logo

నేర వార్తలు

మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు చిత్రీకరించి కాలబురాగి(గుల్బర్గా)లోని వ్యక్తికి పంపిన నిందితుడిపై పీడీ చట్టం విధిస్తామని ఫలక్‌నుమా ఏసీపీ షేక్‌ జహంగీర్‌ తెలిపారు.

Published : 06 Dec 2022 02:19 IST

మహిళల నగ్న చిత్రాల నిందితుడిపై పీడీ చట్టం

కేశవగిరి, న్యూస్‌టుడే: మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు చిత్రీకరించి కాలబురాగి(గుల్బర్గా)లోని వ్యక్తికి పంపిన నిందితుడిపై పీడీ చట్టం విధిస్తామని ఫలక్‌నుమా ఏసీపీ షేక్‌ జహంగీర్‌ తెలిపారు. సోమవారం చాంద్రాయణగుట్ట ఠాణాలో విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ, డీఎస్సై హరీష్‌కుమార్‌లతో కలిసి ఏసీపీ వివరాలు వెల్లడించారు. పాతబస్తీ బార్కస్‌ సలాలా ప్రాంతంలో మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు చిత్రీకరిస్తూ.. బేరం పెడుతున్న ఘటనలో నిందితుడు కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా రాజేశ్వర్‌ గ్రామానికి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌(35)ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతడు చరవాణిలో పలువురు మహిళల నగ్నచిత్రాలు, వీడియోలను వాట్సాప్‌ ద్వారా కాలబురాగిలోని గులాంకు పంపినట్లు గుర్తించామన్నారు. నిందితుడిపై నిర్భయ చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామన్నారు. పాతబస్తీలో పరిచయమైన ఓ మహిళ ఆధారంగా కొందరు మహిళలను పిలిచి నగ్నచిత్రాలు, వీడియోలు చిత్రీకరించినట్లు తేలిందని చెప్పారు. ఈ తరహాలో మోసపోయిన వారుంటే తనకు గాని, చాంద్రాయణగుట్ట ఠాణాలో లేదా సమీప పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయాలని కోరారు. సీపీ సీవీ ఆనంద్‌, డీసీపీ పి.సాయిచైతన్య ఆదేశాలతో కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మొదటిసారి పాతబస్తీకి వచ్చాడా..?

నిందితుడు సయ్యద్‌ పాతబస్తీకి మొదటిసారి వచ్చాడా లేక అంతకు ముందు వచ్చి వెళ్లాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హుస్సేన్‌కు ఇద్దరు భార్యలు, 8మంది సంతానం ఉన్నారు. వీరంతా బసవకల్యాణ్‌, రాజేశ్వర్‌ గ్రామంలో ఉంటున్నట్లు తేలింది. ప్రధాన నిందితుడు గులాం బాలికలు, యువతులు, మహిళలతో వ్యభిచారం చేయిస్తాడని గుర్తించారు.

ఆ మహిళ ఎవరు..?

పాతబస్తీకి వచ్చిన హుస్సేన్‌కు సహకరించిన మహిళ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. చార్మినార్‌ ప్రాంతంలో ఒక మహిళతో పరిచయం ఏర్పడిందని, తన దందా కోసం మహిళలను ఆమె సమకూర్చిందని హుస్సేన్‌ తెలిపాడు. నగ్నచిత్రాలు, వీడియోలు ఎవరివో తెలుసుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.


లారీని ఢీకొన్న బస్సు.. నలుగురి దుర్మరణం

చెన్నై, న్యూస్‌టుడే: గుమ్మిడిపూండి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్‌ నుంచి ఓ ప్రైవేటు బస్సు ఆదివారం రాత్రి 27 మంది ప్రయాణికులతో చెన్నైకి బయలుదేరింది. బెంగళూరుకు చెందిన కిశోర్‌ డ్రైవర్‌. కాకినాడకు చెందిన శ్రీధర్‌(27) క్లీనర్‌. సోమవారం వేకువజామున 5 గంటల సమయంలో తిరువళ్ళూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని తచ్చూరు వద్ద అదుపుతప్పి లారీని ఢీకొంది. బస్సు ముందు భాగం దెబ్బతింది. క్లీనరు శ్రీధర్‌, ప్రయాణికులు నెల్లూరుకు చెందిన సతీష్‌కుమార్‌ (27), బెంగళూరుకు చెందిన రోహిత్‌శర్మ, చెన్నైకి చెందిన జానకిరామన్‌ (42) ఘటనాస్థలిలోనే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు, క్షతగాత్రులను పోలీసులు పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవరు కిశోర్‌ను కవరప్పేట పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు మూడేళ్లు పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతానికి మంగళవారంతో మూడేళ్లు పూర్తి కానుంది. 2019 నవంబరు 27న నలుగురు నిందితులు యువ వైద్యురాలు దిశపై తొండుపల్లి గేటు వద్ద అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం షాద్‌నగర్‌ శివారు చటాన్‌పల్లి సమీపంలోని 44వ నెంబరు జాతీయ రహదారి కింద సజీవ దహనం చేశారు. అత్యంత అమానవీయమైన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లారీ డ్రైవర్లుగా పనిచేసే ఆరిఫ్‌, చెన్నకేశవులు, శివ, నవీన్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా దిశకు సంబంధించిన వస్తువులు గుర్తించేందుకు నిందితుల్ని పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. అనంతరం క్రైమ్‌ సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం డిసెంబరు 6న చటాన్‌పల్లి తీసుకెళ్లినప్పుడు జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించడం మరో సంచలనం. నిందితుల ఎన్‌కౌంటర్‌ కట్టుకథ అని జస్టిస్‌ వీఎస్‌ సిర్పూర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసులపై హత్యానేరం నమోదు చేయాలని సూచించింది. మొత్తం 383 పేజీల నివేదిక సమర్పించింది. ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపామన్న పోలీసుల వాదనను తప్పుబట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది.


నగరంలో హై అలర్ట్‌

ఈనాడు- హైదరాబాద్‌: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగి మంగళవారం నాటికి 30 ఏళ్లవుతున్న నేపథ్యంలో పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతల పరంగా సున్నిత పరిస్థితుల నేపథ్యంలో పాతబస్తీ సహా వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి గస్తీ పెంచారు. చార్మినార్‌ సహా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటుచేస్తున్నారు. నిరసన కార్యక్రమాలకు అవకాశంలేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని పార్టీలు శాంతియుత నిరసనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో భద్రత పెంచారు.


దోపిడీ సొత్తు కోసం వేట

ఈనాడు- హైదరాబాద్‌: నాగోల్‌ స్నేహపురికాలనీలోని ఆభరణాల దుకాణంలో కాల్పులు దోపిడీకి పాల్పడిన కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దోచుకున్న సొత్తు కోసం వేట కొనసాగుతోంది. మహారాష్ట్ర, హరియాణా సహా నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సమాచారం. నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారం దోపిడీకి పాల్పడిన నేపథ్యంలో గతంలోనూ ఇలాంటి నేర చరిత్ర ఉందా అని తెలుసుకుంటున్నారు. రివాల్వర్‌ ఎక్కడి నుంచి తెచ్చారని కూపీ లాగుతున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు 15 బృందాలను ఏర్పాటు చేయగా.. మొత్తం ఆరు రాష్ట్రాల్లో గాలించారు. నగరంలోని బంగారం దుకాణం యజమానులు అప్రమత్తమయ్యారు. కొందరు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటుచేసుకుంటున్నారు.


ఆరోగ్య కేంద్ర భవనం తలుపులు వేసుకొని వైద్యాధికారి నిరసన

కాచిగూడ, న్యూస్‌టుడే: తాను కనిపెట్టిన కరోనా మందును వినియోగంలోకి తేవాలని, అందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సహకరించడం లేదని ఆరోపిస్తూ యూపీఎస్‌సీ లోపలి నుంచి తలుపులు పెట్టుకుని వైద్యాధికారి నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిపించాలని డిమాండ్‌ చేశారు.  కాచిగూడ ఇన్‌స్పెక్టర్‌ రామలక్ష్మణరాజు కథనం ప్రకారం... ఇసామియాబజార్‌ యూపీఎస్‌సీ వైద్యాధికారి వసంత్‌కుమార్‌ సోమవారం సాయంత్రం భవనం లోపలి నుంచి గడియ పెట్టుకుని నిరసన చేపట్టారు. డీఎంహెచ్‌ఓ వెంకటి, ఎస్సై రవికుమార్‌, వైద్య, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని బయటకు రావాలని అభ్యర్థించారు. పోలీసులు, వైద్యాధికారులు అతన్ని బుజ్జగిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని