logo

కోట్ల నిధులు మురుగులోకే!

గోల్కొండ కోట సమీపంలోని చారిత్రక కటోరా హౌజ్‌ జలాశయం అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించినా.. ఫలితం కనిపించడం లేదు.

Published : 27 Jan 2023 03:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: గోల్కొండ కోట సమీపంలోని చారిత్రక కటోరా హౌజ్‌ జలాశయం అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించినా.. ఫలితం కనిపించడం లేదు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో, మురుగుతో ప్రస్తుతం జలాశయం డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. 2018 నుంచి పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నా.. మురుగు కూపంలా మారిపోయింది.

450 ఏళ్ల చరిత్ర..: వారసత్వ కట్టడాల్లో చారిత్రక కటోరా హౌజ్‌కు 450 ఏళ్ల చరిత్ర ఉంది. ఇబ్రహీం కుతుబ్‌షా హయాంలో 1560లో నిర్మించారు. కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురై.. స్థానిక నివాసాల నుంచి వెలువడే మురుగు, వ్యర్థాలు జలాశయంలోకి చేరాయి. నాలుగు ఎకరాల విస్తీర్ణంలోని ఈ జలాశయం ప్రస్తుతం ఏఎస్‌ఐ పరిధిలో ఉంది. ఈ విభాగం అనుమతితో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆహ్లాదకర ప్రదేశంగా మార్చాలని మంత్రి కేటీఆర్‌ సూచనతో 2018లో అధికారులు రూ.35 లక్షలతో డీ-సిల్టింగ్‌ ప్రక్రియ చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యంతో పాత కథే పునరావృతమైంది. 2019లో మరో రూ.50 లక్షలు మంజూరయ్యాయి. 2020 అక్టోబర్‌లో వరదలతో రిటైనింగ్‌ గోడ కూలిపోయింది.2021 ఫిబ్రవరిలో  రూ.3.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. నాలుగు బోర్‌వెల్‌ల డ్రిల్లింగ్‌, డి-సిల్టింగ్‌, వ్యర్థాల ఏరివేత పనులు చేపడతామని ప్రకటించింది. ఏళ్లు గడుస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.  ప్రహరీ లేకపోవడంతో కబ్జాదారుల కన్ను పడిందని వారసత్వ కట్టడాల ప్రేమికులు ఆరోపిస్తున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని