logo

కమలానికి అండగా.. ప్రచారంలో భిన్నంగా

రాజధాని పరిధిలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా భాజపా ప్రణాళికను అమలు చేస్తోంది. ముఖ్యంగా సంఘ్‌ పరివార్‌ ఇందులో కీలక భూమిక పోషిస్తోంది. ఈ పరివారంలోని సభ్యులు వినూత్న ప్రచారం చేస్తున్నారు.

Published : 10 May 2024 04:02 IST

భాజపాకు మద్దతుగా ఇంటింటికి సంఘ్‌ పరివార్‌ సభ్యులు
ఒక్కో సంఘానికి ఒక్కో ప్రాంతం బాధ్యత
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిది

రాజధాని పరిధిలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా భాజపా ప్రణాళికను అమలు చేస్తోంది. ముఖ్యంగా సంఘ్‌ పరివార్‌ ఇందులో కీలక భూమిక పోషిస్తోంది. ఈ పరివారంలోని సభ్యులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. పరివార్‌ ప్రతినిధులు నగరంలోని ప్రతి ఇంటికి వచ్చి భాజపా అభ్యర్థికి ఓటేయమని అడగకుండా.. ముందుగా ఓటు హక్కు ప్రాధాన్యం వివరించి చివరిగా దేశం కోసం పోరాడుతున్న భాజపా అభ్యర్థులకు ఓటేయాలని చెబుతున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు.. దాదాపు 15 వేల మందికి పైగా సభ్యులు ప్రచారంలో మమేకమవుతున్నారు.


30 సంఘాలు.. 40 విభాగాలు

కాంగ్రెస్‌, భారాస పార్టీలు ఇంటింటి ప్రచారం కంటే ర్యాలీలు, కార్నర్‌ మీటింగ్‌లు, బహిరంగ   సభలతోనే ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ తరహా ప్రచారాన్ని భాజపా కొనసాగిస్తూనే సంఘ్‌ పరివార్‌ను కూడా రంగంలో దింపింది. విశ్వహిందూ పరిషత్‌ ఆధీనంలోని దాదాపు 30 సంఘాలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలోని 40 విభాగాలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నాయి. వీరేకాకుండా బజరంగ్‌దళ్‌, ఏబీవీపీ, సరస్వతీ విద్యాపీఠం, వనవాసీ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌, భారతీయ కిసాన్‌సంఘ్‌ ఇలా దాదాపు అనేక భాజపా అనుబంధ సంఘాలకు చెందిన దాదాపు వేలమంది ప్రతినిధులు చేవెళ్ల, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాలపై దృష్టిసారించారు.


ప్రాధాన్యం వివరించి.. ఓటు అభ్యర్థించి..

సాధారణంగా ఇతర పార్టీల కార్యకర్తలు ముప్పై నలభై మంది ఒక్కసారిగా కాలనీలకు వచ్చి ప్రచారం పేరుతో హంగామా చేస్తుంటారు. భాజపా అనుబంధ సంఘాల ప్రచారం భిన్నంగా జరుగుతోంది. సంఘ్‌ పరివార్‌లోని సంస్థలకు కొన్ని కాలనీల బాధ్యత అప్పగించారు. ఈ కాలనీల్లోని ఇళ్లకు మాత్రమే వారు వెళ్తారు. ఉదాహరణకు దిల్‌సుఖ్‌నగర్‌ బాధ్యతను వీహెచ్‌పీకి అప్పగిస్తే వారే ఇంటింటికి ప్రచారం చేస్తారు. ఓ సభ్యుడు ముందు రోజు వచ్చి సంబంధిత అపార్టుమెంట్‌ ఓనర్ల సంఘం ప్రతినిధులను కలిసి ప్రచారం కోసం అనుమతి తీసుకుంటున్నారు. వారు అనుమతిచ్చిన తర్వాత ఒక్కరు మాత్రమే వచ్చి సంబంధిత అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ను వెంటబెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడుతున్నారు. భాజపా జెండాలు గానీ ఇతరత్రా ధరించకుండా సాదాసీదాగానే వస్తున్నారు. ఓటర్లకు ముందుగా ఓటుహక్కు చైతన్యం గురించి కొద్ది సేపు వివరించి చైతన్యం తెస్తున్నారు. ఆఖరిలో దేశం ఐక్యత కోసం ప్రధాన నరేంద్రమోదీ నాయకత్వంలో పోరాటం జరుగుతోందని అందువల్ల భాజపా అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. నెల రోజులుగా నగరంలోని అనేక కాలనీల్లో ఇళ్లను పరివార్‌ సభ్యులు చుట్టి వచ్చారు. అంతేగాక పోలింగ్‌ రోజు సంబంధిత అపార్టుమెంట్‌ ఓటర్లను పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకువచ్చే బాధ్యత కూడా వారికే అప్పగించినట్లు వీహెచ్‌పీ ప్రతినిధి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఈసారి హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం మీద ప్రధానంగా దృష్టిసారించారు. సంఘ్‌ పరివార్‌ సభ్యుల కృషి మీద పోటీలో ఉన్న భాజపా అభ్యర్థులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని