logo

మున్సిపల్‌ సమావేశానికి నిరసన సెగ

పురపాలక సమావేశం వేదికగా భారాస నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు.

Published : 30 Mar 2023 02:36 IST

కంటతడి పెట్టిన అధ్యక్షురాలు
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

పురపాలక సమావేశం వేదికగా భారాస నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. రూ.88.19 కోట్లతో సిద్ధం చేసిన మున్సిపల్‌ బడ్జెట్‌ను ఎలాంటి చర్చ లేకుండానే  ఆమోదించారు. అధ్యక్షురాలిపై అవిశ్వాసం నోటీసు ఇచ్చిన భారాస అసంతృప్త కౌన్సిలర్లు నల్ల మాస్కు ధరించి నిరసన తెలిపారు. అనంతరం సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లి నిరసన కొనసాగించారు.

సమస్యలపై నిలదీత

పట్టణంలోని పలు సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. పారిశుద్ధ్య పర్యవేక్షకులు సైదులు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. ఇదంతా అవాస్తమని సైదులు వివరణ ఇచ్చారు. మద్యం తాగి విధులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ చంద్రశేఖర్‌ సర్ది చెప్పారు. విధులు నిర్వహించకుండా వేతనాలు తీసుకుంటున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కొందరు సభ్యులు ప్రశ్నించారు. తాను ఉద్యోగుల అటెండెన్స్‌ పరిశీలిస్తున్నానని, విధులకు రాకుండా ఎవరైనా వేతనాలు తీసుకుంటే తొలగిస్తామని కమిషనర్‌ తెలిపారు. డంప్‌యార్డులో ఓ ఉద్యోగికి రూ.50 వేలు ఇచ్చినట్లు కౌన్సిల్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చిందని కౌన్సిలర్లు అడగగా, వారిని పిలిపించి మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పట్టణంలో అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కోరారు. కొన్ని చోట్ల పురపాలక సంఘం నుంచి ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు రావడం లేదని కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ అన్నారు. హెచ్‌ఎండీఏకు లేఖ రాస్తానని కమిషనర్‌ చెప్పారు.

అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన: తనపై కొందరు కౌన్సిలర్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సమావేశం ముగిసిన తరువాత అధ్యక్షురాలు విజయలక్ష్మీ కంటతడి పెట్టారు. తమ బంధువుల్లో ఆరుగురు పేదలు ఉండటంతోనే వారికి పురపాలక సంఘంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా తీసుకున్నామని తెలిపారు. మూడు సార్లు అధ్యక్షురాలిగా పని చేశానని, ఇప్పటి వరకు తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. కౌన్సిలర్ల వాట్సాప్‌ గ్రూపులో తనపై కొందరు కౌన్సిలర్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని