logo

పనులు చేసినా.. పైసలు ఇవ్వరే..!

బషీరాబాద్‌ మండలం నవాంద్గీ ఉప సర్పంచి గోపాల్‌ రూ.15లక్షలు ప్రైవేటు వ్యక్తి వద్ద రూ.3 వడ్డీకి అప్పుగా తీసుకొచ్చి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి గ్రామంలో సిమెంటు దారులు నిర్మించారు. నెలలోపే బిల్లులు వస్తాయని అధికారులు చెప్పడంతో

Published : 27 Sep 2022 04:35 IST

రూ.17.43 కోట్లకు సర్పంచుల ఎదురు చూపులు
న్యూస్‌టుడే, పాత తాండూరు, బషీరాబాద్‌

నవాంద్గీలో రూ.15లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంటు దారి

బషీరాబాద్‌ మండలం నవాంద్గీ ఉప సర్పంచి గోపాల్‌ రూ.15లక్షలు ప్రైవేటు వ్యక్తి వద్ద రూ.3 వడ్డీకి అప్పుగా తీసుకొచ్చి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి గ్రామంలో సిమెంటు దారులు నిర్మించారు. నెలలోపే బిల్లులు వస్తాయని అధికారులు చెప్పడంతో పనులు వేగంగా పూర్తి చేశారు. డబ్బులు రాకపోగా నెలకు రూ.45వేల వడ్డీ అవుతోందని, ఆరు నెలలుగా రూ.2.70లక్షలు వడ్డీ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భోజ్యానాయక్‌ తండా సర్పంచి శాంతి రూ.11లక్షల పనులు చేయగా, ఇటీవల రూ.3లక్షలు వచ్చాయి. మిగతా రూ.8లక్షలు రావాల్సి ఉంది. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలామంది పనులు చేసి ఉపాధి హామీ పథకం నిధులు ఎప్పుడొస్తాయా.. అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ముఖం చాటేస్తున్నారు
ప్రజాప్రతినిధిగా ఎన్నికైనందున ఊరిలో అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశం.. ఖర్చులకు నాలుగు పైసలు వస్తాయనే ఆశతో గ్రామస్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు ఇలా గ్రామస్థాయి నేతలు సిమెంటు దారుల నిర్మాణం చేపట్టారు. ఆరు నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఆప్పులపాలై ఇచ్చేవారికి ముఖం చాటేస్తున్నారు. వెంటనే బిల్లులు వస్తాయని అధికారులు చెప్పడంతో తాము నగలు కుదువ పెట్టడంతో పాటు తెలిసిన వారి వద్ద వడ్డీకి తెచ్చి రూ.లక్షల్లో సిమెంటు దారులు నిర్మించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మార్చిలోగా పూర్తిచేయాలన్నారు
2021-22 ఆర్థిక సంవత్సరానికి గ్రామాల్లో సిమెంటు దారుల నిర్మాణం కోసం జిల్లా వ్యాప్తంగా రూ. 37.33 కోట్లు మంజూరయ్యాయి. ఈఏడాది మార్చి నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేయాలని, త్వరగా బిల్లులు వస్తాయని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులకు వివరించారు. దీంతో గ్రామాల్లో పనులు వేగవంతంగా పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.33.91 కోట్లతో సిమెంటు దారుల నిర్మాణం పూర్తి చేశారు. వివిధ కారణాలతో 3.42 కోట్ల పనులు చేయలేదు.  ఇప్పటి వరకు రూ.19.90 కోట్లు మాత్రమే నిధులు వచ్చాయి. మిగతా రూ.17.43 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. విడతల వారీగా మంజూరవుతున్న నిధులను సర్పంచుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని, పంచాయతీరాజ్‌శాఖ జిల్లా కార్యాలయ బిల్లుల చెల్లింపు విభాగం అధికారి ఒకరు ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని