logo

ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు

కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది.

Published : 20 Apr 2024 04:53 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం: కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. మొత్తం ఏడింటిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు 3 జిల్లాల్లోకి వెళ్లాయి. రెండు సెగ్మెంట్లు రెండేసి జిల్లాల్లో ఉండగా, మిగతా రెండు ఒకే జిల్లా పరిధిలో ఉన్నాయి. గతంలో పార్టీలపరంగా ఒకే జిల్లా అధ్యక్షుడు ఉండేవారు. ప్రస్తుతం అయిదుగురు ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు వారందరినీ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.

హామీలు అమలయ్యేనా!: ఎన్నికల ప్రచారం ఎలా ఉన్నా హుస్నాబాద్‌, బెజ్జంకి మండలాలను కరీంనగర్‌ జిల్లా పరిధిలోకి తేవాలన్న అంశం శాసనసభ ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చింది. ఈ మేరకు శాసనసభ్యులు హామీ ఇచ్చారు. ఇది ఎంతవరకు అమలవుతుందో వేచి చూడాలి.

శాసనసభ నియోజకవర్గాల వారీగా ఇలా..

సిరిసిల్ల(1): నియోజకవర్గంలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్‌ మండలాలు రాజన్న సిరిసిల్ల జిల్ల్లాలోనే ఉన్నాయి.

వేములవాడ(2): కథలాపూర్‌, భీమారం, మేడిపల్లి మండలాలు జగిత్యాల జిల్లాలోకి వెళ్లగా, వేములవాడ, వేములవాడ రూరల్‌, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాలు రాజన్న సిరిసిల్లలో ఉన్నాయి.

చొప్పదండి(3): చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలు కరీంనగర్‌ జిల్లాలో ఉండగా మల్యాల, కొడిమ్యాల మండలాలు జగిత్యాల, బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉన్నాయి.

కరీంనగర్‌(1): కరీంనగర్‌ నగరంతో పాటు కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, కరీంనగర్‌ అర్బన్‌ మండలాలుండగా పూర్తి స్థాయిలో కరీంనగర్‌ జిల్లాలో ఉంది.

హుజూరాబాద్‌(2): కమలాపూర్‌ హన్మకొండ జిల్లాలో ఉండగా హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాలు కరీంనగర్‌ పరిధిలోకి వస్తాయి.

మానకొండూర్‌(3): మానకొండూర్‌, తిమ్మాపూర్‌, శంకరపట్నం, గన్నేరువరం మండలాలు కరీంనగర్‌ జిల్లాలో ఉండగా ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లాలో, బెజ్జంకి సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నాయి.

హుస్నాబాద్‌(3): హుస్నాబాద్‌, కోహెడ, అక్కన్నపేట మండలాలు సిద్దిపేట జిల్లాలో, సైదాపూర్‌, చిగురుమామిడి మండలాలు కరీంనగర్‌ జిల్లాలో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండ జిల్లాలో ఉన్నాయి.

నాడు జాబితాలో పేరుండటమే ఓటరు గుర్తింపు

న్యూస్‌టుడే, ధర్మారం: దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ మొదటి ఎన్నికల నిర్వహణకు అయిదేళ్లు ఆగాల్సి వచ్చింది. అప్పట్లో ఎవరికీ ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రాగా 1951లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 21 ఏళ్లు నిండిన, సంబంధిత నియోజకవర్గంలో ఆరు నెలలు(180 రోజులు)గా నివాసం ఉంటున్న వారికి ఓటరు జాబితాలో చోటు కల్పించారు. తాము భారతీయులమని చెప్పుకోవడానికి అప్పట్లో ఎవరి వద్దా గుర్తింపు పత్రాలు లేవు. దీంతో ఓటరు జాబితాలో పేరుంటే తాము భారతీయులమైనట్టేనని పోటీ పడి నమోదు చేసుకునేవారు. అప్పటి దేశ జనాభాలో కేవలం 49 శాతం మంది అంటే 17,32,12,343 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని