logo

మరో గచ్చిబౌలిలా మంగళగిరి

తమ ప్రభుత్వం ఏర్పడ్డాక మంగళగిరిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఈ ప్రాంతాన్ని మరో గచ్చిబౌలిలా అభివృద్ధి చేస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్‌ క్లస్టర్‌ని ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు.

Updated : 19 Mar 2024 07:34 IST

ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం
దక్షిణ భారతంలోనే అతిపెద్ద గోల్డ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తాం
కృష్ణా నది నుంచి తాగునీరు అందిస్తాం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హామీలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ లోకేశ్‌’, ‘రచ్చబండ’ కార్యక్రమాలు
మిడ్‌వ్యాలీ సిటీ, మంజీరా మోనార్క్‌ అపార్ట్‌మెంట్‌ వాసులతో సమావేశం
న్యూస్‌టుడే, మంగళగిరి

మ ప్రభుత్వం ఏర్పడ్డాక మంగళగిరిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఈ ప్రాంతాన్ని మరో గచ్చిబౌలిలా అభివృద్ధి చేస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్‌ క్లస్టర్‌ని ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. మంగళగిరిలో పోటీ చేయాలనే ఆలోచన లేకముందే గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఈ ప్రాంతానికి పలు ఐటీ కంపెనీల్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. వైకాపా ప్రభుత్వ నిర్వాకం, వేధింపులు, సహాయ నిరాకరణతో అవన్నీ తరలిపోయాయన్నారు. సమర్థుడైన శాసనసభ్యుడు లేకపోవడంతో రాష్ట్రం నడిబొడ్డున ఉన్నా గత పదేళ్లుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి రూ.2 వేల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. కృష్ణా నది పక్కనే ఉన్నా నియోజకవర్గ ప్రజలకు కనీసం తాగు నీరు అందించలేకపోయారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ లోకేశ్‌ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ఆత్మకూరులోని మిడ్‌వ్యాలీసిటీలో నిర్వహించారు. సమీపంలోని మంజీరా మోనార్క్‌ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌వాసులూ దీనికి హాజరయ్యారు. సుమారు 500 మంది పాల్గొన్నారు. తెదేపా గుంటూరు లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, జనసేన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈసందర్భంగా అపార్ట్‌మెంట్‌వాసులు అడిగిన పలు ప్రశ్నలకు లోకేశ్‌ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. అనంతరం మంగళగిరి నియోజకవర్గంలో చింతలపూడి, మంచికలపూడి, కంఠంరాజు కొండూరు గ్రామాల్లో రచ్చబండ సభలు జరిగాయి. అపార్ట్‌మెంట్‌వాసుల ప్రశ్నలు, ఆయన సమాధానాలు ఇలా సాగాయి.

మా ప్రాంతంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడతారు..

లోకేశ్‌: తాగునీటి సమస్య పరిష్కారానికి తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పైప్‌లైన్‌ పనుల్ని వైకాపా అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది. రెండు నెలలు ఓపిక పట్టండి. మా ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే మంగళగిరి పరిధిలో అన్ని ప్రాంతాలకు కృష్ణా నది నుంచి తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. మంజీరా మోనార్క్‌ అపార్ట్‌మెంట్‌ పక్కన ఉన్న వాగుకి లైనింగ్‌ ఏర్పాటు చేసి మీ సమస్య పరిష్కరిస్తాం.  

మా ప్రాంతంలో పార్కులు లేవు. అభివృద్ధి చేస్తారా..

లోకేశ్‌: ఇక్కడ పార్కులు లేకపోవడం వల్ల ప్రజలు కాస్త సేదతీరేందుకు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఉంది. నేను సొంత డబ్బుతో రెండు పార్కులు అభివృద్ధి చేస్తే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తాం. దానిలో భాగంగానే చిన్నచిన్న పార్కులతో పాటు, కొన్ని విశాలమైన పార్క్‌లూ అభివృద్ధి చేస్తాం. అన్ని రకాల మౌలిక సదుపాయాల్ని కల్పిస్తాం.

రాష్ట్రంలో ఉపాధి కల్పించే పరిశ్రమలు, ఐటీ సంస్థలు లేక చదువుకున్న పిల్లలు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లిపోతున్నారు. పెద్దలు మాత్రమే ఇక్కడ మిగులుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నాళ్లకు మనది వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతుంది. పిల్లలకు ఇక్కడే ఉపాధి లభించేలా మీరు    ఈ ప్రాంతంలో ఐటీ తదితర రంగాల్ని అభివృద్ధి చేస్తారా?

లోకేశ్‌: తెదేపా ప్రభుత్వ హయాంలో మంగళగిరికి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం. ఏపీఐఐసీ ద్వారా వివిధ పరిశ్రమలకు భూములూ ఇచ్చాం. భవనాలు నిర్మించి, ఐటీ కంపెనీలకు రాయితీలు ఇచ్చి, ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రోత్సహించాం. హెచ్‌సీఎల్‌ వంటి కంపెనీల్ని విజయవాడకు తీసుకురాగలిగాం. ఈ ప్రాంతంలో ఐటీ రంగం అభివృద్ధి వేగం పుంజుకుంటున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం మొత్తం నాశనం చేసింది. మేం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా మారుస్తాం. పిల్లలకు ఇక్కడే మెరుగైన ఉద్యోగావకాశాలు లభించేలా చేస్తాం. దక్షిణ భారతదేశంలోనే బంగారు నగల తయారీకి ఈ ప్రాంతాన్ని చిరునామాగా మారుస్తాం. నగల డిజైనింగ్‌ నుంచి ఉత్పత్తి వరకు ఇక్కడే జరిగేలా గోల్డ్‌ క్లస్టర్‌ని అభివృద్ధి చేసి భారీగా ఉపాధి అవకాశాలు లభించేలా చేస్తాం.

సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాల్ని పంచుకున్నవారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీనికి పరిష్కారమేంటి..

లోకేశ్‌: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది కాబట్టి మీరెవరూ భయపడాల్సిన పనిలేదు. స్వేచ్ఛగా మీ అభిప్రాయాల్ని వ్యక్తం చేయవచ్చు. ఒకవేళ ఈ ప్రభుత్వం ఎవరిపైనైనా అక్రమ కేసులు పెడితే మన ప్రభుత్వం వచ్చాక మీకు తగిన రక్షణ కల్పిస్తాం. ఇప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా నాకు నేరుగా ఫోన్‌ చేయండి. మీకు రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛను వైకాపా ప్రభుత్వం కాలరాసింది. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వెల్లడించిన మహిళలపై జగన్‌ పేటీఎం బ్యాచ్‌ అసభ్యకర కామెంట్‌లతో దాడి చేస్తోంది. అయినా వారిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.

మిడ్‌వ్యాలీ సిటీలో లోకేశ్‌ మాటామంతి

ఈ ప్రాంతంలో అందమైన కొండలున్నాయి. ట్రెక్కింగ్‌ సదుపాయం కల్పిస్తారా..

లోకేశ్‌: అటవీ, పర్యాటక శాఖలో మాట్లాడి ప్రత్యేకంగా ట్రెక్కింగ్‌ జోన్‌ల అభివృద్ధికి కృషి చేస్తాను.

జాతీయ రహదారిపై గుంటూరు వైపు నుంచి ఎయిమ్స్‌కి, మా అపార్ట్‌మెంట్‌లకు రావాలంటే... రెండు మూడు  కి.మీ. ముందే సర్వీసు రోడ్డులోకి దిగాల్సి వస్తోంది. జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్‌ సమీపంలో సర్వీసు రోడ్డులోకి దిగేలా ఎగ్జిట్‌ పాయింట్‌ ఏర్పాటు చేయగలరా..

లోకేశ్‌: సాధ్యాసాధ్యాలపై జాతీయ రహదారుల విభాగంతో మాట్లాడి తగిన చర్యలు చేపడతాను.

వైకాపా ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయి. వాటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..

లోకేశ్‌: వైకాపా ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేయడం, అంతర్వేదిలో రథాన్ని అగ్నికి ఆహుతి చేయడం వంటి దారుణమైన ఘటనలు జరిగినా, తగిన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. గతంలో తెదేపా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పుడూ రాష్ట్రంలో ఎక్కడా ఏ మతానికి చెందిన ప్రార్థనాలయాలపైనా దాడులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశాం. తెదేపా కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా మెరుగైన పాలన అందించింది. హిందూ దేవాలయాలపై దాడులకు దిగినవారిని వదిలిపెట్టం మా ప్రభుత్వం ఏర్పడ్డాక విచారణ జరిపి దోషుల్ని శిక్షిస్తాం.

పిల్లలు విదేశాల్లో ఉండడంతో అక్కడికి రాకపోకలు సాగించేందుకు అవసరమైనన్ని విమానాలు విజయవాడకు లేవు. ఎయిర్‌ కనెక్టివిటీ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..

లోకేశ్‌: తెదేపా ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశాం. భూములు కేటాయించి రన్‌వే విస్తరణ వంటి పనులు చేపట్టాం. విమాన సర్వీసుల సంఖ్య బాగా పెంచాం. ఇక్కడి నుంచి సింగపూర్‌కి విమానం నడిచేది. వైకాపా ప్రభుత్వం దాన్నీ దెబ్బతీసింది. మా ప్రభుత్వం వచ్చాక విజయవాడ విమానాశ్రయాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతాం. అంతర్జాతీయ విమాన సర్వీసుల్నీ ఏర్పాటు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని