logo

ఖాళీ స్థలమా.. చేసేద్దాం క్రీడామైదానం

నివాసాల మధ్య ఖాళీ స్థలం కనిపిస్తే.. అక్కడ చెత్త పడేసి.. అందులో వర్షపు నీరు నిలిచిపోయి.. మురుగు తోడై దోమలు, క్రిములు, కీటకాల వ్యాప్తితో స్థానిక నివాసితులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు.

Updated : 17 Aug 2022 04:05 IST

చెత్తకు, దోమలకూ చెక్‌ పెట్టొచ్చు

ఈనాడు, హైదరాబాద్‌: నివాసాల మధ్య ఖాళీ స్థలం కనిపిస్తే.. అక్కడ చెత్త పడేసి.. అందులో వర్షపు నీరు నిలిచిపోయి.. మురుగు తోడై దోమలు, క్రిములు, కీటకాల వ్యాప్తితో స్థానిక నివాసితులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు. వెళ్లి శుభ్రం చేయలేని పరిస్థితి. బల్దియా సిబ్బందికి చెప్పినా ప్రయోజనం ఉండదు. దీంతో ఒక ఐడియా కాలనీ స్థితిగతులనే మార్చేసింది. ఆ ఖాళీ స్థల యజమానిని ఒప్పించి అందులో షటిల్‌ బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, వాలీబాల్‌, బీచ్‌ వాలీబాల్‌, ఇంకా స్థలముంటే ఫుట్‌బాల్‌ క్రీడామైదానాలుగా మార్చేస్తున్నారు. కొన్ని కాలనీల్లో 2, 3 క్రీడామైదానాలు ఏర్పడుతున్నాయి. నార్సింగ్‌, పుప్పాలగూడ, అత్తాపూర్‌, కొండాపూర్‌, మాదాపూర్‌ ఇలా నగరం నలువైపులా ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఆట కోసం ఎంతోదూరం వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటికి చేరువలోనే మైదానం సమకూరడంతో పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా ఆడుకుని సేద తీరుతున్నారు.

మైదానాలు కరవైన వేళ..

నగరంలో 60 గజాల స్థలంలో 6 అంతస్తులు నిర్మించేస్తున్నారు ప్రైవేటు వ్యక్తులు. ప్రభుత్వానికి ఏమాత్రం స్థలమున్నా అక్కడ మంచి ధర పలుకుతోందంటే.. దానిని అమ్మేసి సొమ్ము చేసుకోవాలని పాలకులు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో పార్కులు, క్రీడామైదానాలు కరవైపోతున్నాయి. దీంతో ఇంటి పక్కనే క్రీడాస్థలం దొరికితే చాలు.. అంతకన్నా ఆనందం ఏముంటుంది. కొన్నిచోట్ల అయితే ప్రైవేటు స్థలాన్ని లీజుకు తీసుకుని క్రీడామైదానాలుగా అభివృద్ధి చేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడేందుకు ఇండోర్‌ స్టేడియంలా తలపించేలా షెడ్లు వేసేస్తున్నారు. వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ కోసం చుట్టూ నెట్‌ కట్టేసి ఎండ పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇలా సిద్ధం చేసుకోవచ్చు

కొత్త నిర్మాణాల కోసం సెల్లార్లు, పునాదులు తవ్వినప్పుడు వచ్చే మట్టిని ఎక్కడ వేయాలో తెలియక నానా అవస్థలు పడుతుంటారు. వారిని సంప్రదిస్తే 2, 3 లారీల లోడు మట్టిని తెచ్చి ఖాళీ స్థలంలో పడేస్తారు. నలువైపులా నాలుగు ఇనుప పోల్స్‌ ఏర్పాటు చేసి వాటికి నెట్‌ బిగిస్తే క్రీడామైదానం సిద్ధమైపోతుంది. వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, క్రికెట్‌ మైదానానికి అయితే బంతి బయటకు వెళ్లకుండా నెట్‌ కట్టాలి. బీచ్‌ వాలీబాల్‌ అయితే 2 లారీల ఇసుక పోయాలి. ఫుట్‌బాల్‌కు జర్మన్‌ టర్పిన్‌ వేస్తే సరిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని