logo

అనన్య ప్రతిభ

సివిల్స్‌ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆరుగురికి ర్యాంకులు రాగా మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్యరెడ్డి అత్యుత్తమ ప్రతిభ చూపారు.

Published : 17 Apr 2024 06:02 IST

సివిల్స్‌లో సత్తా చాటిన పాలమూరు బిడ్డలు
ఆరుగురికి  ర్యాంకులు

తల్లిదండ్రులు సురేశ్‌రెడ్డి, మంజులతతో అనన్యరెడ్డి

ఈనాడు, మహబూబ్‌నగర్‌: సివిల్స్‌ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆరుగురికి ర్యాంకులు రాగా మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్యరెడ్డి అత్యుత్తమ ప్రతిభ చూపారు. పట్టణంలోని లక్ష్మినగర్‌ కాలనీకి చెందిన దోనూరి సురేష్‌రెడ్డి, మంజులత కుమార్తె  అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి పాలమూరు ఖ్యాతిని ఇనుమడింపజేశారు. గతేడాది సివిల్స్‌ ఫలితాల్లో అప్పటి నారాయణపేట ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు కుమార్తె ఉమాహారతికి కూడా 3వ ర్యాంకు రావడం గమనార్హం. అనన్యరెడ్డి ఎలాంటి శిక్షణ లేకుండానే మొదటి ప్రయత్నంలోనే సత్తా చాటడంతో ఆమె చదువుకున్న పాఠశాలల ఉపాధ్యాయులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్‌కు చెందిన డాక్టర్‌ విజయలక్ష్మి, గోవర్దన్‌ మనుమడు అక్షయదీపక్‌ సివిల్స్‌లో 196వ ర్యాంకు సాధించారు. గతేడాది రెండో ప్రయత్నంలో 759వ ర్యాంకు సాధించగా ప్రస్తుతం డిఫెన్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మూడో ప్రయత్నంలో మెరుగైన ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు జి.దీపక్‌, మాధవి హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో నివాసం ఉంటున్నారు.

అనుప్రియ

ముగ్గురేసి అమ్మాయిలు, అబ్బాయిలకు ర్యాంకులు: యూపీఎస్సీ మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో పాలమూరు వాసులకు నాలుగు ర్యాంకులు వచ్చాయి. అనన్యరెడ్డితోపాటు వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఇబ్రహీం ఖలీల్‌ కుమార్తె ఎహతేదా ముఫసిర్‌కు 278వ ర్యాంకు వచ్చింది. ఆమె కూడా ఎలాంటి శిక్షణ తీసుకోకుండా సొంతంగా సివిల్స్‌కు సన్నద్ధమై సత్తా చాటారు. రెండో ప్రయత్నంలోనే ముఫసిర్‌ సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించడంతో ఆత్మకూరు పట్టణంలో హర్షం వ్యక్తమవుతోంది.  ప్రస్తుతం వీరి కుటుంబం మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటోంది. పట్టణంలోని పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పోచమ్మగడ్డతండాకు చెందిన ఉమాపతి, పద్మ దంపతుల కుమారుడు యశ్వంత్‌నాయక్‌ 627వ ర్యాంకు సాధించడంతో తండావాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బాలానగర్‌ మండలం తిరుమలగిరి చెందిన అనుప్రియకు 914 ర్యాంకు వచ్చింది. ఆమె భర్త కూడా సివిల్‌ ర్యాంకరే కావడం విశేషం. గతేడాది పాలమూరు బిడ్డలకు రెండు ర్యాంకులు రాగా ఈసారి ఏకంగా ఆరుగురికి ర్యాంకులు వచ్చాయి.

ఇద్దరూ తాతయ్య స్ఫూర్తితోనే..: జాతీయస్థాయిలో 3వ ర్యాంకు పొందిన అనన్యరెడ్డి, 278వ ర్యాంకు పొందిన ఎహతేదా ముఫసిర్‌ ఇద్దరూ తాతయ్య స్ఫూర్తితోనే సివిల్స్‌లో విజయం సాధించడం విశేషం. వీరిద్దరూ కూడా తరుచూ సివిల్స్‌పై వారి తాతయ్యలతో మాట్లాడేవారు. ఇద్దరూ కూడా దిల్లీలోనే డిగ్రీ చదవడం విశేషం. అనన్యరెడ్డి దిల్లీ యూనివర్సిటీలోని మిరిండా హౌజ్‌లో, ఎహతేదా ముఫసిర్‌ దిల్లీలోని శ్రీరాం కళాశాలలో బీఏలో డిగ్రీ పూర్తి చేయడం విశేషం. వీరిద్దరూ ఎలాంటి కోచింగ్‌ లేకుండా విజయాలు సాధించారు.  


సివిల్స్‌లో 278వ ర్యాంకు

ఆత్మకూరు, న్యూస్‌టుడే : వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన ఎహెతేదా ముఫసిర్‌ సివిల్స్‌లో 278వ ర్యాంకు సాధించారు. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం మహబూబ్‌నగర్‌లో పూర్తి చేశారు. ఇంటర్‌ బైపీసీ చదివిన ఈమె దిల్లీలోని శ్రీరాం కళాశాలలో బీఏ పూర్తి చేశారు. రాజనీతి శాస్త్రం ఆప్షనల్‌గా యూపీఎస్‌సీ పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం పీజీ చదివేందుకు అనేక అవకాశాలు ఉన్నా సివిల్స్‌ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా తన ప్రయత్నాన్ని కొనసాగించారు.  

తాతయ్య కోరిక నెరవేర్చా : ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన తాతయ్య సయ్యద్‌ ఖాసీం కోరిక మేరకు సివిల్స్‌కు ఎంపిక కావాలనే తపన ఉండేది. మా నాన్న 1992-93లో సివిల్స్‌ పోటీ పరీక్షకు హాజరై ఆశించిన స్థాయిలో ర్యాంకు సాధించలేక పోయారు. తాతయ్య కోరిక నెరవేర్చేందుకు మా నాన్న నాతో పాటు అక్కకు సివిల్స్‌ పోటీ పరీక్షలకు ప్రోత్సహించారు. ఎలాంటి శిక్షణ తీసుకోకున్నా ఆయన సమకూర్చిన స్టడీ మెటీరియల్‌పై ఆధారపడ్డాం. పట్టుదల, సంకల్పం మేరకు ఎక్కువ సమయం చదువుకు కేటాయించా. అమ్మ, నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. తాతయ్య కోరిక మేరకు ఉన్నత ఉద్యోగ శిక్షణ పూర్తిచేసి, సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.

ఎహెతేదా ముఫసిర్‌


మెరిసిన గిరిజన ఆణిముత్యం

జడ్చర్ల పట్టణం, బాలానగర్‌ : సివిల్స్‌ - 2023 ఫలితాల్లో జడ్చర్ల మండలం మాచారం పంచాయతీ చాకలిగడ్డతండాకు చెందిన శశికాంత్‌  891వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. పదో తరగతి వట్టెంలోని జహవర్‌ నవోదయ విద్యాలయంలో, ఇంటర్‌, బీటెక్‌ హైదరాబాద్‌లో చదివారు. దిల్లీలో పీజీ పూర్తిచేసిన ఆయన సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా ముందుకెళ్లారు. 2019లో సివిల్స్‌ పరీక్ష రాయగా 695వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం అసోంలో ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీసు అధికారి(ఐఆర్‌టీఎస్‌)గా పనిచేస్తున్నారు. 2023లో నిర్వహించిన సివిల్స్‌ పరీక్షలు రాయగా 891వ ర్యాంకు వచ్చింది. కోచింగ్‌ తీసుకోకుండా ఐదు నెలలు కష్టపడి చదివి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రాశానని ఆయన పేర్కొన్నారు. శశికాంత్‌కు భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈసారి పోస్టులు పెరిగినందున ఐఆర్‌ఎస్‌ వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా శశికాంత్‌ మాట్లాడుతూ అఖిల భారత సర్వీసుల్లో అంకితభావంతో విధులు నిర్వహించి, ఉత్తమ అధికారిగా సమాజానికి సేవ చేస్తానని పేర్కొన్నారు.


సమాజ సేవే లక్ష్యంగా..

కల్వకుర్తిపట్టణం, వెల్దండ, న్యూస్‌టుడే : సమాజానికి సేవచేయాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదులుకొని సివిల్స్‌కు సిద్ధమై  లక్ష్యాన్ని సాధించారీ గిరిపుత్రుడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన యశ్వంత్‌ నాయక్‌   సివిల్స్‌ ఫలితాల్లో 627వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. తల్లిదండ్రులు పద్మ, ఉమాపతి పోత్సాహంతో పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించాడు. యశ్వంత్‌ తండ్రి బ్యాంకు ఉద్యోగి కావడంతో ప్రాథమిక విద్య అంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పూర్తయింది. 8వ తరగతి నుంచి 10 వరకు హైదరాబాద్‌లోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదివాడు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌ ప్రైవేట్‌ కళాశాలలో పూర్తిచేసి ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అభ్యసించాడు. ఆరు నెలలు గుర్‌గావ్‌లో ఉద్యోగం చేశారు. ఉద్యోగం పట్ల సంతృప్తి లేకపోవడంతో 2021 మార్చి నుంచి సివిల్స్‌కు సిద్ధమయ్యానన్నాడు. ఐఏఎస్‌ కావడమే లక్ష్యమని, ప్రజల మధ్య ఉంటూ సమాజానికి సేవ చేయాలనే ఆశయంతో పట్టుదలతో చదివానని యశ్వంత్‌ ‘న్యూస్‌టుడే’తో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని