logo

పెచ్చరిల్లిన నిర్లక్ష్యం.. భద్రత గాలిలో దీపం

విద్యుత్తు తీగలు ప్రమాదవశాత్తు ఎక్కడైనా తెగిపడితే లైన్‌ వెంటనే ట్రిప్‌ అయ్యి సరఫరా ఆగిపోవాలి. ఇందు కోసం విద్యుత్తు లైన్లలో రిలేలు, బ్రేకర్లు, జంపర్లు ఏర్పాటు చేస్తుంటారు.

Published : 23 Mar 2023 02:56 IST

విద్యుత్తు తీగలు తెగి పడినా ట్రిప్‌ అవ్వని వ్యవస్థలు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు తీగలు ప్రమాదవశాత్తు ఎక్కడైనా తెగిపడితే లైన్‌ వెంటనే ట్రిప్‌ అయ్యి సరఫరా ఆగిపోవాలి. ఇందు కోసం విద్యుత్తు లైన్లలో రిలేలు, బ్రేకర్లు, జంపర్లు ఏర్పాటు చేస్తుంటారు. వీటి కోసం ఏటా డిస్కం కోట్లలోనే వ్యయం చేస్తోంది. వీటిని బిగించిన తర్వాత నిర్వహణ, పనితీరుపై సమీక్ష లేక క్షేత్రస్థాయిలో వీటిని బైపాస్‌ చేస్తున్నారు. దాంతో 11 కేవీ, కవర్‌ కండక్టర్లు తెగిపడినా సరఫరా ఆగక అమాయకుల ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రమాదాలు జరక్కుండా తొడుగు ఉన్న విద్యుత్తు తీగ(కవర్‌ కండక్టర్‌)లను డిస్కం ఏర్పాటు చేస్తే.. సరైన నిర్వహణ లేక అదే తొడుగు ఉన్న విద్యుత్తు తీగ ఇప్పుడు ఓ వ్యక్తి ప్రాణాలు తీయడం గమనార్హం.

ప్రాణాలు పోతున్నాచర్యలు శూన్యం..

ఈ నెల 17న తెల్లవారుజామున గాలి వానకు చెట్ల కొమ్మలు పడి పద్మారావునగర్‌లోని ఓ పార్కులో కవర్‌ కండక్టర్‌ తెగి అక్కడి పార్కులో పడింది. ఉదయాన్నే నడకకు వచ్చిన ఓ వ్యక్తి చూసుకోకుండా దానిపై అడుగు వేయడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విద్యుత్తు పంపిణీ సంస్థ వైఫల్యానికి ఒక కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయి అనాథలా మారింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. యంత్రాంగానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడమే వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
రిలేలు పని

చేయకుండా చేస్తున్నారు..

132 కేవీ, 33 కేవీ విద్యుత్తు తీగలు ఎక్కడైనా తెగినా వెంటనే ట్రిప్‌ అవుతున్నాయి. వీటి రిలేలు బాగానే పనిచేసేలా పర్యవేక్షణ ఉంటోంది. కాలనీల్లో, ప్రతి గల్లీలో ఉండే 11 కేవీ లైన్ల రిలేలపై పర్యవేక్షణ సరిగా లేదు. రిలే సక్రమంగా ఉంటే చిన్న గాలి వచ్చినా, వాన పడినా లైన్‌ వెంటనే ట్రిప్‌ అవుతుంది. ఆ తర్వాత సిబ్బంది చూసుకొని సరఫరా పునరుద్ధరించాలి. ఈ తతంగం అంతా ఎందుకు అన్నట్లు కొందరు సిబ్బంది రిలే స్విచ్ఛ్‌ పనిచేయకుండా మాన్యువల్‌లో పెడుతున్నారు. ఏదైనా పెద్ద సమస్య వస్తే జంపర్‌ పోతుందిలే అనే ధోరణిలో ఉంటున్నారు. ఇంజినీర్లకు ఈ విషయం తెలిసినా తేలిగ్గా తీసుకుంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రకృతి మీద నెపం నెట్టి, పరిహారం ఇచ్చి సమస్య సమసిపోయేలా సెటిల్‌ చేస్తున్నారు తప్ప బాధ్యులపై చర్యలు ఉండటం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని