logo

అభివృద్ధి చేసేలోపు.. నదిని మూసేద్దామని!

మూసీ అభివృద్ధికి ఓ వైపున పనులు వేగంగా జరుగుతుంటే.. అంతే జోరుగా నది ఆక్రమణ కొనసాగుతోంది.

Published : 30 Mar 2024 02:43 IST

మూసీ పొడవునా జోరందుకున్న ఆక్రమణలు
నిర్మాణ వ్యర్థాలతో నింపి షెడ్లు, ప్రహరీల నిర్మాణం
ఈనాడు, హైదరాబాద్‌, కార్వాన్‌, న్యూస్‌టుడే

దరియాబాగ్‌ వద్ద నదిని నిర్మాణ వ్యర్థాలతో నింపేశారిలా..

మూసీ అభివృద్ధికి ఓ వైపున పనులు వేగంగా జరుగుతుంటే.. అంతే జోరుగా నది ఆక్రమణ కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతంపై పలువురు నేతలు, స్థానికులు కన్నేశారు. ఆ ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని సర్కారు ప్రకటించడంతో.. ఎలాగైనా చేజిక్కించుకునేందుకు కబ్జాకోరులు యత్నిస్తున్నారు. నదీ గర్భాన్ని నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. ఎకరాల కొద్దీ భూమిని ప్లాట్లుగా మార్చుతున్నారు. వారిని కట్టడి చేయకపోతే.. అంచులను మట్టితో నింపేస్తూ నదిని పిల్ల కాలువలా మార్చేస్తారు. అత్తాపూర్‌ నుంచి నాగోల్‌ మధ్య జరుగుతోన్న ఆక్రమణలపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది..

అత్తాపూర్‌లో..

నార్సింగి నుంచి బాపూ ఘాట్‌ వరకు మూసీ ఆక్రమణలు పెద్దగా కనిపించవు. అత్తాపూర్‌ నుంచి కార్వాన్‌, జియాగూడ, పురానా పూల్‌ వరకు కొంత కాలంగా ఆక్రమణలు జోరందుకున్నాయి. అత్తాపూర్‌ మూసీ వంతెన ఎగువన కూడా రాత్రికి రాత్రి నదిలో కాలనీలు పుట్టుకొస్తున్నాయి. పురానా పూల్‌ నుంచి గుడిమల్కాపూర్‌ను కలుపుతూ మూసీ ఒడ్డున 100అడుగుల రోడ్డు పనులు పూర్తి కాలేదు.నది అంచునే రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక జరిగింది.. ఇంతలోనే ఆ రోడ్డు నుంచి వంద మీటర్ల లోపలివరకు కాలనీలు పుట్టుకొచ్చాయి. దరియాబాగ్‌ గిర్కపల్లి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి గణేశ్‌ ఘాట్‌ వరకు, మొఘల్‌నగర్‌ వద్ద మూసీని ఇటీవల పెద్దఎత్తున పూడ్చారు.షెడ్లు నిర్మించి పార్కింగ్‌ కేంద్రంగా మార్చగా, రెవెన్యూ అధికారులు తొలగించారు. సదరు వ్యక్తి మళ్లీ ప్రహరీ నిర్మించాడు.

చాదర్‌ఘాట్‌ పరిసరాల్లో..

ఇమ్లిబన్‌ బస్టాండ్‌ నుంచి చాదర్‌ఘాట్‌ వరకు నదికి ఇరువైపులా రక్షణ గోడ ఉంది. గోడ లోపల వంద మీటర్ల వరకు మట్టి పోస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు నిలుపుతూ స్థలాన్ని కబ్జాలో పెట్టుకున్నారు. మెకానిక్‌ షెడ్లు నడుపుతున్నారు. ముసారాంబాగ్‌ వంతెన వరకు ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.

రెండు పడక గదుల ఇళ్లు ఇస్తారని..

మూసీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కొత్తసర్కారు నిర్ణయించింది. ఆక్రమణలు తొలగించి, నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లు కట్టేందుకు లేదా కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మూసీ అభివృద్ధి జరిగితే రెండు పడక గదుల ఇల్లు వస్తుందని, లేదంటే కొన్న ఇల్లు అలాగే ఉండిపోతుందని వారంతా భావిస్తున్నారు. ఈ వైఖరితో ఆక్రమణల తొలగింపు క్లిష్టతరం కానుందని, నదిలో పోసిన మట్టి తొలగింపును వెంటనే ప్రారంభించాలని, కంచె నిర్మించాలని నిపుణులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని