logo

వైకాపా అంతర్గత వైరం.. బహిరంగం

వైకాపా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బలనిరూపణ, సామాజికవర్గంలో పెత్తనం, గ్రామాలు, మండలాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విభేదాలు బహిర్గతమవుతున్నాయి.

Published : 18 Apr 2024 02:48 IST

వైకాపా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బలనిరూపణ, సామాజికవర్గంలో పెత్తనం, గ్రామాలు, మండలాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ప్రచారాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండటంతో వైకాపా అభ్యర్థులకు తలనొప్పిగా మారింది.

జడ్పీటీసీ సభ్యుడికి అవమానం

దేవనకొండ, న్యూస్‌టుడే: దేవనకొండలో బుధవారం వైకాపా ప్రచార కార్యక్రమంలో వర్గపోరు బయటపడింది. కర్నూలు వైకాపా ఎంపీ అభ్యర్థి వైవీ రామయ్య, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి ప్రచార రథంపైకి దేవనకొండ జడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ ఎక్కుతుండగా.. మరో వర్గం ఆయను అడ్డుకుంది. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తర్వాత రామకృష్ణ వర్గం కేకలు వేయడంతో ఆయనను పైకి ఎక్కించారు. అనంతరం ప్రసంగ కార్యక్రమంలో కూడా ఆయన పేరు పిలవలేదు. అభ్యర్థుల సమక్షంలోనే ఇంత జరుగుతున్నా.. వారు కనీసం వారించకపోవడం దారుణమని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


సామాజిక వర్గాల పెత్తనం..

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర మండలంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఆధిపత్యం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీదేవి ఈ నెల 19న నామినేషన్‌ వేయనున్నారు. జన సమీకరణ కోసం మండల స్థాయి నాయకులు అగ్రహారం గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓ వర్గం వారు బహిరంగంగానే ఓ నాయకుడిని నిలదీశారు. ఇళ్ల స్థలాలకు డబ్బులు వసూలు చేశారని, ఇతర పనులకు మీరే ముందుంటున్నారు.. ఇప్పుడు మా అవసరం వచ్చిందా? అని తీవ్ర స్థాయిలో గొడవ పడినట్లు సమాచారం.

మద్దికెరకు చెందిన ఓ చోటా నాయకుడు తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఎమ్మెల్యే తన సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇస్తూ.. బీసీలను అణగదొక్కుతున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బావ ప్రదీప్‌కుమార్‌రెడ్డి కుమారుడు శివారెడ్డి ఆ చోటా నాయకుడి వద్దకు రాయబారానికి వెళ్లినట్లు సమాచారం. తమకు ఎలాంటి ప్రాధాన్యం లేదని, పార్టీలో మాకు ఎలాంటి మేలు జరగడం లేదని ఆ నాయకుడి అనుచర గణం తేల్చి చెప్పడంతో.. ఆ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆమె నేరుగా ఫోన్‌లో మాట్లాడి సర్దిచెప్పినట్లు తెలిసింది. ఇలా అంతటా ఏదో ఒక సమస్యతో విభేదాలు పొడచూపుతూ.. పార్టీకి నష్టం చేస్తారని ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని