logo

రూ.10 వేలు లంచం తీసుకుంటూ..అనిశాకు చిక్కిన మేడిపల్లి ఎస్సై

న్యాయం కోసం ఠాణాకు వెళ్లిన ఫిర్యాదుదారుడి నుంచి ఓ ఎస్సై లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో జరిగింది. హైదరాబాద్‌ రేంజి అనిశా డీఎస్పీ

Published : 08 Dec 2021 03:06 IST


యాదగిరిరాజు

మేడిపల్లి(ఘట్‌కేసర్‌), న్యూస్‌టుడే: న్యాయం కోసం ఠాణాకు వెళ్లిన ఫిర్యాదుదారుడి నుంచి ఓ ఎస్సై లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో జరిగింది. హైదరాబాద్‌ రేంజి అనిశా డీఎస్పీ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 28న రాత్రి బోడుప్పల్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ను ద్విచక్ర వాహనాదారుడు ఢీకొట్టాడు. ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి, న్యాయం చేయాలని శ్రీనివాస్‌ కుమారుడు ప్రశాంత్‌ ఈ నెల 1న మేడిపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ¸దర్యాప్తు బాధ్యతను సీఐ బి.అంజిరెడ్డి ఎస్సై సీహెచ్‌ యాదగిరిరాజుకు అప్పగించాడు. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనాదారుడిని గుర్తించిన ఎస్సై.. తనకు రూ.20వేలు ఇవ్వాలని ఫిర్యాదుదారుడిని డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.10వేలకు ఒప్పందం జరిగింది. లంచం ఇవ్వడం ఇష్టంలేక ఈ నెల 4న ప్రశాంత్‌ అనిశా అధికారులను ఆశ్రయించారు. మంగళవారం మధ్యాహ్నం స్టేషన్‌లో డబ్బులు తీసుకుంటున్న ఎస్సైని అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ పేర్కొన్నారు.

ఇలా దొరికాడు.. ఎస్సై యాదగిరిరాజు లంచం నేరుగా చేతిలోకి తీసుకోలేదు. తన టోపీ కింద పెట్టి వెళ్లిపోవాలని బాధితుడికి సూచించాడు. అతడలాగే చేశారు. నగదు తీసుకొని జేబులో పెట్టుకుందామని అనుకుంటున్న వేళ కొందరు అయ్యప్ప మాలధారులు వేరే కేసు విషయం మాట్లాడేందుకు వచ్చారు. దీంతో అవి టోపీ కింద ఉండిపోయాయి. అధికారుల సోదాలో ఎస్సై జేబులు, కుర్చీ కింద, దస్త్రాల్లో చూసినా డబ్బులు దొరకలేదు. చివరకు టోపీ కింద దొరికాయి. ఈ ఏడాది జూన్‌లో యాదగిరిరాజు ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లు సర్వీసు పెంచడంతో కొనసాగుతున్నారు. సూర్యాపేటలో పోస్టింగ్‌ వచ్చినా.. పైరవీలతో రాచకొండ కమిషనరేట్‌ పరిధికి వచ్చినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని