logo

Yadagirigutta: పాపం పసివాళ్లు

అభం శుభం తెలియని పసివాళ్లు.. వేలుపట్టుకుని నడిపించాల్సిన తండ్రి మధ్యలోనే వదిలేసి తన దారి చూసుకున్నాడు.

Updated : 23 Jan 2023 11:33 IST

సహజీవనానికి అడ్డొస్తున్నారని పిల్లల్ని వదిలేసిన తల్లి
ట్రాఫిక్‌ పోలీస్‌ చొరవతో సంరక్షణ కేంద్రానికి

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: అభం శుభం తెలియని పసివాళ్లు.. వేలుపట్టుకుని నడిపించాల్సిన తండ్రి మధ్యలోనే వదిలేసి తన దారి చూసుకున్నాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి మరొకరితో కొనసాగిస్తున్న సహజీవనానికి అడ్డొస్తున్నారని పిల్లల్ని ఊరుకానీ ఊరిలో వదిలేసింది. ఎందుకు వదిలేశారో తెలియని పసితనం. తమ భవిష్యత్తు ఏమిటో తెలియని అమాయకత్వంతో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న ఆ పిల్లల్ని ట్రాఫిక్‌ పోలీస్‌ చొరవతో సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన యాదగిరిగుట్టలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ సీఐ శివశంకర్‌, ఎస్సై సుధాకర్‌ ఆదివారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద, ఆ తర్వాత బస్టాండ్‌ వద్ద ముగ్గురు 8,7,5 ఏళ్ల చిన్నారులు అనుమానాస్పదస్థితిలో తిరుగుతుండటంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీస్‌ కోటి గమనించాడు. దగ్గరకు వెళ్లి ఆరా తీసి, తప్పిపోయిన పిల్లలుగా భావించి యాదగిరిగుట్ట ఠాణాలో అప్పగించాడు.

ఎస్సై వారి నుంచి వివరాలు సేకరించగా తమది రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌, భగత్‌సింగ్‌ కాలనీ అని పేర్కొనడంతో అక్కడి ఠాణాకు సమాచారం ఇచ్చారు. ఐతే తల్లిదండ్రులది ప్రేమ వివాహమని, పిల్లలు కలిగాక కలహాల కాపురంతో మూడేళ్ల క్రితం తండ్రి కుటుంబాన్ని వదిలేసి పోయాడని, ఆ తర్వాత తల్లి ఆటోడ్రైవర్‌తో సహజీవనం సాగిస్తోందని, వీరికి కూడా ఒక పాప కలిగిందని స్థానికుల ద్వారా తెలిసింది. సంబంధికుల కోసం విచారించగా పిల్లల పెద్దనాన్నకు సమాచారం ఇచ్చారు. అతను అందుబాటులో లేనని చెప్పడంతో పిల్లలను జిల్లా బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల తర్వాత పెద్దనాన్న వచ్చి ఈ పిల్లలు తన తమ్ముడి పిల్లలే అని గుర్తించినప్పటికీ, తన తమ్ముడు వీరికి దూరంగా ఉంటున్నాడని, పిల్లలతో తనకు సంబంధం లేదని వెళ్లిపోయాడు. వీరిని ఈ నెల 20న బాలల సంరక్షణ సమితి ఎదుట ప్రవేశపెట్టారు. అక్కడ పిల్లలు కొన్ని విస్తుపోయే విషయాలు తెలిపారు.

తమను ఈ నెల 14 అర్ధరాత్రి తన తల్లి, మరో వ్యక్తి ఆటోలో యాదగిరిగుట్టకు తీసుకువచ్చి, కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వదిలేశారని పోలీసులకు వివరించారు. ఆ తర్వాత తాను కట్లు విప్పుకొని, చెల్లె, తమ్ముడిని విడిపించినట్లుగా ఆ బాలుడు పేర్కొన్నాడు. సహజీవనానికి అడ్డువస్తున్నారనే కారణంతో చిన్నారులను యాదగిరిగుట్టలో వదిలేసినట్లుగా వ్యక్తమవుతుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శిశువిహార్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి, మధురానగర్‌ శిశువిహార్‌లో 7,5 ఏళ్ల చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. తప్పిపోయిన పిల్లలుగా భావించి తాము కేసు పెట్టలేదని, ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదని ఎస్సై సుధాకర్‌ తెలిపారు. ట్రాఫిక్‌ పోలీస్‌ కోటి ఈ పిల్లల్ని సంరక్షించి ఠాణాకు చేర్చి బాధ్యతగా వ్యవహరించాడని, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని