logo

భార్య చేతిలో భర్త హతం

భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు.

Updated : 29 Mar 2024 06:06 IST

కళ్లలో కారం కొట్టి.. ఒంటిపై వేడి నీళ్లు పోసి రోకలితో దాడి

కరీంనగర్‌ నేరవార్తలు,న్యూస్‌టుడే: భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. కరీంనగర్‌ మూడో ఠాణా సీఐ జాన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ సుభాష్‌నగర్‌కు చెందిన తోట హేమంత్‌ (40), రోహితికి 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. హేమంత్‌ పెట్రోల్‌ బంక్‌లో పని చేసి మానేశాడు. అనంతరం మద్యానికి బానిసయ్యాడు. రొహితి ప్రస్తుతం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగం చేస్తోంది. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం సైతం దంపతుల మధ్య గొడవలు జరిగాయి. బుధవారం ప్రణాళిక ప్రకారం పిల్లలను బంధువుల ఇంటికి పంపించింది. రాత్రి రోహితి తనతోపాటు పని చేసే నవీన్‌, సాయికిరణ్‌లను ఇంటికి పిలిపించుకొని హేమంత్‌ కళ్లలో కారం కొట్టి... తాళ్లతో కట్టేసి.. వేధించొద్దని బెదిరించారు. అనంతరం ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం రోహితి ఇంట్లో వేడి నీళ్లు మరిగించి భర్తపై పోసి హింసించింది. రోకలి బండతో తలపై, సున్నిత భాగాలపై కొట్టింది. అర్ధరాత్రి భర్త తీవ్రంగా గాయపడటంతో హత్య నేరం తనపైకి వస్తుందని భావించి వెంటనే అంబులెన్స్‌లో వైద్యం కోసం హేమంత్‌ను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను ఆశ్రయించారు. నగర ఏసీపీ నరేందర్‌, మూడో ఠాణా సీఐ జాన్‌రెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. గురువారం నిందితులు రోహితి, నవీన్‌, సాయికిరణ్‌లపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

బతిమిలాడినా..

కొడుకు, కోడలు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని తల్లి విమల తెలిపింది. తన కోడలు ఇద్దరిని ఇంట్లోకి రప్పించుకొని తాళ్లతో కట్టేసి బంధించారని ఆరోపించింది. తన కొడుకును ఏమి చేయొద్దని బతిమిలాడినా వినలేదని తెలిపింది. బుధవారం ఉదయం నుంచి ఇద్దరు వ్యక్తులు తన కుమారునికి ఫోన్‌ చేసి మద్యం తాగడానికి రావాలని పిలిచినా బయటకు వెళ్లలేదని, బంధువులు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు చెప్పింది. హేమంత్‌ బయటకు రాకపోవడంతో ఇంట్లోనే హత్య చేసేందుకు తన కోడలు పథకం వేసినట్లు చెప్పింది.


విద్యుత్తు స్తంభంపై నుంచి పడి జేఎల్‌ఎంకు తీవ్ర గాయాలు

మానకొండూర్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు స్తంభం మరమ్మతులు చేస్తూ షాక్‌ తగిలి కిందపడిపోయిన జూనియర్‌ లైన్‌మెన్‌కు తీవ్రగాయాలైనా ఘటన మానకొండూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు గురువారం మానకొండూర్‌లోని విద్యుత్‌ ఉపకేంద్రంలో సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో అన్నారం జేఎల్‌ఎం బాలకృష్ణ వచ్చి సమీపంలోని స్తంభం ఎక్కి మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో విద్యుదాఘాతంతో కిందపడి తీవ్రగాయాల పాలయ్యాడు. కింద ఎవరు లేకపోవడంతో ఆయనే సిబ్బందికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. వారు వచ్చి 108లో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన బాలకృష్ణ అయిదేళ్ల క్రితం అన్నారానికి బదిలీపై వచ్చారు.


గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

రాయికల్‌, న్యూస్‌టుడే: గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు, ఓమైనరు బాలుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ రాయికల్‌ ఠాణాలో వివరాలు వెల్లడించారు. రాయికల్‌ మండలం కుమ్మరిపల్లి శివారులో గురువారం పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. జగిత్యాల పట్టణంలోని ఆర్‌.ఎన్‌.టి.నగర్‌కు చెందిన కొండూరి రాజేష్‌, బీట్‌ బజారుకు చెందిన ఆర్మూల్ల సాయికుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ మైనరు బాలుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా తనిఖీ చేయగా 1.5 కిలోల గంజాయి దొరికిందని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మైనర్‌ బాలుడు ఏపీ నుంచి ఈనెల 25న గంజాయి తీసుకొచ్చి జగిత్యాలలో పాతమిత్రులను కలిశాడని, గురువారం రాయికల్‌లో గంజాయి విక్రయిద్దామని వస్తుండగా పట్టుకున్నట్లు వివరించారు. గతంలో అరెస్టయిన యువకులకు వీరికి సంబంధం ఉందని లోతుగా విచారణ చేస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. ద్విచక్రవాహనం, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జగిత్యాల గ్రామీణ సీఐ ఆరిఫ్‌ ఆలీఖాన్‌, రాయికల్‌ ఎస్‌ఐ అజయ్‌, సిబ్బంది తదితరులున్నారు. కాగా తమ కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని ఆర్మూల్ల సాయికుమార్‌ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చేసిన తప్పులకు కేసులు నమోదయ్యాయని ఆరుమాసాలుగా సాయికుమార్‌ ఇంటివద్దే ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.


పాత కక్షలతోనే మహిళ హత్య

ధర్మపురి, న్యూస్‌టుడే: భూ వివాదాలు, పాత కక్షల నేపథ్యంలోనే కమలాపూర్‌లో మహిళ హత్య జరిగిందని, ఈ కేసులో నిందితుడిని గురువారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు. ధర్మపురి సర్కిల్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కమలాపూర్‌ గ్రామంలో పక్కపక్కనే ఉంటున్న పులి పద్మ, పులి గంగయ్య కుటుంబానికి ఏడెనిమిదేళ్లుగా భూ సరిహద్దు వివాదాలు, పాతకక్షల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 26న కమలాపూర్‌లో కాటమయ్య పండుగ జరుగగా గంగయ్య హాజరయ్యాడు. ఈ సమయంలోనే ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న గంగయ్య భార్య రేనా వంట గదిలో దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పండుగలో పాల్గొని ఇంటికి చేరుకున్న గంగయ్య భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన చూసి తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. తన భార్య ఆత్మహత్యకు కారణం పద్మ అని భావించి కల్లుగీసే ఉలిని తీసుకుని పద్మ ఇంటికి వెళ్లి ఆమెపై విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశాడు. మృతురాలి భర్త లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం నిందితుడు గంగయ్యను అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ సలీం, కానిస్టేబుల్‌ పరమేశ్వర్‌లు పాల్గొన్నారు.


ఆర్టీసీ బస్సులో ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మృతి

మెట్‌పల్లి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఆర్మీ విశ్రాంత ఉద్యోగి అస్వస్థతకు గురై మృతిచెందిన సంఘటన మెట్‌పల్లిలో గురువారం చోటుచేసుకుంది. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలానికి చెందిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి బోగం సామయ్య(70) నిజామాబాద్‌ జిల్లాలోని వినాయకనగర్‌లో స్థిరపడ్డారు. పనినిమిత్తం వీణవంక వెళ్లిన సామయ్య హుజురాబాద్‌ డిపో బస్సులో సోదరితో కలిసి నిజామాబాద్‌ బయల్దేరాడు. మెట్‌పల్లి శివారులోని పెట్రోల్‌బంక్‌ వద్ద అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకులాడు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారమివ్వగా 108 సిబ్బంది వచ్చి మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని