logo

వైకాపా ‘మేటి’.. ఉపాధి లూటీ

పేదల కడుపు నింపేందుకు రూపొందించిన ఉపాధి హామీ పథకం పెద్దలకు వరంలా మారింది. కూలీల కడుపుకొట్టి అధికార పార్టీ గ్రామ నాయకుల జేబులు నింపుకొంటున్నారు.

Updated : 28 Apr 2024 04:39 IST

న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ , హాలహర్వి, మద్దికెర

పేదల కడుపు నింపేందుకు రూపొందించిన ఉపాధి హామీ పథకం పెద్దలకు వరంలా మారింది. కూలీల కడుపుకొట్టి అధికార పార్టీ గ్రామ నాయకుల జేబులు నింపుకొంటున్నారు. ‘మేటీ’ల పేరుతో మేస్తున్నారు.. కార్లల్లో తిరిగేవారూ ఉపాధి హామీ కార్డులు తీసుకుంటున్నారు. పనులకెళ్లకపోయినా దొంగ మస్టర్లు వేసి నగదు జేబుల్లోకి వేసుకుంటున్నారు. సామాజిక తనిఖీల్లో వెలుగులోకి వచ్చినా అధికారపార్టీ ఒత్తిళ్లతో నిజనిర్ధారణలోనూ ‘ఓకే’ అంటూ తిరిగి కొలువుల్లో కొనసాగిస్తున్నారు.. కూలీలకు కనీసం ‘నీడ’ కల్పించడం లేదు.. భానుడు భగభగ మండిపోతున్నాడు.. గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటిపోయింది.. సౌకర్యాల ‘నీడ’ లేక ఉపాధి కూలీలు పిట్టల్లా రాలిపోతున్నారు.. అయినా సర్కారులో చలనం లేదు.


ఏటా రూ.505.83 కోట్ల ఖర్చు

గ్రామీణ పేద కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిరమైన సహజ వనరులను అభివృద్ధి చేయాలనేది పథకం లక్ష్యం. కానీ జగన్‌ సర్కారు ఈ పథకానికి అడుగడుగునా తూట్లు పొడుస్తోంది. ఏటా కర్నూలులో రూ.296.32 కోట్లు, నంద్యాలలో రూ.209.51 కోట్లు ఖర్చు చేస్తున్నారు.


మజ్జిగ, మంచినీళ్లు ఇవ్వరు

ఉపాధి కూలీలకు పని చేసే ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. మంచినీళ్లతో పాటు మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఇవ్వాలి. నీడ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించి మెడికల్‌ కిట్లను ఏర్పాటు చేయాలి. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా ఈ ఏర్పాట్లు లేవు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో కూడా వీటి గురించి పట్టించుకోవడం లేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా ఉపాధి కూలీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో నంద్యాల జిల్లాలో ఇటీవల ముగ్గురు కూలీలు వడదెబ్బకు మృతి చెందారు. నంద్యాల మండలం మిట్నాల గ్రామంలో షేక్‌ అక్బర్‌, పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఏసేబు, పాములపాడు మండలంలో మరో కూలీ మృతి చెందారు.

మొక్కల నిధులు మెక్కేశారు

ఉమ్మడి జిల్లాలో 2018 నుంచి 2022 మధ్యలో డ్వామా ద్వారా 1,500 కిలోమీటర్ల మేర రహదారుల పక్కన (అవెన్యూ) మొక్కలు నాటారు. వీటి కోసం వేతనాలు, సామగ్రి రూపంలో సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. మొక్కల కొనుగోలు నుంచి పెంపకం వరకు కొన్నిచోట్ల వెలుగు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. మొక్కల పెంపకంలో సుమారు రూ.3.13 కోట్లు పక్కదారి పట్టాయి. డోన్‌, ప్యాపిలి, ఆదోని, ఎమ్మిగనూరు, తుగ్గలి, గూడూరు, కోడుమూరు, ఓర్వకల్లు, పాణ్యం, బేతంచెర్ల, కొలిమిగుండ్ల మండలాల్లో ఎక్కువగా అక్రమాలు జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవెన్యూ ప్లాంటేషన్‌లో రూ.4 కోట్ల వరకు పక్కదారి పట్టించారు.

రూ.20 లక్షలు పక్కదారి

వెల్దుర్తి మండలం రామళ్లకోటలో 2022-23 సంవత్సరానికి సంబంధించి ఉపాధి పనులకు వెళ్లకుండానే అధికార పార్టీ నేతలు బిల్లులు పొందారు. అధికార పార్టీలో ఓ వర్గం వారు పనులకు వెళ్లకుండా మస్టర్లలో హాజరు వేసుకుంటూ సొమ్ము కాజేశారు. రూ.20 లక్షల వరకు పక్కదారి పట్టాయి. ఈ అంశాన్ని అధికార పార్టీలో మరో వర్గం వారు డ్వామా పీడీకి ఫిర్యాదు చేశారు.  మండలంలో ప్రతి గ్రామంలో ఇలాంటి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అవినీతికి ఆరు దారులు

ఉపాధి పనుల్లో భాగంగా తుగ్గలి నుంచి రాతన వెళ్లేందుకు ఉన్నది ప్రధాన మార్గం ఒక్కటే. అక్రమార్కులు ఆరు దారులున్నట్లు చూపుతూ.. అవెన్యూ ప్లాంటేషన్‌ పేరుతో బిల్లులు డ్రా చేశారు. ఈ దారుల్లో మొక్కలు నాటినందుకు రూ.55 లక్షలకు పైగా నిధులు అక్రమంగా డ్రా చేశారు. ఉన్న ఒక్క దారిలో ఒక్క మొక్క లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ మేటి

నిబంధనల ప్రకారం ఉపాధి కూలీలంతా కలిసి ఒకరిని ‘మేటి’గా ఎంపిక చేసుకుంటారు.. వారి ఆధ్వర్యంలో పనులు జరుగుతుంటాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయం చేశారు. ‘మేటి’ల ఎంపిక అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతోంది. గ్రామాల్లో కూలీలను విడగొట్టి తమ వర్గానికి చెందిన వ్యక్తికి పెత్తనం ఇస్తున్నారు. కూలీల హాజరును మేట్‌లు, క్షేత్ర సహాయకులు ప్రింటెడ్‌ పేపర్లలో మస్టర్లు వేస్తారు. హాజరు వేసి ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత సాంకేతిక సహాయకుడు పనికి సంబంధించి కొలతలు వేసి ఎం-బుక్‌ రికార్డు చేసి ఉన్నతాధికారుల ఆమోదముద్రతో బిల్లులు చెల్లిస్తారు. ఒక్కో మేటీ గ్రూపులో తనతో కలిపి 20 మంది సభ్యులు ఉండాలి. కానీ 60 నుంచి 150 వరకు ఉంటున్నారు. గ్రామంలో లేని వ్యక్తుల పేర్లతో కార్డులు సృష్టించి రోజూ పనికి హాజరవుతున్నట్లు మస్టర్లు వేస్తున్నారు. మరికొన్నిచోట్ల ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల కుటుంబాల పేర్లతో కార్డులిచ్చి మస్తరు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా నిత్యం 20 నుంచి 30 మంది పేర్లు చేర్చుతున్నారు. ఆ సొమ్మును పంచేసుకుంటున్నారు.. గ్రామాల్లో అధికార పార్టీ నిర్వహించే కార్యక్రమాలను దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఖర్చునూ భరిస్తున్నారు. అధికార పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించినప్పుడు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు.

వేసవి భత్యం ఎగ్గొట్టారు

నిబంధనల ప్రకారం ప్రతి కూలీకి ఫిబ్రవరిలో 25 శాతం, మార్చిలో 30 శాతం, ఏప్రిల్‌, మే నెలల్లో 35 శాతం, జూన్‌లో 20 శాతం అదనపు భత్యం ఇవ్వాలి. ప్రస్తుతం ఇస్తున్న రోజువారీ సగటు వేతనం రూ.300 పరిగణనలోకి తీసుకొంటే ఫిబ్రవరిలో రూ.75, మార్చిలో రూ.90, ఏప్రిల్‌, మే నెలల్లో రూ.105, జూన్‌లో రూ.60 ఇవ్వాలి. తెదేపా హయాం (2014-2019)లో ఏటా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు వేసవి భత్యం చెల్లించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేసింది. జగన్‌ నిర్వాకంతో ఒక్కో ఉపాధి కూలీ ఏటా రూ.6 వేలు నష్టపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా రూ.వంద కోట్ల వరకు కూలీలు నష్టపోవాల్సి వస్తోంది. ఇలా గత నాలుగేళ్లలో జగన్‌ సర్కార్‌ రూ.400 కోట్ల వరకు ఎగ్గొట్టింది.

అదనపు పనిదినాలు అడగొద్దు

కరవు మండలాల్లో అదనపు పనిదినాలు కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను జగన్‌ మట్టిలో కలిపేశారు. ఉపాధి చట్టం మార్గదర్శకాల ప్రకారం ఎక్కడైతే కరవు నెలకొందో అక్కడ 50 రోజుల పని దినాలు అదనంగా కల్పించాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో 30, రబీలో 36 కరవు మండలాలను ప్రకటించారు. ఇక్కడి ఉపాధి కూలీలకు ప్రస్తుతం కల్పిస్తున్న వంద రోజుల పని దినాలకు అదనంగా మరో 50 రోజుల పని కల్పించాలి. రెండు జిల్లాలో నిత్యం ఉపాధి పనికి వస్తున్న కూలీలు 2 లక్షలకుపైగా ఉన్నారు. వీరంతా 50 రోజుల పని దినాలు కోల్పోయారు. దీని విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంది.


నాయకులు.. ఉద్యోగులు

కృష్ణగిరి మండలం సి.హెచ్‌.యర్రగుడిలో 2019 నుంచి దొంగ మస్టర్లతో ఉపాధి నిధులు స్వాహా చేశారు. గ్రామంలో లేని వ్యక్తుల పేర్లు, మైనార్టీ సామాజికవర్గం పేర్లతో బోగస్‌ ఉద్యోగ కార్డులు 125 వరకు పుట్టించి, మూడేళ్లలో రూ.12 లక్షలకుపైగా స్వాహా చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి.

యంత్రంతో చేసి.. బిల్లులు కాజేసి

కృష్ణగిరి మండలం తొగర్చేడులో 2020-21 ఆర్థిక సంవత్సరంలో అధికార పార్టీ నాయకులు రాత్రికి రాత్రే పొక్లెయిన్లతో ఉపాధి పనులు చేసి బిల్లులు కాజేస్తున్నారు. ఇక్కడ 40 వరకు ఫారంపాండ్లు యంత్రాలతో తవ్వి మస్టర్లలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కోదానికి రూ.లక్ష వరకు నిధులు కేటాయించారు. చిట్యాలలో గతేడాది మొక్కల పెంపకం చేపట్టినట్లు దస్త్రాల్లో నమోదు చేసి బిల్లులు కాజేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని