logo

మంత్రులు ముగ్గురు.. మాజీలు ముగ్గురు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వివిధ పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు బరిలో ఉండటంతో   ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, గత ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన నాటి అమాత్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Updated : 17 Nov 2023 05:39 IST

ఎన్నికల బరిలో అమాత్యులు
నియోజకవర్గాల్లో ఆసక్తికర పోటీ

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వివిధ పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు బరిలో ఉండటంతో   ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, గత ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన నాటి అమాత్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మంత్రులు, మాజీ మంత్రులు బరిలో ఉండటంతో వాటిపైనే అందరి దృష్టీ పడింది.

న్యూస్‌టుడే, గోదావరిఖని

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు మంత్రి కేటీఆర్‌ పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2009, 2010(ఉప ఎన్నిక), 2014, 2108 ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న కేటీఆర్‌ ప్రస్తుతం పురపాలక, ఐటీ, కమ్యూనికేషన్‌ శాఖలకు మంత్రిగా ఉన్నారు.
  • కరీంనగర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న భారాస అభ్యర్థి గంగుల కమలాకర్‌ ఇది వరకే మూడు సార్లు విజయం సాధించారు. తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆయన బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రిగా సేవలందిస్తున్నారు. 2009లో తెదేపా నుంచి పోటీ చేసి గెలుపొందిన గంగుల 2014, 2018 ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసి వరుసగా విజయం సాధించారు.
  • ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ ఇప్పటికే ఆరుసార్లు విజయం సాధించారు. తొలిసారి మేడారం నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఆయన 2008(ఉప ఎన్నిక), 2009 సాధారణ ఎన్నికలు, 2010(ఉప ఎన్నిక)లో గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు.

మాజీలు

  • మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దుద్దిల్ల శ్రీధర్‌బాబు గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. తొలిసారిగా 1999 ఎన్నికల్లో మంథని నుంచి విజయం సాధించిన ఆయన 2004, 2009, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. వైఎస్‌ హయాంలో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన శ్రీధర్‌బాబు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు.
  • రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న సీనియర్‌ నాయకులు టి.జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 1983లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జీవన్‌రెడ్డి వైఎస్‌ ప్రభుత్వంలో రహదారులు భవనాల శాఖ మంత్రిగా సేవలందించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించారు. 1996 ఉప ఎన్నిక, 1989, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. పంచాయతీరాజ్‌, ఆబ్కారీ, రహదారులు భవనాల శాఖ మంత్రిగా జీవన్‌రెడ్డి గతంలో పనిచేశారు.
  • తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2004 నుంచి వరుసగా విజయాలు నమోదు చేసుకుంటూ వస్తున్న ఈటల రాజేందర్‌ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంలో సేవలందించారు. 2004లో కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి, 2008(ఉప ఎన్నిక)లో విజయం సాధించారు. ఆ తర్వాత హుజూరాబాద్‌ నుంచి 2009, 2010(ఉప ఎన్నిక) 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. భారాసను వీడిన అనంతరం 2021లో జరిగిన ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా మరోసారి విజయం సాధించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని