logo

విజ్ఞాన సంస్కారం.. కీర్తి పురస్కారం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన గ్రంథాలయకర్త అనుముల శ్రీనివాస్‌కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది.

Updated : 16 Mar 2024 06:48 IST

చిట్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన గ్రంథాలయకర్త అనుముల శ్రీనివాస్‌కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ఈనెల 21న నాంపల్లిలోని విశ్వవిద్యాయలంలో ప్రదానం చేయనున్నారు. అనుముల శ్రీనివాస్‌ చదువుకునే రోజుల్లో గ్రామంలో ఒక దినపత్రిక, మాస పత్రిక వచ్చేది. చదివే వారు ఎక్కువగా ఉండటంతో పత్రికలు దొరకడం కష్టంగా మారేది. గ్రంథాలయం లేని లోటును భవిష్యత్తు తరానికి రానివ్వొద్దని నిశ్చయించుకొని తన తోటి మిత్రులతో కలిసి సమష్టిగా స్వచ్ఛందంగా గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 14 ఏప్రిల్‌ 2006న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య చేతుల మీదుగా దీనిని ప్రారంభింపజేశారు. దీనిని వినియోగించుకుని సుమారు 30 మంది యువకులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇలా 18 సంవత్సరాలుగా విజ్ఞాన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

రెండు రాష్ట్రాల్లో ...

 గుండ్రాంపల్లిలో గ్రంథాలయ ఏర్పాటు స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, పెద్దపల్లి, కడప, చిత్తూరు ప్రాంతాల్లో తనకున్న పరిచయాలతో యువకులలో చైతన్యం నింపి గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారు. పలు గ్రామాల్లో స్థానికుల సహకారంతో గ్రంథాలయాలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


 ప్రతి గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటే లక్ష్యం
- అనుముల శ్రీనివాస్‌, గ్రంథాలయ వ్యవస్థాపక ఛైర్మన్‌, గుండ్రాంపల్లి

కీర్తి పురస్కారానికి గ్రంథాలయకర్తగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. నా తోటి స్నేహితులు, విద్యావంతులు, గ్రామస్థుల సహకారంతో మా స్వగ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేశాం. వట్టికోట ఆల్వారుస్వామి కలలుగన్న మిషన్‌ వట్టికోటతో ప్రతి గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటికే గుండ్రాంపల్లి గ్రంథాలయాన్ని స్ఫూర్తిగా చాలా చోట్ల గ్రంథాలయాలు ఏర్పాటు చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని