logo

Covid Vaccination: 10 మంది ఒకే చోట ఉంటే..వారి వద్దకే టీకా

ఒమిక్రాన్‌ రకం కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ మేరకు తగ్గట్టుగా పరీక్షల సంఖ్య పెంచి బాధితులను గుర్తించి, వైరస్‌ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌ తీరుపై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే..

Updated : 15 Jan 2022 08:26 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఒమిక్రాన్‌ రకం కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ మేరకు తగ్గట్టుగా పరీక్షల సంఖ్య పెంచి బాధితులను గుర్తించి, వైరస్‌ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌ తీరుపై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే..


10 మంది ఉంటే.. ఇంటి వద్దకే టీకా!
హైదరాబాద్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.వెంకటి

గరంలో కరోనా టీకా కార్యక్రమం పుంజుకుందని హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జె.వెంకటి తెలిపారు. ఇప్పటికీ రెండో డోసు తీసుకోని వారు 10 మంది ఒకే చోట ఉంటే తమ సిబ్బంది వారి వద్దకే వెళ్లి టీకా వేస్తారన్నారు. 15-17 ఏళ్ల మధ్య వయస్కులకు వ్యాక్సిన్‌ వేయించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోందని సంక్రాంతి సెలవుల తర్వాత వ్యాక్సినేషన్‌ను మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షల సంఖ్య పెంచామన్నారు.  మూడో దశకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పాజిటివ్‌గా తేలిన వారికి హోం ఐసొలేషన్‌ కిట్‌ అందిస్తున్నామన్నారు. డెల్టాతో పోల్చితే ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరికలు చాలా తక్కువగా ఉన్నాయని, అయినా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు సిద్ధం చేశామన్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాన్ని కొట్టిపడేయలేమని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూనే, సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని సూచించారు.


జిల్లా వ్యాప్తంగా జ్వరం సర్వే
రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి

రంగారెడ్డి జిల్లాలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అన్ని ఆసుపత్రుల్లో పరీక్షల సంఖ్య పెంచాం. గతంలో 2500 వరకు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేస్తుండగా వాటిని 3500కు పెంచాం. ఆరోగ్య సిబ్బందిని ఇంటింటికీ పంపి జ్వర సర్వే చేయిస్తున్నాం. జ్వరం తదితర లక్షణాలుంటే మందుల కిట్‌ ఇచ్చి ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నాం. రెండో డోసు 70 శాతం మందికి ఇచ్చాం. ఈ నెల 25లోగా వంద శాతం లక్ష్యంగా పెట్టుకున్నాం. 15-17 మధ్య వయస్కులు 1.77 లక్షల మంది ఉండగా.. 45శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. అర్హులకు బూస్టర్‌ డోసులు వేస్తున్నాం. వైద్య సిబ్బంది కొవిడ్‌ బారిన పడుతున్నా నిరంతరం శ్రమిస్తూ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. అన్ని రోజులు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో ఓపీ సేవలు అందిస్తున్నాం. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి జ్వరం సర్వే విడిగా నిర్వహించాలని సూచించాం. నిర్లక్ష్యం వహించకుండా ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తే మూడో దశను సురక్షితంగా దాటగలం.


సరిపడా ఔషధ కిట్లు.. వేగంగా వ్యాక్సిన్లు
మేడ్చల్‌ డీఎంహెచ్‌వో కె.మల్లికార్జునరావు

మేడ్చల్‌ జిల్లాలో పాజిటివిటీ రేటు 4-5 శాతంగా నమోదవుతోంది. పీహెచ్‌సీలు, ఉపకేంద్రాలు, బస్తీ దవాఖానాలతో పాటు ఏఎన్‌ఎంల వద్ద కరోనా పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచాం. పాజిటివ్‌ వచ్చినవారికి మందుల కిట్‌ ఇచ్చి ఇంట్లో ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నాం. ఆరోగ్య సిబ్బందితో వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకబు చేయిస్తున్నాం. అత్యవసరమైతే గాంధీ, టిమ్స్‌ ఆసుపత్రులకు తరలిస్తున్నాం.  మల్కాజిగిరి ఆసుపత్రిలో 20, ఘట్‌కేసర్‌లో 10 పడకలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ లక్షణాలున్న రోగులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నాం. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 46 లక్షల మందికి టీకాలు అందించాం. 26 లక్షల మంది మొదటి డోసు వేయించుకోగా.. 20 లక్షల మంది రెండో డోసు వేయించుకున్నారు. రెండో డోసు తీసుకోని వారికి ప్రత్యేకంగా ఫోన్లు చేసి వేయించుకునేలా ప్రోత్సహిస్తున్నాం. 15-17 ఏళ్ల వయసు ఉన్న యువత మేడ్చల్‌ జిల్లాలో 1.65 లక్షల మంది ఉండగా.. ఇప్పటికే 75 వేల మందికి టీకాలు వేశాం. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతేనే బయటకు రావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని