logo

నాటకాలు అలరించె.. ఆహుతులను మెప్పించె

  తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం సంయుక్త నిర్వహించిన జాతీయస్థాయి నాటక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి.

Updated : 22 Mar 2023 05:40 IST

ముగిసిన జాతీయస్థాయి నాటకపోటీలు

పద్యనాటక పోటీల్లో జాతీయ స్థాయి ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైన కర్నూలు జిల్లా టీజీవీ కళాక్షేత్రం వారి ‘ శ్రీ కృష్ణ కమలపాలిక’ నాటక విజేతలకు బహుమతి అందజేస్తున్నఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి 

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం సంయుక్త నిర్వహించిన జాతీయస్థాయి నాటక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. జాతీయస్థాయి పద్య, సాంఘిక నాటక పోటీల్లో విజేతలకు వేర్వేరుగా బహుమతులను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. నాటకాలు సజీవంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. తాను ఇప్పటి వరకు నాటకాలు చూడలేదని,  మొదటిసారి వీక్షించడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. నాటకాలు, కళల పరిరక్షణకు ఎంతో కృషిచేస్తున్న మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం ప్రతినిధుల్ని అభినందించారు. మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం అధ్యక్షుడు బోయినేపల్లి భుజంగరావు మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే మొదటిసారిగా జాతీయస్థాయి నాటకపోటీలను 11 రోజులపాటు నిర్వహించగలిగామన్నారు. చంద్రశేఖర్‌రావు, పులి కృష్ణమూర్తి,  మామిడాల ఉపేందర్‌, విద్యారత్న, శ్రీనివాసశర్మ, శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణశర్మ, పి.రామావతారం, చిల్లంచర్ల చంద్రశేఖర్‌, బాపనయ్య, బాబురావు, రాఘవయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి పద్యనాటక పోటీల విజేతలు... ఉత్తమ ప్రదర్శన కనబర్చిన కర్నూలు టీజీవీ కళాక్షేత్రం వారు ‘ శ్రీకృష్ణ కమలపాలిక’ నాటికకు ( రూ.40వేలు నగదు) మొదటి బహుమతి పొందగా, కాకినాడ శ్రీ సీతారామాంజనేయ నాట్యమండలి ‘నర్తనశాల’ కు( రూ.30వేలు నగదు) ద్వితీయ బహుమతి లభించింది. హైదరాబాద్‌ మురళీకృష్ణ నాట్యమండలి వారి ‘ వసంతరాజీయం’( రూ.20వేలు నగదు) నాటిక తృతీయ బహుమతి సొంతం చేసుకుంది. వరంగల్‌ స్టార్‌ బ్రదర్స్‌ సాంస్కృతిక కళాపరిషత్‌ వారి ‘ విజయానిరుద్ధం’ నాటకం జ్యూరీ ప్రదర్శనగా ఎంపికయ్యింది. వీటితో పాటు 19 మంది నటీనటులకు వ్యక్తిగతంగా బహుమతులు అందజేశారు. ఉత్తమ సంగీతం, అలంకరణ, ఆహార్యం విభాగాల్లోనూ బహుమతులు అందించారు.

జాతీయస్థాయి సాంఘిక నాటక పోటీల విజేతలు ... జాతీయస్థాయి సాంఘిక నాటక విభాగంలో హైదరాబాద్‌ కర్టెన్‌కాల్‌ థియేటర్‌ వారి ‘పెట్రోమాక్స్‌ పంచాయతీ’ ప్రదర్శనకు మొదటి బహుమతి లభించగా ( రూ.20వేలు నగదు), హైదరాబాద్‌  సిరిమువ్వ కల్చరల్‌ అసోసియేషన్‌ వారి ‘థింక్‌’ నాటికకు ద్వితీయ బహుమతి(రూ.15వేలు నగదు), కరీంనగర్‌ చైతన్య కళాభారతి వారి ‘చీకటిపువ్వు’ (రూ.10వేలు నగదు) నాటికకు తృతీయ బహుమతి లభించింది. జ్యూరీ ప్రదర్శనగా కొప్పోలు పండు క్రియేషన్స్‌ వారి ‘పక్కింటి మొగుడు’ నాటకం ఎంపికయ్యింది. వీటితో పాటు వ్యక్తిగతంగా 19 మంది నటీనటులకు బహుమతులు అందజేశారు. ఉత్తమ సంగీతం, అలంకరణ, ఆహార్యం విభాగాల్లోనూ బహుమతుల్ని అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని