logo

లక్ష్యానికి చేరువగా సింగరేణి

సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది.

Published : 29 Mar 2024 04:54 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని

సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. మరో మూడు రోజుల్లో వార్షిక సంవత్సరం ముగియనుండటంతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. బుధవారం నాటికి 69.09 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా మూడు రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవడానికి పూర్తిస్థాయిలో అవకాశం ఉంది. గత ఏడాది కూడా 70 మిలియన్‌ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది. కాగా 67.13 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధించింది. అంతకు ముందు సంవత్సరం కూడా వార్షిక లక్ష్యాన్ని చేరుకోలేదు.

ఏడు డివిజన్ల సహకారం

సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి ఏడు డివిజన్లు పూర్తి సహకారాన్ని అందించాయి. నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేపడుతూ వస్తున్న డివిజన్లు వంద శాతానికి మించి ఉత్పత్తి సాధించాయి. మిగతా నాలుగు డివిజన్లు తక్కువగా బొగ్గు ఉత్పత్తి సాధించినా వార్షిక లక్ష్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి, రామగుండం-1, 2, 3 డివిజన్లు ఆయా ఏరియాల్లో నిర్దేశించుకున్న వార్షిక లక్షాన్ని అధిగమించాయి. మందమర్రి, శ్రీరాంపూర్‌, అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు, భూపాలపల్లి డివిజన్లు తక్కువ శాతం ఉత్పత్తి సాధించాయి. మిగతా ఏడు డివిజన్లు నిర్దేశించిన లక్ష్యానికంటే ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయడంతో వార్షిక లక్ష్యం చేరుకోవడం సులువుగా మారింది. వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధించడంతో సింగరేణి సంస్థ భారీ లాభాలపై ఆశలు పెంచుకుంది. గత ఏడాది రూ.2,222 కోట్ల లాభాలను ఆర్జించగా ఈ ఏడాది అంతకంటే ఎక్కువగానే లాభాలు పొందే అవకాశం ఉంది. గత ఏడాది కంటే బొగ్గు ఉత్పత్తితో పాటు రవాణా ఎక్కువగానే చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని