logo

నాలుగేళ్ల నిరీక్షణకు తెర

రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతంపైగా మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమలున్నవి ఉమ్మడి జిల్లాలోనే. అందులోనూ సిరిసిల్ల వస్త్రోత్పత్తులకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. సిరిసిల్ల నేత కుటుంబానికి చెందిన గూడూరి ప్రవీణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం

Published : 14 Sep 2022 06:25 IST

టీపీటీడీసీఎల్‌ ఛైర్మన్‌గా ప్రవీణ్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతంపైగా మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమలున్నవి ఉమ్మడి జిల్లాలోనే. అందులోనూ సిరిసిల్ల వస్త్రోత్పత్తులకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. సిరిసిల్ల నేత కుటుంబానికి చెందిన గూడూరి ప్రవీణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. వ్యవసాయం తర్వాత కీలకమైంది వస్త్రోత్పత్తి రంగం. ప్రభుత్వ ఆర్డర్లు, మరమగ్గాల ఆధునికీకరణ, నేతన్న బీమా వంటి సంక్షేమ పథకాల అమలులో కార్పొరేషన్‌ పదవి కీలకం. 2018లోనే చేనేత, మరమగ్గాలను రెండు వేర్వేరు కార్పొరేషన్లగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్లుగా అప్పుడు, ఇప్పుడంటూ ఊరించింది. ఎట్టకేలకు తెలంగాణ పవర్‌లూం, టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీపీటీడీసీఎల్‌) ఛైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఉమ్మడి జిల్లా నేతన్నలకు మంచి అవకాశం.

అభివృద్ధికి అవకాశం

రాష్ట్ర వ్యాప్తంగా 68 వేల మరమగ్గాలుంటే వాటిలో సగం సిరిసిల్లలోనే ఉన్నాయి. వస్త్రోత్పత్తి అంటే చేనేత అనే ముద్ర పడిపోయింది. కానీ జిల్లాలో ఎక్కువగా మరమగ్గాలపై వస్త్రోత్పత్తి జరుగుతోంది. ఈ వ్యత్యాసాన్ని గమనించి ప్రభుత్వం వేర్వేరుగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. దీనికి ప్రభుత్వం కొంత నిధిని అందజేస్తుంది. వీటి ద్వారా ఆయా రంగాల అభివృద్ధి, సంక్షేమానికి వెచ్చించే వెసులుబాటు ఉంటుంది. మరమగ్గాలపై ప్రభుత్వ ఆర్డర్లు ఉత్పత్తి చేసేందుకు ప్రత్యేకంగా నూలు బ్యాంకు ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. పరిశ్రమలో వస్త్రోత్పత్తుల నాణ్యత, కార్మికులకు బీమా వంటి సంక్షేమ పథకాలను వివరించేందుకు ప్రత్యేకంగా ఉద్యోగుల నియామకం జరుగుతుంది. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటవుతుంది. వస్త్రోత్పత్తుల నిల్వలకు ప్రత్యేక గోదాం, రాష్ట్ర బడ్జెట్‌లో కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులుంటాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆప్కోను ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు టెస్కోను ఏర్పాటు చేశారు. దీనిలో ఆస్తులు, అప్పుల లెక్కలు, సిబ్బంది విభజన అసంపూర్తిగా మిగిలింది. ఈ ప్రక్రియ పూర్తయితే టెస్కోను రద్దు చేసే అవకాశం ఉంది.

వ్యక్తిగతం
పేరు: గూడూరి ప్రవీణ్‌, తండ్రి రాజయ్య
కుటుంబం: భార్య మంజుల మాజీ కౌన్సిలర్‌. కొడుకు మానస్‌ ఎం.ఎస్‌, కూతురు ప్రత్యూష ఎంటెక్‌ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు.
విద్యాభాస్యం: ఎంఏ, ఎంఫిల్‌ (రాజనీతిశాస్త్రం)
పదవులు: అర్బన్‌ సహకార బ్యాంకు ఛైర్మన్‌, సెస్‌ ఛైర్మన్‌, అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా సేవలందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని