logo

మేం ఓటేస్తాం.. మరి మీరు..

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరకొచ్చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మేధావులు, ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈసారి ఇంటి వద్దే ఓటింగ్‌ సౌకర్యాన్ని కల్పించారు.

Published : 10 May 2024 03:32 IST

నేటి తరానికి స్ఫూరిదాయకంగా నిలుస్తున్న వృద్ధులు
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరకొచ్చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మేధావులు, ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈసారి ఇంటి వద్దే ఓటింగ్‌ సౌకర్యాన్ని కల్పించారు. దీనిని కొందరు వినియోగించుకోగా మరి కొందరు ఓపిక తెచ్చుకుని పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు వేస్తామని చెపుతున్నారు. ఇలాంటి తరుణంలో కొత్తగా ఓటు పొందిన వారు, ఓటు వేయడానికి ఆసక్తిచూపని వారు సైతం ముందుకు కదలాల్సిన అవసరాన్ని నొక్కిచొబుతున్నారు. వికారాబాద్‌ పట్టణానికి చెందిన వృద్ధులు ఓటు వేయాల్సిన అవసరాన్ని, గత ఎన్నికలు.. ఇప్పటి ఎన్నికలకు గల తేడాలు, నేతల ప్రచారం, వ్యయం తదితర అంశాలను ‘న్యూస్‌టుడే’ తో పంచుకున్నారు.  


6 కి.మీ నడిచి వెళ్లాను
- పి.రాంరెడ్డి, రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు, కన్యాలాల్‌బాగ్‌, వికారాబాద్‌.

నాకిప్పుడు 90ఏళ్లు. నేను 1957 ఎన్నికల నుంచి ఓటు వేస్తున్నా. అప్పడు నాయకులు, ప్రజలు అనే తేడాలు ఉండేవి కావు. సాదాసీదాగా ఉండేవారు. మా సొంత గ్రామం ధారూర్‌ మండలం ఎబ్బనూరులో పోలింగ్‌ బూత్‌ లేదు. ఓటు వేయడానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న అల్లీపూర్‌కు నడిచి వెళ్లాం. ఇప్పుడు చదువుకున్న వారిలో కొందరు ఓటేసేందుకు చొరవ చూపడంలేదు. అందరూ ఓటేయాలి.  


అభివృద్ధి చేసే వారికే వేయాలి
- దావల్‌గారి అనంతమ్మ, కొత్తగడి, వికారాబాద్‌.

నేను తొలిసారిగా ఇంటివద్ద ఓటు వేశా.నాకు ఇప్పుడు 98 ఏళ్లు. నాకు 5గురు కొడుకులు. అందరూ ప్రయోజకులయ్యారు. ఇప్పటికి అన్ని పనులు నేనే చేసుకుంటాను. గట్టి పదార్థాలను  కూడా తింటాను. ఎవరు మంచి నాయకుడు, ఎవరితో అభివృద్ధి జరుగుతుంది అని చూసి నేటి యువత ఓటేయాలి.


ఒకటికి పదిసార్లు ఆలోచించాలి
 - వై.అడివయ్య స్వామి, రిటైర్డ్‌ పోస్టుమాస్టర్‌, ఎబ్బనూర్‌.  

ఎన్నికల ప్రారంభమైనప్పటి నుంచి ఓటు వేస్తున్నా. నాకిప్పుడు 91 సంవత్సరాలు. మా చిన్నతనంలో గ్రామలో పోలింగ్‌ బూత్‌ కూడా లేదు. నాలుగైదు కిలో మీటర్లు దూరం నడుచుకుంటూ వెళ్లి ఓటు వేశాం. ఓటును వృథా చేయకుండా ఒకటికి పది సార్లు ఆలోచించి మంచి వ్యక్తికి వేయాలి. 


ప్రలోభాలకు లొంగొద్దు
- బూచన్‌పల్లి రాజయ్య, వ్యాపారి, వికారాబాద్‌.

నా వయసు 86 సంవత్సరాలు. నేటి ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది.  అధికారులు, నేతల్లో అవినీతి పెరిగింది. యువ ఓటర్లు ప్రలోభాలకు లొంగకూడదు. అభ్యర్థి వ్యక్తిగత వివరాలను లోతుగా తెలుసుకుని పరిశీలించి ఓటు వేయాలి.


రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం
- శివలీల, దోమ  

దోమ, న్యూస్‌టుడే: ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఒక్కసారికూడా వదలకుండా సద్వినియోగం చేశా. నాకిప్పుడు 92 సంవత్సరాలు. ఓటు వేయకపోతే గుర్తింపు ఉండదు. మనకు చేయాల్సిన పనులు నేతలు చేయరు. మంచి వారిని ఎన్నుకోవడానికి రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటే తప్ప దేశం బాగు పడదు. ఇది ప్రతి మనిషి అంతరాత్మకు తెలిసిన అంశం. కొందరు చెడ్డవారిని కూడా మంచి వారుగా భావించి ఓటేస్తారు. ఇది సరికాదు. మంచివారికే ఓటు వేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని