logo

జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు

సీసీ కెమేరాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలపై గ్రామాల్లోని ప్రజలకు కేశవపట్నం పోలీసులు అవగాహన కల్పిస్తూ వారి సహకారంతో ముందుకు సాగుతున్నారు. కెమెరాల ప్రాధాన్యం వివరిస్తూ ప్రజల భాగస్వామ్యంతో  వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

Published : 08 Aug 2022 05:34 IST

త్వరలో ప్రారంభం


జాతీయ రహదారిపై మొలంగూర్‌ అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు

శంకరపట్నం,న్యూస్‌టుడే: సీసీ కెమేరాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలపై గ్రామాల్లోని ప్రజలకు కేశవపట్నం పోలీసులు అవగాహన కల్పిస్తూ వారి సహకారంతో ముందుకు సాగుతున్నారు. కెమెరాల ప్రాధాన్యం వివరిస్తూ ప్రజల భాగస్వామ్యంతో  వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ ఆదేశాల మేర కేశవపట్నం ఎస్సై దేశ్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో  ముందుకు కదిలారు. మండలానికి ప్రవేశం మొదలు ముగింపు వరకు జాతీయ రహదారిపై కెమెరాలు అమర్చారు. రహదారి అనుకొని ఉన్న తాడికల్‌, వంకాయగూడెం, కేశవపట్నం, మొలంగూర్‌ అడ్డరోడ్డు, గొల్లపల్లి, కొత్తగట్టు వరకు ఏర్పాటు చేశారు. అలాగే రహదారిపై ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలు, మండల కేంద్రంలోని బ్యాంకులు, ఏటీఎంల వద్ద, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే దారిలలో కెమెరాలను బిగించారు.  4ఎంపీ 50ఎంటీల సామర్థ్యం గల 83 సీసీ కెమెరాలు ఏర్పాటుతో పోలీస్‌ స్టేషన్‌లో వాటి దృశ్యాలు నిక్షిప్తం అయ్యేలా ఎన్‌.వీ.ఆర్‌(నెట్‌ వీడియో రికార్డింగ్‌) ఏర్పాటు చేశారు. రహదారిపై రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా సంఘటనలు చోటు చేసుకొంటే త్వరితగతిన పుటేజీల పరిశీలనతో చేధించడానికి సిద్ధం చేశారు. దీంతో జాతీయ రహదారి అంతా అణువణువు నిఘా నేత్రాల వలయంలో ఉంది. కేశవపట్నం పోలీసులు గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల భాగస్వామ్యంతో నెలకొల్పిన సీసీ కెమెరాలు త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీపీ వి.సత్యనారాయణ చేతుల మీదుగా వాటిని  ప్రారంభించనున్నారు.గ్రామాలలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని ఎస్‌ఐ చంద్రశేకర్‌ తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానంగా పని చేస్తోందన్నారు.

కేశవపట్నం పోలీస్‌ స్టేషన్‌లో నిక్షిప్తమవుతున్న  దృశ్యాలు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని