logo

రంజాన్‌ జోష్‌.. అత్తర్లకు క్రేజ్‌

రంజాన్‌ నేపథ్యంలో పాతనగరంలో అత్తర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లలో అత్తర్‌కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్‌ మాసంలో అనేక రకాల ఫ్లేవర్లకు డిమాండ్‌ అధికంగా ఉంటోంది.

Published : 29 Mar 2024 03:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: రంజాన్‌ నేపథ్యంలో పాతనగరంలో అత్తర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లలో అత్తర్‌కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్‌ మాసంలో అనేక రకాల ఫ్లేవర్లకు డిమాండ్‌ అధికంగా ఉంటోంది. పాతబస్తీ అనగానే మొదటగా గుర్తొచ్చేది వీటి పరిమళాలే. చార్మినార్‌కి సమీపంలో అనేక వ్యాపారాలు శతాబ్దాలుగా నడుస్తున్నాయి. ఇక్కడ దాదాపు 500 రకాలకు పైగా అత్తర్లు లభిస్తున్నాయి. కొన్ని దుకాణాలు 150 సంవత్సరాలుగా కొనసాగుతుండగా.. నాలుగో తరం వ్యక్తులు ప్రస్తుతం వీటి బాధ్యతలు చూసుకుంటున్నారు. 1896లో బుర్హాన్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి పాతబస్తీలో స్థిరపడిన రాణ్‌ దాస్‌ కుటుంబం వద్ద 500 కంటే ఎక్కువ రకాల అత్తర్లు లభిస్తున్నాయి. ఇక్కడి దుకాణాల్లో సహజ సిద్ధంగా తయారు చేసిన అత్తర్లతో పాటు సింథటిక్‌ అత్తర్లు లభిస్తున్నాయి. 10 మి.లీ రూ.160 నుంచి రూ.4000 ధర పలికే అత్తర్లు ఈ పండగ సీజన్‌లో వెనువెంటనే అమ్ముడవుతున్నాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. గులాబీ, మల్లె, చేమంతి ఇలా అనేక రకాల పూల నుంచి తయారుచేసే అత్తర్లకు రంజాన్‌ సమయంలో గిరాకీ ఎక్కువగా ఉంటోంది. షమతుల్‌ అంబర్‌, హీనా, జాఫ్రాన్‌, దహనుల్‌ ఊద్‌, జన్నతుల్‌ ఫిర్దోస్‌, మజ్మా, షాజహాన్‌, మన్నా, నాయబ్‌, హుప్‌, బకూర్‌, మొకల్లత్‌, ఖస్‌, ఇత్రేగిల్‌ వంటి అత్తర్లు మార్కెట్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో లభించే కొన్ని రకాల అత్తర్లు తులం రూ.200 నుంచి మొదలవుతున్నాయి. అరబ్‌ దేశాల్లో ఉపయోగించే దహనల్‌ ఊద్‌ అనే అత్తరు ఇక్కడ లభిస్తుండగా.. తులం రూ.2 వేల నుంచి రూ.6 వేల ధర పలుకుతోంది. రాత్‌ కి రాణి, ముస్క్‌ రోజ్‌, బ్లాక్‌ మస్క్‌, వైట్‌ మస్క్‌, కూల్‌ బ్రీజ్‌, జమ్‌ జమ్‌ ఫ్లవర్‌ అత్తర్లు అత్యంత ఖరీదైనవి. వీటి ధర 3 మి.లీలకు రూ.3 వేల చొప్పున ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని