logo

చుక్‌ చుక్‌ బండి.. అంతటా ఆగదండి!

కరీంనగర్‌ నుంచి పెద్దపల్లి మీదుగా మంచిర్యాలకు రహదారి మార్గంలో వెళ్తే సుమారు 84 కిలోమీటర్ల దూరానికి రెండు గంటలకు పైగా ప్రయాణించాలి. అదే రైలులో పెద్దపల్లి నుంచి మంచిర్యాలకు అర గంటలోపే చేరుకోవచ్చు. దీంతో చాలా మంది కరీంనగర్‌

Published : 01 Aug 2022 04:57 IST

ప్యాసింజర్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌గా మారిన అజ్ని రైలు
నేడు పునఃప్రారంభం.. కాజీపేట నుంచి బల్లార్షా వరకే సేవలు
ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ (పాతచిత్రం)

రీంనగర్‌ నుంచి పెద్దపల్లి మీదుగా మంచిర్యాలకు రహదారి మార్గంలో వెళ్తే సుమారు 84 కిలోమీటర్ల దూరానికి రెండు గంటలకు పైగా ప్రయాణించాలి. అదే రైలులో పెద్దపల్లి నుంచి మంచిర్యాలకు అర గంటలోపే చేరుకోవచ్చు. దీంతో చాలా మంది కరీంనగర్‌ నుంచి పెద్దపల్లి వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి అందుబాటులో ఉండే ఎక్స్‌ప్రెస్‌ గాని, ప్యాసింజర్‌ రైలు గాని ఎక్కితే మొత్తమ్మీద గంటన్నరలోనే మంచిర్యాల చేరుకోవచ్చు. అయితే ఇదంతా గతం.. దాదాపు రెండున్నరేళ్ల కిందట కరోనా వచ్చిన తర్వాత రైళ్ల వేళలన్నీ మారాయి. హాల్టింగ్‌, పాత మార్గాలను రద్దు చేయడంతో రైలు ప్రయాణం ప్రహసనంగా మారింది.

50 ఏళ్లుగా నడిచిన నాగ్‌పూర్‌(అజ్ని) ప్యాసింజర్‌ రైలును రెండేళ్ల కిందట కొవిడ్‌ ప్రభావంతో అధికారులు రద్దు చేశారు. తాజాగా ఆగస్టు 1 నుంచి ఈ రైలును నడిపించాలని నిర్ణయించారు. అయితే కాజీపేట నుంచి బల్లార్షా వరకు మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ రైలుగా నడిపించనున్నారు. ప్రతి రోజూ రాత్రి 10.50కి కాజీపేట జంక్షన్‌లో బయల్దేరి పెద్దపల్లికి 11.41, రామగుండానికి 11.54 వరకు చేరుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారుజామున బల్లార్షా జంక్షన్‌కు 3.10కి చేరుతుంది. తిరిగి ఇదే ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 3.50కి బల్లార్షా నుంచి రామగుండానికి ఉదయం 5.47కి, పెద్దపల్లికి 6.15కు వచ్చి, కాజీపేటకు ఉదయం 8.50కి చేరుకుంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా గతంలో కాజీపేట నుంచి నాగ్‌పూర్‌(అజ్ని) వరకు నడిపిన ఈ ప్యాసింజర్‌ను ఎక్స్‌ప్రెస్‌గా మార్చడంతో పాటు బల్లార్షా వరకు మాత్రమే నడిపించాలని నిర్ణయించారు. అంతే కాకుండా పదుల సంఖ్యలోని స్టేషన్‌లలో హాల్టింగ్‌లను ఎత్తివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బస్సు ప్రయాణం.. భారమే!
నిత్యం కరీంనగర్‌, నిజామాబాద్‌ల నుంచి మంచిర్యాల, బల్లార్షాలకు వెళ్లే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు సాధారణంగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఈ మార్గంలో బస్సులో వెళ్లాలంటే గంటల తరబడి ప్రయాణానికి ఒళ్లు హూనం కావాల్సిందే. అస్తవ్యస్తంగా రహదారులు, ట్రాఫిక్‌ రద్దీతో రోజులో సగం సమయం ప్రయాణానికే కేటాయించాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో పెరిగిన బస్సు ఛార్జీలతో ఆర్థిక భారం కూడా మామూలుగా లేదు. అదే రైలు ప్రయాణమైతే ఎక్కువలో ఎక్కువగా జనరల్‌ టికెట్‌కు రూ.150 లోపే ఉంటుంది. బస్సులో వెళ్తే గమ్య స్థానాలను బట్టి రూ.200కు పైగా వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా బస్సులు సమయపాలన పాటించడం లేదు. నిత్యం గోదావరిఖని, మంథని, పెద్దపల్లి, కరీంనగర్‌ల నుంచి మంచిర్యాలకు వెళ్లే బస్సులు కిటకిటలాడుతూ ఉంటాయి.

ఇక మంచిర్యాల జిల్లా పరిధిలో మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లలో మాత్రమే రైలును నిలపనున్నారు. దీంతో సింగరేణి, ఇతర సంస్థల ఉద్యోగులు, ఇతరులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గతంలో రవీంద్రఖని(రామకృష్ణాపూర్‌), మందమర్రి పట్టణాల్లో హాల్టింగ్‌ ఉండగా, తాజాగా దాన్ని ఎత్తివేశారు.

14 స్టేషన్లకు తగ్గిన హాల్టింగ్‌

కరీంనగర్‌ జిల్లా పరిధిలో జమ్మికుంట, పెద్దపల్లి జిల్లా పరిధిలో పొత్కపల్లి, పెద్దపల్లి జంక్షన్‌, రామగుండం రైల్వే స్టేషన్లలో మాత్రమే హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు.

అజ్ని ప్యాసింజర్‌గా కొనసాగిన కాలంలో సింగరేణీయులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు కాజీపేట నుంచి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా మహారాష్ట్ర వరకు ఇందులోనే ప్రయాణించేవారు.

గతంలో 60 స్టేషన్లలో హాల్టింగ్‌ సౌకర్యం ఉన్న ఈ రైలును ఎక్స్‌ప్రెస్‌గా మార్చడంతో పాటు కేవలం 14 స్టేషన్లలోనే నిలుపుదలకు నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని