logo

హత్యా.. ఆత్మహత్యా?

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందింది. షాయినాయత్‌గంజ్‌ ఎస్సై లక్ష్మయ్య వివరాల ప్రకారం..

Published : 30 Mar 2024 02:08 IST

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

గోషామహల్‌, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందింది. షాయినాయత్‌గంజ్‌ ఎస్సై లక్ష్మయ్య వివరాల ప్రకారం.. గోషామహల్‌ జోషివాడీకి చెందిన దిల్లూబుల్‌(27) స్క్రాప్‌ దుకాణంలో, భార్య ఆస్మిత ఇళ్లలో పనిచేస్తారు. వారికి పవిత్ర (5.5 ఏళ్లు) దిబేశ్‌(3), ఇషాన్‌(10 నెలలు) ఉన్నారు. వారు పిల్లలను ఇంట్లో వదిలేసి పనులకు వెళ్తుంటారు. దిల్లూబుల్‌ గురువారం ఉదయం పనికెళ్లగా భార్య  పని నుంచి మధ్యాహ్నం తిరిగొచ్చింది. సాయంత్రం 5 గంటలకు ఆమె మళ్లీ వెళ్లి రాత్రి 9 గంటలకు వచ్చింది. అప్పటికే గదిలో పవిత్ర మెడకు చున్నీ చుట్టి అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. బాలికను ఎవరైనా హత్య చేశారా లేక ప్రమాదవశాత్తు ఆడుకుంటుండగా మెడకు చున్నీ చుట్టుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ప్రేమ పేరుతో నమ్మించి బాలిక హత్య

కాటేదాన్‌, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో బాలికకు దగ్గరైన ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హతమార్చాడు. మైలార్‌దేవుపల్లి ఎస్సై నాయుడు వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామకాలనీలో ఉండే బాలిక(13)ను అదే ప్రాంతంలో నివసించే మహ్మద్‌ మోహిన్‌(30) మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు. అతడికి ఇంతకుముందే పెళ్లయింది. శివరాంపల్లి హసన్‌నగర్‌లో ఉంచాడు. విషయాన్ని బాలికకు  తెలియనివ్వలేదు. ఇటీవల బాలిక మరొకరితో సెల్‌ఫోన్‌లో ప్రేమ మాటలు మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. దానిపై గురువారం రాత్రి ఆమెతో గొడవపడ్డాడు. ‘నీకు పెళ్లైంది కదా.. నీతో ఎలా ప్రేమ కొనసాగించాలని బాలిక నిలదీసింది. ఆయితే ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించి శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నరకు ఓ ఆటోలో వచ్చి పెళ్లి చేసుకుందామని బాలికను వెంటతీసుకెళ్లాడు. కాటేదాన్‌ స్పోర్ట్స్‌ స్టేడియం పక్కన నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమె తలపై బండరాయితో మోది దారుణంగా హతమార్చాడు. అనంతరం మైలార్‌దేవుపల్లి ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు.


ఇల్లు అద్దెకు తీసుకొని మోసం

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఫిర్యాదు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: తన ఇంటిని అద్దెకు తీసుకొని మోసానికి పాల్పడ్డారంటూ విశ్రాంత ఐపీఎస్‌, త్రిపుర రాష్ట్ర మాజీ డీజీపీ కె.నాగరాజ్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ 71లోని నవనిర్మాణ్‌నగర్‌లో నివసించే నాగరాజ్‌కు బంజారాహిల్స్‌ రోడ్‌ 2లోని హుడా రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లో అతనితోపాటు కుమారుడి పేరు మీద స్థలం, ఇల్లు ఉన్నాయి. ఇంటిని హబీబ్‌నగర్‌ ప్రాంతంలో నివసించే కిశోర్‌కుమార్‌కు అయిదేళ్లపాటు లీజుకిచ్చారు. 2023 జనవరి 15తో ఈ గడువు ముగిసింది. అయితే ఇంటిని మెహదీపట్నం ఖాదిర్‌భాగ్‌కు చెందిన అబ్దుల్‌ రహీమ్‌, బేగంబజార్‌ బేదర్‌వాడికి చెందిన దామోదర్‌దాస్‌బజాజ్‌కు సబ్‌్ లీజుకు ఇచ్చినట్లు గుర్తించారు. ప్రహరీ నిర్మించి హద్దులు మార్చి ఓ గదిని ధ్వంసం చేసినట్లు గుర్తించారు. నవంబరు నుంచి కిరాయి సైతం చెల్లించలేదంటూ ఈనెల 27న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


యువతిపై డెలివరీ బాయ్‌ అత్యాచారం

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: యువతిపై ఓ డెలివరీ బాయ్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఒబేదుల్లా ఖాన్‌ ఓ సంస్థలో డెలివరీ బాయ్‌. 8 నెలల క్రితం లక్డీకాపూల్‌లో ఓ యువతి ఇచ్చిన ఆర్డర్‌ ప్రకారం ఆహారాన్ని అందించేందుకు వెళ్లాడు. ఆన్‌లైనులో ఆమె డబ్బు చెల్లించగా ఆమె ఫోన్‌ నంబరు తీసుకొని స్నేహం చేశాడు. గురువారం యువతి హాస్టల్‌లో ఉండగా భోజనానికి వెళ్దామంటూ ద్విచక్రవాహనంపై జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలోని ఓయో గదికి తీసుకెళ్లాడు. ఇద్దరూ మద్యం తాగి భోజనం చేసి అక్కడే నిద్రించారు. ఉదయం యువతి నిద్రలేచే సరికి వివస్త్రగా ఉండటం, చరవాణిలో కొన్ని వీడియోలను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసింది. చరవాణిని నేలకేసి పగులగొట్టింది. శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఒబేదుల్లాఖాన్‌ను అరెస్ట్‌ చేశారు. చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.


పురుగుమందు కంపెనీ మోసం రూ.3 కోట్లు!

300 మంది వరకు బాధితులు

రాయదుర్గం: పురుగుమందు సంస్థ గోల్‌మాల్‌ కేసులో 300 మంది వరకు బాధితులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డీలర్లకు సరకు సరఫరా చేసినట్లు తప్పుడు ఇన్‌వాయిస్‌లు సమర్పించి ఫైనాన్షియల్‌ సంస్థ నుంచి డీలర్ల పేరిట భారీగా డబ్బులు కాజేసి బిచాణా ఎత్తేసిన ల్యాబ్‌ టు ల్యాండ్‌ అగ్రిటెక్‌ సొల్యూషన్స్‌ (పురుగు మందుల) సంస్థ సీఈవో ఆదిత్య దేశ్‌పాండే, సహ వ్యవస్థాపకుడు ఆదిత్య కేఎల్‌పై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపారు. రాయదుర్గం టీహబ్‌లోని కార్యాలయానికి అద్దె సైతం చెల్లించడం లేదట. ఐదారు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో డీలర్‌ పేరిట రూ.2.5-5 లక్షల వరకు ఫైనాన్స్‌ సంస్థ నుంచి సొత్తు దండుకున్నట్లు తెలుస్తోందని, రూ.3 కోట్ల వరకు కాజేసి ఉంటారని ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని