logo

‘జగన్‌కు మాదిగలంటే చులకన’

సమైక్యాంధ్ర ఉద్యమాల సమయం నుంచి తమ కార్యకర్తలపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు.

Published : 01 Apr 2023 05:38 IST

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: సమైక్యాంధ్ర ఉద్యమాల సమయం నుంచి తమ కార్యకర్తలపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు విధ్వంసకర ఘటనల్లో కాపులపై ఉన్న కేసులను ఎత్తివేసిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తుని ఘటనలో విధ్వంసం సృష్టించిన కేసులను ఎత్తివేశారన్నారు. ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కోనసీమలో విధ్వంసకర ఘటనల్లో నమోదైన కేసులను ఎత్తివేశారన్నారు. ఈ ఘటనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయని, పోలీస్టేషన్లను తగులపెట్టారన్నారు. అటువంటి కేసులను ఎత్తివేసిన సీఎం జగన్‌ శాంతియుతంగా జరిగిన ఉద్యమాలలో నమోదైన కేసులను ఎత్తివేయకపోవడం మాదిగలంటే చులకనగా చూస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. శిరోముండనాలు, దళిత యువకుడ్ని చంపి ఇంటికి డెలివరీ పంపిన విషయాలను గుర్తు చేశారు. డ్రైవర్‌ను చంపి వైకాపా ఎమ్మెల్సీ ఇంటికి తీసుకెళ్లారన్నారు. కాపు ప్రజాప్రతినిధులు, ప్రజలంటే సీఎం జగన్‌ భయపడుతున్నారన్నారు. అందుకే వారి కేసులను ఉపసంహరించుకోగలిగారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని