logo

రీయింబర్స్‌మెంట్‌ లేదు.. చేయూత నిధులు అందలా..

వాలంటీర్ల ద్వారా ఇంటింటికే పథకాలు అందించాం కదా! నాడి ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్న వైకాపాకు ఎదురుదెబ్బ తగులుతోంది.

Published : 17 Apr 2024 04:20 IST

ఫోన్లు చేస్తున్న వారిని నిలదీస్తున్న లబ్ధిదారులు

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట, న్యూస్‌టుడే, పెదకూరపాడు: వాలంటీర్ల ద్వారా ఇంటింటికే పథకాలు అందించాం కదా! నాడి ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్న వైకాపాకు ఎదురుదెబ్బ తగులుతోంది. అన్ని సంక్షేమ పథకాలు అందాయా అంటూ ఆరా తీస్తూ ఎలాగైనా బుట్టలో వేసుకుందామనుకునే వారికి అటు నుంచి వస్తున్న సమాధానంతో మింగుడుపడడం లేదు. చరవాణిలో ప్రచార మోతతో జనం విసిగెత్తిపోతున్నారు. కొత్త కొత్త నంబర్లతో ఫోన్లు వస్తుంటే ఎవరని తీశాక రాజకీయ పార్టీల ప్రచార విషయాలే ఉంటున్నాయి. ముఖ్యంగా వైకాపా రికార్డు చేసిన ఫోన్లు వస్తున్నాయి. ‘‘వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు అందాయి. అన్నీ ఇంటికే తెచ్చి ఇచ్చారు. మళ్లీ అలా జరగాలంటే మరోసారి వైకాపానే ఆదరించాలి’’ అంటూ ఫోన్లు చేస్తున్నారు. తాడేపల్లి నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెబుతూ వాలంటీర్ల ద్వారా ఈ ఐదేళ్లలో ఏం ఇబ్బందులు ఎదుర్కోలేదు కదా.. అన్ని పథకాలు ఇంటికే అందాయా? అని అడుగుతున్నారు. అయితే ఇలా ఫోన్లు చేసే వారిని ప్రజలు నిలదీస్తున్నారు. తమ అబ్బాయి ఇంజినీరింగ్‌ చదువుతున్నాడని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఒక విడతే పడిందని, తర్వాత జమ కాలేదని ఇదేనా సంక్షేమం అంటే అని అనడంతో ఫోన్‌ పెట్టేస్తున్నారు. అదే మహిళలకు ఇలాంటి ఫోన్లు వస్తుంటే వారు కూడా అంతే దీటుగా సమాధానమిస్తున్నారు. ఫోన్‌ చేసి సంక్షేమ పథకాలు ఇంటికే వచ్చాయి కదమ్మా అంటే ‘చేయూత చివరి విడత పడలేదని కొందరు, ఆసరా నిధులు పడలేదని మరికొందరు, డ్వాక్రా రుణమాఫీ పడలేదని.. ఇలా మహిళలు సమాధానమివ్వడంతో చేసేది లేక ఫోన్‌ కట్‌ చేస్తున్నారు. మరికొందరైతే ఏ ఊరు? ఏ వార్డు వాలంటీరు అని అడిగి ఫోన్‌ పెట్టేస్తున్నారు. మొత్తానికి వాలంటీర్ల ద్వారా సంక్షేమం ఆగిపోతుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్న వైకాపాకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. చివరి విడత నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కాకపోవడంతో నిలదీస్తున్నారు.

టస్థ ఓటర్లే లక్ష్యంగా వారి ఫోన్‌ నంబర్లను సేకరించి రోజుకు ఐదు నుంచి పది సార్లు సర్వే ఏజెన్సీలతో, కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి మరీ కొత్త సిమ్‌కార్డులతో వైకాపా సోషల్‌మీడియా, వాలంటీర్లతో ఫోన్‌ చేసి అధికార పార్టీకి మద్దతుగా నిలవాలంటూ ప్రచారం చేయిస్తున్నారు. మే 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వేటు వేసి గెలిపించాలంటూ తమ ప్రాంతాలకు చెందిన ఓటర్ల సెల్‌ఫోన్లకు వాయిస్‌ మెసేజ్‌లు పెడుతున్నారు. ఒక వైపు ఇంటింటి ప్రచారం నడుస్తుండగా చరవాణిలో ఇదేం గోలరా అంటూ పలువురు విసుక్కుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని