logo

నీరివ్వలేని నీరో!

సీఎం జగన్‌... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్‌ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్‌లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు.

Published : 18 Apr 2024 05:43 IST

ఎయిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది, రోగుల అవస్థలు
అయినా చలించని ముఖ్యమంత్రి జగన్‌
అటవీ అనుమతులకు రూ. 3లక్షలు చెల్లించలేరా?

ఈనాడు - అమరావతి: సీఎం జగన్‌... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్‌ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు..
కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్‌లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. శాశ్వత నీటి సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. వారి కష్టాలను కళ్లారా చూడలేదు. వారి ఆర్తనాదాలను వినలేదు. కేవలం రూ. ఏడెనిమిది కోట్లు వెచ్చిస్తే చాలు.. సమస్య పరిష్కారమవుతుందని తెలిసినా.. ఈ అయిదేళ్లలో ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదు. రోగులే ఇళ్ల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది.

పేదలంటే నిర్లక్ష్యమా?

ఎయిమ్స్‌లో రహదారుల నిర్మాణంలో అపసవ్య విధానాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఇది చెల్లిస్తేనే కొలనుకొండ జంక్షన్‌ వద్ద ఆసుపత్రి ప్రవేశ మార్గం నుంచి తాగునీటి పైపులైన్ల నిర్మాణ పనులకు పర్యావరణ అనుమతులిస్తామని గత కొన్నాళ్లుగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ చెబుతున్నా.. జగన్‌ సర్కారు చెవికెక్కించుకోలేదు. ఈ మొత్తాన్ని ఎవరు చెల్లించాలన్నదానిపై ఆర్‌ అండ్‌ బీ, మున్సిపల్‌ ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు సీఎం జగన్‌ ఏమాత్రం చొరవ చూపలేదు. ఇదీ పేదలపై ఆయనకున్న ప్రేమ! రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం సంబంధిత శాఖలతో మాట్లాడి ఆ మొత్తాన్ని చెల్లించే ప్రయత్నమూ చేయలేదు.

ఎప్పటికప్పుడు పొడిగింపులే

శాశ్వత నీటి సౌకర్యం కోసం 2022 డిసెంబరులో పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పింది. రూ. 8 కోట్లతో గుంటూరు ఛానల్‌ నుంచి ఆత్మకూరు చెరువుకు, అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా ఆసుపత్రికి నీళ్లివ్వాలన్నది ప్రణాళిక. పనుల పూర్తి గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించారు. ఈ ఏడాది ఫిబ్రవరికల్లా పూర్తి చేస్తామని చెప్పింది. అదీ ముగిసింది. మళ్లీ ఏప్రిల్‌ వరకు గడువు పెంచింది. విచిత్రమేమంటే.. పనులకు అసలు అటవీశాఖ అనుమతే రాకపోవటం గమనార్హం. మరో మూడు, నాలుగు నెలల సమయం కావాలంటూ అధికారులు ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

గుత్తేదారుకు బకాయిలు

2.50 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో కూడిన సంపులు, నీటిశుద్ధి ప్లాంట్లకు సంబంధించి సివిల్‌ పనులు పూర్తయ్యాయి. మెకానికల్‌, ఫిల్టర్‌ బెడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జాతీయ రహదారి క్రాసింగ్‌ పనులు కూడా కొంతమేరకు చేయాల్సి ఉంది. గుత్తేదారుకు రూ. 2 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఇస్తేనే పనులు చేస్తానని ఆయన భీష్మించుక్కూర్చున్నారు.

ట్యాంకర్ల నీటిలోనూ కోతే

విజయవాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు అయిదేళ్లుగా ఎయిమ్స్‌కు నీటిని ఉచితంగా ఇస్తున్నాయి. ఇందుకోసం నిత్యం నాలుగు అద్దె ట్యాంకర్లను ఎయిమ్స్‌ వినియోగిస్తోంది. ఇప్పటిదాకా అద్దె కింద రూ. కోటిన్నరకుపైగానే ఖర్చు చేసింది. రోజూ ఒక్కో ట్యాంకర్‌ 10 ట్రిప్పులు వేయాలి. కానీ.. ఆ రెండు కార్పొరేషన్లలో నీటి సమస్య కారణంగా ఆరేడు ట్రిప్పులే సరఫరా చేస్తున్నాయి. ఇవి రోగుల అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదు.

గత తెదేపా ప్రభుత్వం ఏం చేసిందంటే...

  • ఆసుపత్రి, రహదారుల నిర్మాణం కోసం అవసరమైన భూములను సేకరించింది.
  • నిర్మాణాలకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన మంజూరు చేసింది.
  • 2015లో ప్రారంభమైన పనులు రికార్డుస్థాయిలో 2019 నాటికి పూర్తయ్యేలా పూర్తి సహకారం అందించింది. ఆ వెంటనే వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది.

వైకాపా ప్రభుత్వం నిర్వాకమిదీ...

  • స్థానికంగా నివాసం ఉంటున్న వైద్యులు, వైద్య-నర్సింగ్‌ విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నా జగన్‌ సర్కారు పట్టించుకోలేదు.
  • గత అయిదేళ్లుగా విజయవాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ల నుంచి ట్యాంకర్ల ద్వారా అరకొరగా వస్తున్న నీటితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. జగన్‌ సర్కారు చేతకానితనం వల్ల శాశ్వత పరిష్కారం పనులు పూర్తి కాలేదు.
  • రహదారుల నిర్మాణం, బస్సు సౌకర్యం వంటి అంశాలను పట్టించుకోలేదు. తగినన్ని బస్సుల్లేక రోగులు గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వ్యయప్రయాసలకోర్చి వెళ్లాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని