logo

ఆనాటి కట్టడాలకు.. ఈనాటి ఆకృతులు

భాగ్యనగరం వారసత్వ సంపద పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సర్కారు ఆదేశాలతో గుర్తించిన కట్టడాల పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించింది. ప్రణాళిక విభాగం

Published : 22 Jan 2022 03:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్యనగరం వారసత్వ సంపద పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సర్కారు ఆదేశాలతో గుర్తించిన కట్టడాల పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించింది. ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో వారసత్వ కట్టడాలకు అచ్చు గుద్దినట్లు ఆకృతులను తయారు చేసే ఆర్కిటెక్ట్‌ల ఎంపిక మొదలైంది. అర్హత గల సంస్థలు నెలాఖరు లోపు దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలను పరిశీలించాక 20 సంస్థలను ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు.

ఉపయోగం ఏంటంటే..: నగరంలో వందకుపైగా చారిత్రక కట్టడాలు ఉంటాయని అంచనా. అందులోని 27 కట్టడాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ కట్టడాల కింద పరిరక్షించాలని నిర్ణయించింది. వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలను గ్రేటర్‌ వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ ఇప్పటికే ప్రారంభించింది. చాంద్రాయణగుట్ట చెన్నకేశవస్వామి దేవాలయం, గోల్కొండ శంషీర్‌ కోట, ఇబ్రహీంబాగ్‌ ప్రేమావతి మసీదు, ఖైరతాబాద్‌లోని ఖైరాతిబేగమ్‌ సమాధి-మసీదు, కుల్సుంపురలోని కుల్సుమ్‌ బేగం మసీదు, కార్వాన్‌ టోలీమసీదు, కోఠి మహిళా కళాశాలలోని బ్రిటీష్‌ రెసిడెన్సీ, అబిడ్స్‌ గన్‌ఫౌండ్రీ, ముసారాంబాగ్‌లోని మోన్స్‌ రేమండ్స్‌ ఓబెలిస్క్‌, చార్మినార్‌ మక్కామసీదు, కుతుబ్‌షాహి టూంబ్స్‌, ఖజానా భవనం, తారామతి బారాదరి, తదితరాలు ఆ జాబితాలో ఉన్నాయి. వాటికి అదనంగా మరిన్ని కట్టడాలను అభివృద్ధి చేయాలని పురపాలకశాఖ నిర్ణయించింది. ‘‘కట్టడాలను పునరుద్ధరించాలంటే వాటికి డిజైన్లు రూపొందించాలి. అందుకు ఆర్కిటెక్ట్‌లను నియమించాలి. ప్రత్యేకంగా నియామకం చేపట్టాలంటే.. ప్రక్రియ పూర్తయ్యేందుకు నెలల సమయం పడుతుంది. అందుకే సంబంధిత రంగంలో అనుభవమున్న సంస్థలను జీహెచ్‌ఎంసీతో మూడేళ్లు ఎంప్యానెల్‌మెంట్‌ చేయాలని నిర్ణయించాం. టెండర్‌ నిబంధనలు అనుసరించి సంస్థలను ఎంపిక చేయడం వల్ల ఆయా సంస్థలకు ఎప్పుడైనా ఆకృతులను గీసే పని అప్పగించవచ్చు. సమాంతరంగా నిర్మాణ పనులనూ చేపట్టవచ్చు.’’ అని ప్రణాళిక విభాగం అధికారులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని