం పాల్గొనే సభకు వినియోగించారు. సొంత, అద్దె బస్సులు కలిపి జిల్లాలోని ఆయా మార్గాల్లో ప్రతిరోజూ 272 షెడ్యూల్‌ సర్వీసులుగా తిరుగుతుండగా కొన్నింటిని మళ్లించడంతో షెడ్యూళ్లు కుదించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం, సాయంత్రం వేళలోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం నుంచే కొన్ని రూట్లలో బస్సులు అందుబాటులో లేకుండాపోయాయి. ఇటు కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని 145 బస్సులను కూడా సీఎం సభకు తరలించడంతో సర్వీసులు తగ్గి ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బుధవారం శ్రీరామనవమి కావడంతో నిత్యావసర వస్తువులు, పండ్లు, ఇతర పూజాసామగ్రి కొనుగోలు చేసేందుకు ముందురోజు ఆయా గ్రామాల నుంచి పెద్దఎత్తున నగరం, పట్టణాలకు బయలుదేరారు. బస్సులు సమయానుకూలంగా లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. అధికారులు మాత్రం షెడ్యూల్‌ సర్వీసులేమీ కుదించలేదని చెప్పుకొస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని