logo

ఈవీ.. ఛార్జింగ్‌ ఈజీ

పెరుగుతున్న ఇంధన ధరలు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత ఇబ్బందికరం. ధరల భారంతో ఆటోలను ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ)గా మార్చినా ఛార్జింగ్‌ కేంద్రాలు తక్కువగా ఉండడంతో సమస్యగా మారుతోంది

Published : 25 May 2022 04:32 IST

నగరంలో మరో 100 బ్యాటరీ స్వాపింగ్‌ కేంద్రాలు
రేస్‌ ఎనర్జీ అంకుర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు


హైటెక్‌ సిటీలోని కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: పెరుగుతున్న ఇంధన ధరలు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత ఇబ్బందికరం. ధరల భారంతో ఆటోలను ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ)గా మార్చినా ఛార్జింగ్‌ కేంద్రాలు తక్కువగా ఉండడంతో సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో ‘రేస్‌ ఎనర్జీ’ అంకుర సంస్థ నగరంలో కొత్తగా 100 బ్యాటరీ మార్పిడి(బ్యాటరీ స్వాపింగ్‌) కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. డీజిల్‌, పెట్రోలుతో నడిచే ఆటోలను  రెట్రో ఫిట్టింగ్‌ ద్వారా ఈవీలుగా మార్చిన సంస్థ.. ఇప్పుడు బ్యాటరీ స్వాపింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే హైటెక్‌ సిటీ, కొండాపూర్‌లో 15 కేంద్రాలను ప్రారంభించింది. ఈ ఏడాది చివరిలోగా నగరంలోని హిందుస్థాన్‌, భారత్‌ పెట్రోలియం బంకుల్లో కొత్త వాటిని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఆటోలు, ద్విచక్ర వాహనాలకు మాత్రమే బ్యాటరీ స్వాపింగ్‌ సదుపాయం కల్పిస్తోంది.
రెట్రో ఫిట్టింగ్‌ నుంచే అన్నీ..
బిట్స్‌ పిలానీ పూర్వ విద్యార్థి అరుణ్‌ శ్రేయస్‌ 2018లో రేస్‌ ఎనర్జీ అంకుర సంస్థ ప్రారంభించారు. పెట్రోలు, డీజిల్‌తో నడిచే ఆటోలను ప్రయోగాత్మకంగా ఈవీలుగా మార్చారు. పెట్రో ధరల పెంపుతో భారీగా ఆటోలు ఈవీలుగా మారాయి. నగరంలో భారీగా బ్యాటరీస్వాపింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఆటోవాలాలకు ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో కొత్తగా 100కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. దక్షిణాదిలో 500 కేంద్రాలఏర్పాటు లక్ష్యమని వివరించారు.
సులువుగా..
బంకులో పెట్రోలు పోయించినంత సులువుగా బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేస్తున్నట్లు సంస్థ రేస్‌ ఎనర్జీ సీఈవో అరుణ్‌ శ్రేయస్‌ తెలిపారు. రేస్‌ ఎనర్జీ ద్వారా రెట్రో ఫిట్టింగ్‌ చేయించిన ఆటో, ద్విచక్రవాహనానికి ప్రత్యేక ఐడీ కేటాయించి యాప్‌తో అనుసంధానిస్తారు. ఛార్జింగ్‌ చేయించాలనుకునే వాహనదారు బ్యాటరీ కేంద్రానికి వెళ్లి అక్కడి తెరపై కోడ్‌ నమోదు చేయాలి. వాహన బ్యాటరీలను అరల్లో అమర్చాలి. డిజిటల్‌గా బిల్లు చెల్లించగానే.. ఛార్జ్‌ చేసి సిద్ధంగా ఉంచిన బ్యాటరీ అరలు తెరుచుకుంటాయి. వాటిని వాహనంలో అమర్చుకోవాలి. రెండు నిమిషాల్లో ఇది పూర్తయ్యేలా వ్యవస్థను రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని