logo

నత్తనడకన నిర్మాణాలు

వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్‌సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు

Published : 28 Mar 2024 05:37 IST

అద్దె భవనాల్లో పల్లెదవాఖానాలు

మోహన్‌రావుపేటలో పల్లెదవాఖానా భవన నిర్మాణం

న్యూస్‌టుడే, కోరుట్లగ్రామీణం: వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్‌సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు. పల్లెదవాఖానాల భవనాలకు నిధులు మంజూరు చేశారు. నిర్మాణ పనులను వైద్యఆరోగ్యశాఖకు అప్పగించగా ముందుకు సాగకపోవడంతో తర్వాత పంచాయతీరాజ్‌కు అప్పగించారు. అయినప్పటికీ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

 జిల్లాలో 119 పల్లె దవాఖానాలు మంజూరు కాగా ఇప్పటివరకు ఆరు భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. కోరుట్ల మండలంలో ఆరు, కోరుట్ల పట్టణంలో మూడు చోట్ల భవన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. మండలంలోని మోహన్‌రావుపేట, జోగన్‌పల్లి గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. అయిలాపూర్‌ గ్రామంలో రెండు, చిన్నమెట్‌పల్లి, యూసుఫ్‌నగర్‌ గ్రామాల్లో పనులు ప్రారంభించలేదు. కోరుట్లలో రెండు చోట్ల నిర్మాణ దశలో ఉండగా, మరో చోట పనులు ప్రారంభం కాలేదు. భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో పల్లెదవాఖానాలు అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. అద్దె భవనాలు ఇరుకుగా ఉండటంతో పాటు మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అనువుగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఉన్నతాధికారులకు తెలిపాం..

జిల్లా వ్యాప్తంగా ఆరు పల్లెదవాఖనా భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని నిర్మాణ దశ పూర్తి కావస్తుండగా, మరి కొన్ని పనులు ప్రారంభించి వదిలేశారు. కొన్ని చోట్ల పనులు ప్రారంభించలేదు. భవన నిర్మాణాల పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు నివేదించాం.

- శ్రీధర్‌, జిల్లా వైద్యాధికారి


రూ.20 లక్షలతో..

దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీ వైద్యులు, స్టాఫ్‌ నర్సులు అందుబాటులో ఉండి వైద్య సేవలందిస్తారు. అన్ని వసతులతో అత్యాధునికంగా పల్లె దవాఖానాల భవనాలు నిర్మించేలా రూపొందించారు. రాష్ట్రమంతటా ఒకే నమూనాతో భవనాలు నిర్మిస్తున్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు వెచ్చిస్తున్నారు. ఒక హాల్‌, రెండు గదులు, మరుగుదొడ్లు, స్టోర్‌రూమ్‌ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. రెవెన్యూశాఖ స్థలాలను అప్పగించగా టెండర్లు సైతం పూర్తయ్యాయి. ప్రభుత్వం మారడంతో బిల్లులు వస్తాయో లేవో అని గుత్తేదారులు పనులు చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.

కోరుట్ల మండలం కల్లూర్‌గ్రామానికి పల్లెదవాఖానా మంజూరు కాకపోవడంతో ప్రభుత్వ వైద్యసేవలు కరవయ్యాయి. అయిలాపూర్‌ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండగా గ్రామానికి రెండు ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలు మంజూరయ్యాయి. కల్లూర్‌, సర్పారాజ్‌పూర్‌, తిమ్మయ్యపల్లె గ్రామాలకు సబ్‌ సెంటర్లు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని