logo

లబ్ధిదారులే గెలిపిస్తారు

‘హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఓటర్లు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. 40 ఏళ్లుగా ఇక్కడ గెలుస్తున్నామని చెప్పుకుంటున్న నేతలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారే తప్ప..

Updated : 10 May 2024 05:48 IST

హైదరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌

ఇంటర్వ్యూ

‘హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఓటర్లు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. 40 ఏళ్లుగా ఇక్కడ గెలుస్తున్నామని చెప్పుకుంటున్న నేతలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారే తప్ప.. ఏం అభివృద్ధి చేశారంటే నోరు మెదపరు. భారాస హయాంలో తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు ఇక్కడి ప్రజలకు అందాయి. అలా 5.6 లక్షల మంది ఓటర్లు మా వెంటే ఉన్నారు.’’ అని హైదరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి, ఇతర అంశాలపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.

ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది.. గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి?

గత పదేళ్ల భారాస పాలనలో అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలోనే 5.6 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వారి పాలన ఎలా ఉంటుందో ప్రజలు గమనించారు. రెండింటినీ బేరీజు వేసుకొని కేసీఆర్‌ ప్రభుత్వమే మేలు అనే నిర్ణయానికి వచ్చారు.

మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు?

మా ప్రధాన ప్రత్యర్థి ఎంఐఎం. ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ బహిరంగంగా ప్రకటించింది. భాజపా సైతం పరోక్షంగా సహకరిస్తోంది. దేశవ్యాప్తంగా భాజపాకు ‘బీ’ టీమ్‌గా ఎంఐఎం పనిచేసింది. అందుకు ప్రతిగా భాజపా తమ అభ్యర్థిగా మాధవీలతను నిలబెట్టి ఓట్ల పోలరైజేషన్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. మసీదులకు విల్లు ఎక్కుపెట్టినట్టు రెచ్చగొడుతూ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుండటంతో పరోక్షంగా ఎవరికి లాభం చేకూరుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా కాంగ్రెస్‌, భాజపా రెండూ ఎంఐఎంకు మద్దతుగా ఉన్నాయి. భారాస, ఎంఐఎంకు మధ్య మాత్రమే పోటీ ఉంది.

మీరు గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు?

ఎంఐఎం ఏలుబడిలో సరైన రోడ్లు లేవు. మౌలిక సదుపాయాలేవీ కల్పించలేదు. పార్కింగ్‌ కోసం నిత్యం నరకమే. అప్పుడు ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లుంది అంటూ గుండె మీద చేయి వేసుకొని మరీ ఓట్లు అడగగలుగుతున్నాను. అసదుద్దీన్‌ చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగిన దాఖలాలున్నాయా? ఓటర్లకు ఇదే చెబుతున్నాం. ఎంపీగా గెలిచిన తర్వాత విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తా.

ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు ఏంటి?

బడుగు, బలహీనవర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలోనే. బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. హైదరాబాద్‌ ప్రజలకు నేను కొత్త కాదు. పైగా 5.6లక్షల మంది లబ్ధిదారులు మా వెంట ఉన్నారు. కొన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నాను. భాగ్యనగర్‌ ఉత్సవ సమితి తరఫున చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. మైనారిటీల్లో సింహభాగం ఎంఐఎం వైపు ఉన్నా భారాస పాలనలో 20 శాతం ఓటు బ్యాంకును పెంచుకోగలిగాము. కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు మా వైపు మళ్లారు. ఈ లెక్క ప్రకారం 50 వేల నుంచి లక్ష మెజారిటీతో విజయం సాధిస్తాననే నమ్మకముంది. భాజపా అభ్యర్థి మాధవీలతకు బీఫాం ఇచ్చాక పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఆమె ఎన్నికల కోసం నటించడానికి వచ్చిన ఓ యాక్టర్‌ మాత్రమే. ఎన్నికలు అయ్యాక వెళ్లిపోతారు. అభివృద్ధిపై అసదుద్దీన్‌ను ప్రశ్నించడం మానేసి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ భారాసకు పడే ఓట్లకు గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

  • ఆశపడి మోసపోయామని పాదయాత్రలకు వెళ్లినప్పుడు ప్రజలు నాతో అంటున్నారు. రూ.4 వేలు, తులం బంగారం, స్కూటీలు, నెలకు రూ.2,500 రాలేదని వాపోతున్నారు.
  • ఇక్కడ నిధుల కొరత లేదు. నాయకత్వ లోపమే ఉంది. వారికి కావాల్సింది మతతత్వమే. మేము మానవత్వం కావాలి అంటున్నాం.
  • పాతబస్తీలో 40 ఏళ్లుగా ఎంఐఎం గెలుస్తున్నా అభివృద్ధి చేయలేదు. ప్రజల్లో జీవితాల్లో మార్పు రాలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని