logo

ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!

విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు.

Published : 29 Mar 2024 05:23 IST

న్యూస్‌టుడే-మేడిపల్లి

  • రాజస్థాన్‌లోని సర్దార్‌గఢ్‌ గ్రామానికి చెందిన హకుందాస్‌ 1962లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల్లో తప్పాడు. స్నేహితులు ఎగతాళి చేశారు. పట్టు వదలని హుకుందాస్‌ పదో తరగతి పరీక్షలు రాస్తూనే ఉన్నాడు. 2019 నాటికి 55 సార్లు పదో తరగతి పరీక్షలు రాసి చివరకు ఉత్తీర్ణుడయ్యాడు. విశేషమేమిటంటే.. అప్పటికే అతను గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌లో నాలుగో తరగతి ఉద్యోగం చేశాడు. 2005లో ఉద్యోగ విరమణ చేసినా పట్టు వదలని విక్రమార్కుడిలా 2019లో ఉత్తీర్ణత సాధించాడు. ఉమ్మడి జిల్లాలోనూ పలువురు తమ వయసుతో నిమిత్తం లేకుండా పదో తరగతి పూర్తి చేసి స్ఫూర్తి నింపుతున్నారు.
  • కోట్లాది మంది అభిమానులను తన సినిమాలతో అలరిస్తున్న పవన్‌ కల్యాణ్‌ తాను ఇంటర్‌లో ఫెయిలైనట్లు వరంగల్‌ ఎన్‌ఐటీ వేడుకల్లో చెప్పారు. తోటి విద్యార్థులు కాపీ కొట్టారని, తాను నిజాయతీగా పరీక్షలు రాయడంతో ఫెయిల్‌ అయినట్లు ఆనాటి సంగతులను గుర్తుచేశారు. తాను పరీక్షల్లో తప్పినా నైతికంగా విజయం సాధించానని పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌లాగే చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు పదో తరగతి, ఇంటర్‌ తప్పినా తమ సామర్థ్యంపై నమ్మకంతో జీవితాల్లో గెలిచారు. ఉమ్మడి జిల్లాలోనూ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు చదువుతో నిమిత్తం లేకుండా విజయం వైపు అడుగులు వేశారు.

విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. చాలామంది విద్యార్థులు భవిష్యత్తుపై భరోసాతో ఉంటే.. కొందరు మాత్రం ఫలితాలపై బెంగతో ఉంటారు. ఒకవేళ పది ఉత్తీర్ణత సాధించలేక పోతే తనువు చాలించడమే శరణ్యమనుకుంటారు. ఇంకొందరు తాము ఇంటర్‌ మెట్లెక్కలేం అనే భావనతో ఉంటారు. మరికొందరు పదో తరగతి అనంతరం ఏం చదవాలో అవగాహన లేక అర్ధంతరంగా చదువు మానేస్తుంటారు. కానీ అవకాశాలు కోకొల్లలుగా ఉన్న ఈ రోజుల్లో పది మెట్లెక్కగానే హైరానా పడే బదులు ఆలోచనతో అడుగులు వేస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన వేలాది మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో పరీక్షల అనంతరం అవకాశాలు, జాగ్రత్తలు తదితరాలపై కథనం..

పరీక్ష తప్పితే ఇక అంతేనా!

జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన ఓ బాలుడు పదో తరగతి పరీక్ష తప్పానని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్‌ జిల్లాలోనూ బాలిక పరీక్ష ఉత్తీర్ణత సాధించలేదనే కారణంతో తనువు చాలించింది. మల్యాల మండలంలోనూ ఓ బాలుడు పదో తరగతి ఫలితాలు చూసి తాను ఉత్తీర్ణత సాధించలేదనే మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా పదుల సంఖ్యలో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి ఏం సాధించారు? తమ కుటుంబాలను పుట్టెడు దు:ఖంలో ముంచి తీరని విషాదాలకు కారణమయ్యారు. వాస్తవానికి పదో తరగతి, ఇంటర్‌లో పరీక్షలు తప్పినంత మాత్రాన జీవితంలో ఏమీ సాధించలేమనే భావన విడనాడాలి. పరీక్ష ఎలా గట్టెక్కాలో శ్రమించాలి. ఉన్నతవిద్య వైపు అడుగులు వేయాలి. స్వయం ఉపాధి మార్గం వెతుక్కోవాలి. తమకు చేతనైన పని చేసుకుంటే విజయం ఎలా వరిస్తుందో ప్రణాళిక వేసుకోవాలి.


పదితోనూ ఉద్యోగాలు

దో తరగతి విద్యార్హతతో పలు ఉద్యోగాలకు అర్హత పొందవచ్చు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, రైల్వే తదితరాల్లో ఉద్యోగాలు పొందే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య పూర్తి చేయలేమన్న భావన కలిగిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరై ఆయా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. తొలుత పదో తరగతి అర్హతతో కొలువు పొంది అనంతరం డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు, ఉన్నత విద్యతో మంచి స్థానంలో ఉండవచ్చు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు పదో తరగతి అర్హతతో ఆర్మీ వైపు అడుగులు వేశారు. మరికొందరు డిప్లొమా కోర్సులతో తమకు అనువైన ఉద్యోగం సాధించారు.


మార్కులే ప్రామాణికం కాదు

దో తరగతి, ఇంటర్‌లో వచ్చిన మార్కులే ప్రాతిపదికగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ అత్తెసరు మార్కులతో పాసైన యువకులెందరో ఉన్నత ఉద్యోగాలు సాధించారు. బీమారం మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు పదో తరగతిలో తక్కువ మార్కులు సాధించాడు. ఇంటర్‌ ప్రభుత్వ కళాశాలలో చేరి గ్రూప్స్‌కు సిద్ధమయ్యాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో రెండు ఉద్యోగాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. బీమారం మండలం దేశాయిపేటకు చెందిన ఓ నిరుపేద యువకుడు పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని, ఆంగ్లంపై తనకు పట్టులేదని కుంగిపోలేదు. పట్టుదలే పెట్టుబడిగా చదివాడు. ఆంగ్లంలో పీజీ పూర్తిచేసి ఇటీవల వెలువడిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 ఉద్యోగాలు సాధించి మార్కులే ప్రామాణికం కాదని నిరూపించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని