logo

డబ్బివ్వమని ఒకరు..మనువాడమని మరొకరు

కొవిడ్‌ చికిత్స కోసం సంప్రదించిన 55 ఏళ్ల మహిళను వేధించిన నర్సు, ఉద్యోగం ఇప్పించినందుకు పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డ వ్యక్తి, ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికను ఇబ్బందిపెట్టిన యువకుడు.. ఈ ముగ్గురూ కటకటాలపాలయ్యారు.

Published : 03 Dec 2022 04:12 IST

వేర్వేరు మహిళల్ని వేధిస్తున్న ఇద్దరికి జైలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ చికిత్స కోసం సంప్రదించిన 55 ఏళ్ల మహిళను వేధించిన నర్సు, ఉద్యోగం ఇప్పించినందుకు పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డ వ్యక్తి, ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికను ఇబ్బందిపెట్టిన యువకుడు.. ఈ ముగ్గురూ కటకటాలపాలయ్యారు. హైదరాబాద్‌ షీటీమ్స్‌ బృందాలకు నవంబరులో 103 ఫిర్యాదులు అందినట్లు అదనపు కమిషనర్‌(షీ టీమ్స్‌, భరోసా) ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 12 మందిపై కేసులు, 26 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశామని, 98 మందిని హెచ్చరించి వదిలేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమైన కేసుల వివరాలివి.

బెదిరించి డబ్బు వసూలు: కొవిడ్‌ చికిత్స కోసం టెలీమెడిసిన్‌ ద్వారా సంప్రదించిన 55 ఏళ్ల మహిళను నర్సుగా పనిచేసే 31 ఏళ్ల వ్యక్తి వేధించాడు. వైద్యం విషయంలో అదనపు శ్రద్ధ తీసుకుంటున్నట్లు నటించి.. ఆమె వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాడు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి.. పరువు తీస్తానని బెదిరించి డబ్బు వసూలు చేశాడు. బాధిత మహిళ షీ టీమ్స్‌ను ఆశ్రయించగా, నిందితుడు మహ్మద్‌ గులామ్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఎనిమిది రోజుల సాధారణ జైలుశిక్ష విధించారు.

కొలువు ఇప్పించా.. మనువాడు: వివాహిత(26)కు అకౌంటెంట్‌ ఉద్యోగం ఇప్పించిన ఓ వ్యక్తి.. అందుకు ప్రతిఫలంగా వివాహం చేసుకోవాలంటూ ఆమె వెంటపడ్డాడు. తనకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారని చెప్పినా వినకుండా వేధించడం ప్రారంభించాడు. ఉద్యోగం నుంచి తీసేశాడు. వేధింపులు భరించలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అర్జున్‌(33)ను అరెస్టు చేశారు. నిందితుడికి కోర్టు ఐదు రోజుల జైలుశిక్ష విధించింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని