logo

రూ.కోట్లిస్తున్నా ప్రజలకు పాట్లే

ఖజానా ఖాళీ అవుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖవైపు చూస్తుంది. కుదిరితే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు.. లేదంటే భూములు, స్థిరాస్తుల విలువలు పెంచేసి.. తదనుగుణంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అలాంటి ముఖ్యమైన శాఖ కార్యాలయాలు మాత్రం.. అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లో

Published : 25 May 2022 02:45 IST

ఇరు పార్టీలు కూర్చునేందుకు సైతం అవకాశం లేని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు
ఈనాడు - హైదరాబాద్‌

కూకట్‌పల్లిలోని కార్యాలయంలో కనిపించని కుర్చీలు

ఖజానా ఖాళీ అవుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖవైపు చూస్తుంది. కుదిరితే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు.. లేదంటే భూములు, స్థిరాస్తుల విలువలు పెంచేసి.. తదనుగుణంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అలాంటి ముఖ్యమైన శాఖ కార్యాలయాలు మాత్రం.. అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లో కనీసం పార్కింగ్‌ లేని ప్రాంతాల్లో, పైఅంతస్తుల్లో.. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు వచ్చినవారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని దీనస్థితిలో ఉన్నాయి. వచ్చిన వారితో ఆదాయం వస్తున్నా.. వారు కూర్చోవడానికి కుర్చీలు కూడా దొరకని పరిస్థితి. నగరంలో ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లినా ఇదే దుస్థితి కనిపిస్తుంది.

నిల్చొనే సంతకాలు
గ్రేటర్‌ పరిధిలో మొత్తం 41 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ఇందులో 90 శాతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారులపై ఉన్న భవనాల్లో ఈ కార్యాలయాలు చాలా వరకు ఉన్నాయి. అక్కడ బండి నిలపడానికి కూడా చోటుండదు. విలువైన డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టుకోడానికి ఒక కుర్చీ, టేబుల్‌ కూడా కార్యాలయాల్లో ఉండటం లేదు. కష్టంగా ఒక స్టూలు, పొడుగాటి బల్ల.. లేదంటే గోడకు ఒక చిన్న బల్ల తప్ప ఏమీ కనిపించని దుస్థితి. సంతకాలకు వచ్చే వారు కూర్చొని ప్రశాంతంగా డాక్యుమెంట్లు చదువుకునే వెసులుబాటు కూడా కల్పించడంలేదు. సిబ్బంది కూర్చోవడానికే తప్ప లావాదేవీలు నిర్వహించడానికి వచ్చేవారు ఎక్కడ కూర్చోవాలో తెలియని గందరగోళం గ్రేటర్‌ పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నెలకొని ఉంది.

డాక్యుమెంట్‌ రైటర్‌ వద్దే వెసులుబాటు
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలన్నీ మొదటి, రెండో అంతస్తుల్లో ఉంటే.. డాక్యుమెంట్‌ రైటర్ల కార్యాలయాలు మాత్రం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చాలా చోట్ల ఉన్నాయి. ఫ్యాన్లు, టేబుళ్లు, కుర్చీలతో సౌకర్యవంతంగా కనిపిస్తున్నాయి. దీంతో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు వచ్చేవారు వారి కార్యాలయాల్లోనే కూర్చొంటున్నారు. సంతకాలు పెట్టడానికి, ఫొటోలు దిగడానికి, కొనేవారు, అమ్మేవారు సబ్‌ రిజిస్ట్రార్‌కు కనిపించడానికి మాత్రమే కార్యాలయాల్లోకి వెళ్లి వస్తున్నారు. డబ్బులు లావాదేవీలు, సంప్రదింపులు సలహాలన్నీ డాక్యుమెంట్‌ రైటర్ల వద్దే నడుస్తున్నాయి. కాస్త కూర్చోడానికి అక్కడే వెసులుబాటు ఉంటోంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు