logo

కాల్వలో కలసిపోతున్న ప్రాణాలు

జిల్లావాసుల తాగు, సాగునీటి కష్టాలు తీర్చుతున్న ఏఎమ్మార్‌ ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు జలాశయాలు, కాల్వలు ఏళ్ల తరబడి నిర్వహణకు నోచుకోకపోవడంతో అడుగడుగునా ప్రమాదాలకు నెలవయ్యాయి. అనుసంధానకాల్వలో, అక్కంపల్లి జలాశయం, పుట్టంగండి జలాశయాల్లో పలువురు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. జిల్లాలో జలప్రమాదాలకు ఈ ప్రాజెక్టు కాల్వలే కారణమవుతున్నాయ

Published : 27 Jan 2022 03:50 IST

పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే: జిల్లావాసుల తాగు, సాగునీటి కష్టాలు తీర్చుతున్న ఏఎమ్మార్‌ ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు జలాశయాలు, కాల్వలు ఏళ్ల తరబడి నిర్వహణకు నోచుకోకపోవడంతో అడుగడుగునా ప్రమాదాలకు నెలవయ్యాయి. అనుసంధానకాల్వలో, అక్కంపల్లి జలాశయం, పుట్టంగండి జలాశయాల్లో పలువురు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. జిల్లాలో జలప్రమాదాలకు ఈ ప్రాజెక్టు కాల్వలే కారణమవుతున్నాయని అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా సమస్యల పరిష్కారానికి కన్నెత్తి చూడడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హామీలివ్వడం ఆ తర్వాత ఆయా హామీలు నీటిమీద రాతలుగానే మిగులుతుండడంతో ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది.

బాధిత కుటుంబాల్లో తీరని విషాదం
పుట్టంగండి జలాశయం నుంచి అక్కంపల్లి జలాశయం వరకు అనుసంధాన కాల్వలో మూడేళ్ల క్రితం 2018 ఏప్రిల్‌ 6న పడమటితండా సమీపంలో కూలీల ట్రాక్టర్‌ బోల్తా పడి 10 మంది కూలీలు జలసమాధైన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరో ఏడాదిన్నర తర్వాత 2020లో వడ్డెరిగూడేనికి చెందిన ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా అనుసంధాన కాల్వలో పడి దంపతులతోపాటు యువతి మృతిచెందారు. తాజాగా బుధవారం నాంపల్లి మండలం నెమిళ్లగూడెంకు చెందిన ఇరు కుటుంబాలకు చెందిన ఆరుగురు ఇన్‌ఫాల్‌రెగ్యులేటర్‌ల వద్ద కాల్వలో పడి నలుగురు బయటపడి ఇద్దరు యువకులు మృతిచెందారు. వీటితో పాటు జలాశయాల్లో చేపల వేటకు వచ్చి ఈత రాక ప్రమాదవశాత్తు ఇరవై మందికి పైగా అసవులుబాయగా.. పలు బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో కూరుకుపోయాయి.

నోచుకోని రక్షణ గోడ
పుట్టంగండి నుంచి అక్కంపల్లి జలాశయం వరకు 9.260 కిలోమీటర్లు విస్తరించిన ఈ అనుసంధాన కాల్వ సమీపంలో వద్దిపట్ల, పలుగుతండా, వడ్డెరిగూడెం, దుగ్యాల, తిర్మలగిరి, మదారిగూడేనికి చెందిన వందల సంఖ్యలో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. పడమటితండా సమీపంలో ట్రాక్టర్‌ ప్రమాదం సమయంలో మంత్రి, కలెక్టర్‌ పడమటితండా వద్ద రక్షణగోడ నిర్మించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. సదరు హమీకి నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రూ.కోట్లు వెచ్చించి రక్షణ గోడ, లైనింగ్‌ చేపడుతామని చివరికి రూ.10 లక్షలు వెచ్చించి కిలోమీటరు దూరం తాత్కాలిక ఫెన్సింగ్‌ మాత్రమే ఏర్పాటు చేశారు. అది కాస్త నాణ్యత లేక ఏర్పాటు చేసిన ఏడాదికే కూలి శిథిలమై పూర్వపు పరిస్థితి నెలకొంది. జంటనగరాల తాగునీటి అవసరాల రీత్యా నిత్యం నీటి సరఫరా చేసే ఈ కాల్వ.. పడమటి తండా వద్ద భారీగా కోతకు గురై ప్రమాదకరంగా మారింది.

కనిపించని హెచ్చరిక బోర్డులు
ప్రాజెక్టు కాల్వలు ప్రమాదాలకు నిలయంగా మారినా జలాశయాలు, కాల్వలవద్ద ప్రమాదహెచ్చరిక బోర్డులు ఏక్కడా కనిపించవు. పడమటితండా సమీపంలో మూడు, నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన ప్రమాద హెచ్చరిక బోర్డులు ప్రస్తుతం కనిపించడం లేదు. ప్రాజెక్టు పరిధిలో ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించి హెచ్చరిక బోర్డులతో పాటు జనసంచారం అధికంగా ఉండే ప్రదేశంలో ఇనుప రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తే కొంత వరకు ప్రమాదాలు నిర్మూలించిన వారవుతారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


తగిన చర్యలకు కసరత్తు
- జగన్మోహన్‌రెడ్డి, ఈఈ డివిజన్‌-4, అంగడిపేట స్టేజీ

అనుసంధాన కాల్వలో పడమటితండా వద్ద 700 మీటర్ల రక్షణగోడకు రూ.4.995 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపించాం. దీనితో పాటు మిగిలిన కాల్వ పరిధిలో ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి రక్షణ గోడల నిర్మాణానికి అంచనాలు రూపొందిస్తాం. పడమటితండావద్ద రక్షణగోడకు త్వరలో టెండర్లు నిర్వహించి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయిస్తాం.


హమీకే పరిమితమైంది
- రమావత్‌ హరి, పడమటితండా

మా తండావద్ద కాల్వలో ట్రాక్టర్‌ ప్రమాదంలో పది మంది మృతిచెందిన కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన నాయకులు, అధికారులు రక్షణ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు సమీపిస్తున్నా ఇప్పటికీ గోడ నిర్మించలేదు. కేవలం తాత్కాలికంగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. అదికూడా పూర్తిగా శిథిలమై కూలిపోతోంది. పుట్టంగండి నుంచి కాల్వ ఎక్కడ చూసినాపెద్దగా కోతకుగురై ప్రమాదకరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని